రాజమండ్రి, సెప్టెంబర్ 5
కృష్ణానది, బుడమేరు వాగు ఉగ్రరూపంతో విజయవాడ మహానగరం గజగజ వణికింది. మునుపెన్నడూ లేనంత వరద ఉగ్రరూపం దాల్చి బెజవాడ నగరాన్ని ముంచెత్తింది. ఎక్కడ చూసినా వరదనీరు పోటెత్తి జనజీవన స్రవంతి అడుగు బయటపెట్టలేని దీనస్థితిలోకి నెట్టింది. 20 మంది ప్రాణాలు బలిగొన్న ఈ వరద బీభత్సం ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఓ పక్క ఎగువ నుంచి వెల్లువలా వస్తోన్న వదర ఉద్ధృతి మరోపక్క భారీ స్థాయిలో వరద నీరు గోదావరికి చేరుతోంది. దీంతో గోదావరిలో భారీ స్థాయిలో వరద ఉద్ధృతి పెరుగుతోండగా భద్రాచలం వద్ద బుధవారం రాత్రి నాటికి 41 అడుగుల స్థాయికి నీటిమట్టం చేరింది. ఇది ఆందోళన కలిగించే అంశం కాగా రాగాల 24 గంటల్లో ఈ వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో అటు తెలంగాణాలోని భద్రాచలం, ఇటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి పెరుగుతుండగా ప్రస్తుతం 41 అడుగుల స్థాయికి వరద ప్రవాహం పెరిగి నిలకడగా ఉంది. ఇది పెరిగే అవకాశం ఉండగా ఈ వరద ప్రవాహం అఖండ గోదావరికి చేరుతోంది. ఈ క్రమంలోనే ధవళేశ్వరం వద్ద వరద ఒరవడి పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బంది లేకపోయినా రాబోయే మూడు రోజుల్లో మొన్నటి తరహా భారీ వర్షాలు కురిస్తే మళ్లి వాగులు పొంగి గోదావరికి వరదలు పోటెత్తే అవకాశాలున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులపాటు ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి కాస్త తెరుపు ఇచ్చింది వాతావరణం. అయితే కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైన పరిస్థితి తలెత్తింది. మొన్నటి వరకు వదర ముంపుకు గురై ఇబ్బందులు పడ్డ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలులో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వర్షంనీరుతో ముంపుకు గురై ఇబ్బందులు తప్పలేదు.. ఇక తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరంలో భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.. కాకినాడ జిల్లాలోనూ కూడా భారీ వర్షాలకు చాలా కాలనీలు జలమయమయ్యాయి.. గోదావరికి క్రమక్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.. ఉభయగోదావరి జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేస్తూ అత్యవసర సమావేశాలు నిర్వహించారు. భారీ వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి గనుక గోదావరికి వరద పోటెత్తితే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. గతేడాది గోదావరికి మూడు సార్లు వరదలు పోటెత్తగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ఏడాది కూడా వరదలు ఎక్కువసార్లు వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.