ఏళ్లు గడుస్తున్నాయి... కాలం పరుగులు తీస్తోంది.. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది.. విద్యకోసం ఇంటింట ప్రచారం వారి దరి చేరడం లేదు. జ్ఞానధార... వారికి విజ్ఞానాన్ని అందించడం లేదు. అంగన్‌వాడీ చదువులు అక్కరకు రావడం లేదు. సంక్షేమ పథకాలు అం దని ద్రాక్షగా మారాయి. రాయితీలు అందుకునే తెలివి లేక పక్కదారి పడుతున్నాయి. ఫలితం... వారి జీవితాలు ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారాయి. దీనికి విజయనగరం జిల్లాలోని గిరిశిఖర గ్రామాల ప్రజల జీవన విధానాలు, బడి వయసులో బయట ఉన్న పిల్లలే నిలువెత్తు సాక్ష్యం. పదుల సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి పరీక్షించే సామర్థ్యం సొంతమైనా... గిరిపుత్రుల అభివృద్ధికి ఆధారమైన అక్షరాల ను నేర్పలేకపోతున్నాం. చదువు విలువ తెలియజేయలేని పరిస్థితి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు ఇప్పటికీ చదువుకుంటే అభివృద్ధి చెందుతాం... పిల్లలు బాగుపడతారన్న విషయాలు తెలియవు. ఆటలాడుకునే వయసులోనే తల్లులుగా, పిల్లలను ఆడించే అమ్మలుగా మారుతున్నారు. బడికి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను భుజాన మోస్తున్నారు.గ్రామాల్లో బడి బయట పిల్లల గుర్తింపునకు విద్యాశాఖ, వెలుగు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యాశాఖ ఆద్వర్యంలో బడిపిలుస్తోందిలో భాగంగా విద్యాశాఖ అధికారులు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించారు. ఐటీడీఏ సబ్‌ప్లాన్ పరిధిలోని 8 మండలాలకు సంబందించి వెలుగు ఆధ్వర్యంలో సాధికార మిత్రలతో ప్రత్యేకంగా బడి బయట పిల్లలు సంఖ్యను గుర్తించారు. అందులో బడికి వెళ్లేవారికంటే బడిబయట ఉన్నవారే అధికంగా ఉండడం గమనార్హం. విద్యాభ్యాసన లేకపోవడంతో గిరిశిఖర గ్రామాల ప్రజల తలరాతలు మారడం లేదు. తమ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నామన్నది మాటలకే పరిమితమవుతుండడం శోచనీయం.గిరిశిఖర గ్రామాల్లోని ప్రజలకు రెక్కాడితే కాని డొక్కాడని వైనం. తల్లిదండ్రులు పొద్దున్నే పనిలోకి వెళ్లిపోతారు. దీంతో పిల్లల్లోని పెద్దవారు చిన్నవారిని ఆడిస్తారు. వారి బాగోగులు చూసుకుంటారు. బడికి వెళ్లాలన్న ఆసక్తి ఉన్నా బాధ్యతలు బడికి దూరం చేస్తున్నాయి. ఓ వైపు చిన్నారులును ఆడిస్తూ మరోవైపు తల్లిదండ్రులు వచ్చే సమయానికి వారికి భోజనంను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ గిరిశిఖర గ్రామాల ప్రజలకు కనీస సదుపాయాలు అందవు. కూడు, గూడును పక్కన పెడితే కనీసం వేసుకునేందుకు సరైన దుస్తులు కూడా ఉండవు. పోషకాహారం లభించదు. మగ బిడ్డలు చాలా మంది బట్టలు లేకుండా గడుపుతుంటే.. ఆడ పిల్లలు తమ తల్లుల చీరలను ముక్కలు చేసి కట్టుకుని కనిపిస్తున్నారు. కొంచెం ఊహ తెలిసిన చిన్నారులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి తమవంతు సాయంగా పనిలోకి వెళ్తున్నారు. గ్రామానికి సమీప అడవుల్లో లభ్యమయ్యే మామిడిపండ్లు, చింతపండు వంటి పలు అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్మకాలు జరుపుతున్నారు. ఈ సొమ్ముతో ఇంటికి తమ శక్తి కొలది సాయం చేస్తున్నారు.