YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నియోజకవర్గానికి దూరంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ

నియోజకవర్గానికి దూరంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ

తిరుపతి, సెప్టెంబర్ 5
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ రగడ కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చేసిన దానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారు సైతం అదే పంథా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత గ్రామం చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది కుప్పం నియోజకవర్గం... ఇక ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం కలికిరి.. మాజీ మంత్రి గా పని చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు, ఆయన కుటుంబ సభ్యులు తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.గత ఐదేళ్ల కాలంలో వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా జిల్లాను శాసించారు. ఎమ్మెల్యే లు, ఎంపీలు, నాయకులు ఆయన చెప్పిందే చేసేలా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం భారీ ఓటమి చవి చూడడంతో పాటు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తప్ప మరెవ్వరు గెలవలేదు. గెలుపులో, పరిపాలనలో పెద్దిరెడ్డి మార్క్ వేసుకున్నా ఓటమిలో మాత్రం ఆయన పాత్ర లేనట్టు వ్యవహరించారు. గత ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ, బీసీవై పార్టీల నాయకులు కాదు కనీసం పార్టీ జెండా కనిపించకుండా చేశారు. వైసీపీ పతనంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక మొత్తం తిరగబడింది. గతంలో వారు చేసిన పనులు నేడు కూటమి నాయకులు చేసి చూపిస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం పర్యటన అంటేనే అడ్డుకునేందుకు రోడ్ల పైకి వేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించాలంటే కూడా దాడులు చేసే పరిస్థితి నెలకొంది. కుప్పం కాకుండా అంగళ్లు, తిరుపతిలో రాళ్ల దాడులు, బీసీవై పార్టీ నాయకులు బొడే రామచంద్ర యాదవ్ పుంగనూరు నియోజకవర్గం పర్యటనలో జరిగిన గొడవలు, పోలీస్ స్టేషన్‌లోకి దూరి మరీ దాడులు ఇలా అనేకం జరిగాయి. నాడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొందరిపై కేసులు పెట్టారు. అసలైన వారిని విడిచిపెట్టారని కూడా ప్రచారం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో పర్యటించాలంటే అడ్డుకునేందుకు కూటమి నాయకులు సిద్దం కావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోనే ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారుఆయన కుమారుడు ఒకసారి పుంగనూరు పర్యటనకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఇంటికి రావడంతో విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు రెడప్ప ఇంటిపై రాళ్ల దాడులు, వాహనానికి నిప్పు పెట్టారు. తాజాగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డిను సైతం చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడులు జరిగిన అంగళ్లు ప్రాంతంలో వారు అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేశారు. ఇక ఆయన దిష్టి బొమ్మను దగ్థం చేశారు. ఒక ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దగ్థం చేస్తున్న, ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే వస్తే రాళ్ల దాడి చేస్తామని గులక రాళ్లు పోగు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఇలాగే కొనసాగితే రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంటు పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు కాదు నాయకులు, కార్యకర్తలు తిరిగే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts