విజయవాడ, సెప్టెంబర్ 4,
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన అభూత కల్పనా? ఉద్దేశపూర్వకంగా సృష్టించిందా? ఆకతాయిలు అలా ప్రచారం చేశారా? దానికి రాజకీయ రంగు పులుముకుందా? ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం జరిగిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 3,000 మంది చదువుకుంటున్నారు. బాలికల హాస్టల్లో వాష్ రూమ్లలో సీక్రెట్ కెమెరాలు అమర్చారు అన్నది ఒక ప్రచారం. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులు రాత్రంతా ఆందోళన చేశారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ కాలేజీని సందర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు అవకాశం ఇవ్వొద్దని.. నిజా నిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు సీక్రెట్ కెమెరాల జాడలేదు. అనుమానిత విద్యార్థుల నుంచి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అదే సమయంలో వందలాది వీడియోలు బయటకు వెళ్లిపోయాయి అన్న ప్రచారానికి.. నిజం చేస్తూ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. నిజంగా సీక్రెట్ కెమెరాలు పెట్టుంటే.. ఈపాటికే అవి తప్పకుండా బయటకు వచ్చేవి. కానీ అటువంటివి సోషల్ మీడియాలో సైతం కనిపించలేదు. అయితే కాలేజీ యాజమాన్యంతో పాటు నిందితులను ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని వైసిపి సోషల్ మీడియాలో ఆరోపిస్తోంది. విపరీతంగా పోస్టులు పెడుతూ వైరల్ చేసింది. దీంతో అసలు ఏం జరిగిందనే దానిపై స్పష్టతనివ్వాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై విద్యార్థినులలో ఒక రకమైన అనుమానం నెలకొంది. దానిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థినులందరి భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఆరోపణ. ప్రభుత్వం చిన్న విషయంగా తీసుకోలేని పరిస్థితి. అందుకే జాతీయస్థాయి సైబర్ సెక్యూరిటీ నిపుణులను పిలిచి మరి అణువణువు శోధిస్తోంది. ఇటీవల సైబర్ సెక్యూరిటీ నిపుణులు కాలేజీని సందర్శించారు. ఫోన్ టవర్ల దగ్గర నుంచి వెళ్లిన మెసేజ్ లు, ఆ కాలేజీలో ఇంటర్నెట్ వాడిన ఫోన్ల కార్యకలాపాలు, ఎవరెవరు వీడియో రికార్డులు చేశారు? ఆ వీడియోలేమిటి అనే వివరాలను మొత్తం బయటకు తీశారు. సర్వర్ రూములో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా విశ్లేషించారు. మొత్తంగా ఆ కాలేజీ నుంచి ఫోన్ల ద్వారా జరిగిన ప్రతి వ్యవహారాలను విశ్లేషించారు. అక్కడితో దర్యాప్తు ఆగలేదు. వీడియోలు రికార్డు చేశారా? లేదా? అనే విషయాన్ని నిగ్గు తేల్చేందుకు మరో సాంకేతిక నిపుణుల బృందం ఢిల్లీ నుంచి వచ్చింది. వారు కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. సీక్రెట్ కెమెరాలు పెట్టగలిగారా? రికార్డు చేశారా? అనే అంశాలపై సాంకేతిక సమాచారాన్ని బయటకు తెస్తున్నారు. మరోవైపు సమాంతరంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది విద్యార్థుల ఫోన్లు, లాప్ టాప్ లు సహా మొత్తం డిజిటల్ హిస్టరీని బయటకు తీసి విచారణ జరుపుతున్నారు. వాస్తవానికి ఇది రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా విద్యార్థుల్లో ఒక రకమైన అనుమానాలను పెంచింది. తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైన భయాన్ని సృష్టించింది. అందుకే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే ఇది అనవసర కల్పిత చర్య అని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఇటీవల స్పందించారు. ఇదంతా వైసిపి సృష్టించిన ఫేక్ అని ప్రకటించారు. సైబర్ నిపుణులు నివేదిక తర్వాత ఈ ఘటన వెనుక ఏం జరిగిందనే దానిపై ప్రభుత్వం స్పష్టత నివ్వనుంది. ముఖ్యంగా విద్యార్థినులతో పాటు తల్లిదండ్రుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించనుంది.