కదిరి
కదిరి నియోజకవర్గం, నల్లచెరువు మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ తక్కువ ధరలకే చక్కెర, సిగరెట్లు ఇస్తానంటూ నమ్మించి వ్యాపారం పేరిట అప్పులు తీసుకుని వంచించిన చిన్న ఓబులేశు అలియాస్ మహేశ్వరరెడ్డి ని పోలీసులు అరెస్టు చేసినట్లు కదిరి డీఎస్పీ శ్రీలత తెలి పారు.
గార్లదిన్నె మండలం, కొప్పలకొండ గ్రామంకు చెందిన చిన్న ఓబులేశుపై రాయలసీమ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలోనూ 24 కేసులు నమోదైనట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ పేర్లు మార్చుకుని అధిక వడ్డీలు, తక్కువ ధరలకు సరకులు ఇప్పిస్తానంటూ నల్లచెరువు మండలం దామావాండ్లపల్లికి చెందిన నీలకంఠారెడ్డి నుంచి రూ. 90 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆయనతో పాటు మరో 18 మంది నుంచి రెండున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని మోసగించినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, నకిలీ బంగారు వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు.