YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విలవిలలాడుతున్న బెజవాడ

విలవిలలాడుతున్న బెజవాడ

విజయవాడ, సెప్టెంబర్ 4
కనీ, వినీ ఎరుగని వరదలివి. ఒక్కసారిగా కృష్ణమ్మ ఉప్పొంగిపోయింది. కృష్ణా నదిలో సంగమించే మున్నేరు.. బుడమేరు ఉగ్రరూపం దాల్చాయి. కుండపోత వానలతో వాన నీరు వరదనీరుగా మారి ఊళ్లను.. విజయవాడ నగరంలోని పలు కాలనీలను ముంచెత్తింది. గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అతి పెద్ద వరదల్లో ఇప్పుడు విజయవాడ వరద కూడా వచ్చి చేరింది. విజయవాడ నగరంలో 40% పైగా ప్రాంతము వరద  ముంపునకు గురయింది.  నగరం చుట్టూ ఉన్న రెండు నదులు, కృష్ణా – బుడమేరు ఒడ్డు దాటి నగరాన్ని ముంచెత్తాయి. విజయవాడలో ఎప్పుడూ వరద అంటే తెలియని చాలా ప్రాంతాలు కూడా ఈసారి వరదల్లో మునిగిపోయాయి అంటే వరద తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.  ఈ వరదలు  ఎన్టీఆర్ జిల్లాలో 2.76 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేశాయి.  మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వయనాడ్ బీభత్సం తెలియజేస్తే లేటెస్ట్‌గా బెజవాడ వరదలు మరోసారి కన్నెర్రశాయి. ముఖ్యంగా విజయవాడ సిటీ మధ్యలో ప్రవహించే బుడమేరు అనే చిన్న నది నాలుగు జిల్లాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. విజయవాడ సిటీ అయితే రెండు రోజులుగా నిద్ర పోవడం లేదు. సగానికిపైనే నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. విజయవాడ శివారు గ్రామాలు, ఏరియాలు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సింగ్‌నగర్, రామకృష్ణాపురం, నందమూరినగర్, నున్న, విజయవాడ వన్‌టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలలో ఇళ్ళలోకి నీరు చేరిపోయింది. రామవరప్పాడు రైల్వే స్టేషన్ అయితే మొత్తానికి నీట మునిగింది. బుడమేరు వాగు తన విశ్వ రూపాన్ని చూపిస్తోంది. దాని కట్ట తెగిపోవడంతో విజయవాడను ముంచెత్తింది. చాలామంది ప్రజలు మునిగిపోయిన ఇళ్ళలోనే ఇంకా చిక్కుకు పోయారు. వారిని కాపాడటానికి కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లు ప్రత్యేకంగా విజయవాడ చేరుకున్నాయి.బుడమేరు అనేది మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. అయితే చరిత్రలో చాలా ఏళ్ళ నుంచి దానిని నదిగానే పరిగణిస్తూ అంటారు. ఏడాది పొడువునా ఏదో ఒక స్థాయిలో దీన్లో నీళ్ళు ఉంటాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సప్లయి చేసే అతి ముఖ్యమైన వాగుల్లో పుట్టిన ప్రాంతం నుంచి దాదాపు 170km దూరం ప్రవహించే బుడమేరులో ఏటా 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే 2005 ప్రాంతంలో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది అని చెబుతారు. అప్పుడే విజయవాడ చాలా వరకూ దెబ్బతింది. ఆ తరువాత 2009లో మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలికలు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినపుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలకు చేరిపోతూ ఉండేది. అందుకే ఈ నదికి బెజవాడ దుఃఖ:దాయని అని పేరు పడింది. 2005లో వచ్చిన భారీ వరదలు చూసిన ఇరిగేషన్ శాఖ బుడమేరు నది పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలనే సూచన చేసింది. దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగినా తరువాత పూర్తిగా పక్కన పెట్టేశారు. బుడమేరు నుంచి నీరు రెండు భాగాలుగా ఒకటి డైరెక్ట్‌గా కొల్లేరు చేరుకుంటే మరొకటి కృష్ణలో కలుస్తుంది. ఈ కృష్ణలో కలిసే భాగం మధ్యలో పోలవరం నుంచి వచ్చే కాలువతో చేరుతుంది. కొల్లేరుకు వెళ్ళే నది మధ్యలో కృష్ణ నుంచి విజయవాడ సిటీ మధ్యగా ప్రవహించే ఏలూరు కెనాల్‌లో కలుస్తుంది. బుడమేరు ప్రవహించే ప్రాంతంలో ఈ రెండు దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో తక్కువ రేటుకే స్థలం లభిస్తుండడంతో పేద మధ్య తరగతికి చెందిన ప్రజలు కొనుగోలు చేసి ఇళ్ళు కట్టుకున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ వారికి అండగా నిలబడడంతో అధికారులు కూడా మిన్నకుండి పోయారు అనే ఆరోపణలు ఉన్నాయి. దానితో బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు భారీ వర్షాలు కురియడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆ ఆక్రమణలను ముంచేసింది ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో బుడమేరుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూచనలతో రిటైనింగ్ వాల్ నిర్మించడంతోపాటు నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగిస్తేనే బుడమేరుతో బెజవాడకు ఉన్న ప్రమాదం తొలగుతుంది అని పర్యావరణ వేత్తలు నిపుణులు చెబుతున్నారు .నగరం వేగంగా విస్తరించడం, బుడమేరు వాగు వరద మార్గాన్ని ఆక్రమణలు చేయడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. బుడమేరు ప్రవాహాన్ని మళ్లించడానికి గతంలో చేసిన ప్రయత్నాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.  ప్రతిపాదిత పరిష్కారాలు అలాగే రాజకీయ ఎన్నికల హామీలు ఉన్నప్పటికీ విజయవాడ నగరం వరద ముప్పును తప్పించే పరిస్థితి మాత్రం ఇప్పటికీ రాలేదు. ప్రతి వానాకాలంలోనూ కొన్ని కాలనీలు వరదల్లో మునుగుతూనే ఉన్నాయి.

Related Posts