పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచిఅన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కొన్ని కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది. న్న క్యాంటీన్లు ఏడాదిలో 365 రోజులూ పని చేసేలా ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. పూటకు కనీసం 350 మందికి అల్పాహారం/ఆహారం అందించేలా రూపొందిస్తున్న వీటి నిర్వహణ పరిశీలనకు వాస్తవిక సమీక్ష వ్యవస్థ (రియల్ టైం మోనిటరింగ్ సిస్టం)ను ప్రవేశపెడుతున్నారు. 50వేల జనాభా పైబడిన 71 పట్టణాల్లో వీటిని 203చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా 40 క్యాంటీన్లను వారంరోజుల్లో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకటి, రెండు నెలల్లో మొత్తం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో తమిళనాడు, కర్ణాటక తర్వాత పేదలకు ప్రత్యేకంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపి రూ.15కే అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.131 కోట్లు ఖర్చు చేయనుంది. తగిన సదుపాయాలతో ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ.36 లక్షలు చొప్పున మరో రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. 750 చదరపు అడుగుల విస్తీర్ణం (ఎస్‌ఎఫ్‌టీ)లో చేపట్టే భవనాల్లో తాగునీటి సదుపాయం, విద్యుత్తు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు, ఇంటర్నెట్, ఎల్‌సీడీలు, సీసీ టీవీలు, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయనున్నారు.ఆధార్ అనుసంధానించి ప్రజల నుంచి బయోమెట్రిక్ తీసుకొని ఎలక్ట్రానిక్ విధానంలో టోకెన్లు జారీ చేస్తారు. ఆహారం తయారీ, పంపిణీ టెండర్‌ను అక్షయపాత్ర దక్కించుకుంది. వాస్తవిక సమీక్ష వ్యవస్థ(ఆర్టీఎం)తో వీటి పనితీరును సచివాలయం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు గమనించవచ్చు. ఆహార పదార్థాల నాణ్యత నుంచి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం సమీపంలోని మందడం గ్రామంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీను విజయవంతంగా కొనసాగుతుంది.