విజయవాడ, సెప్టెంబర్ 5,
అవును విజయవాడకు వచ్చిన కష‌్టం మామూలుది కాదు. వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడ గత నాలుగు రోజుల నుంచి వ్యాపారాలన్నీ కోల్పోయాయి. ఒకటి కాదు రెండు కాదు.. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. నష్టం అంచనా వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నాలుగు రోజుల నుంచి పడిన భారీ వర్షాలు... ప్రకాశం బ్యారేజీ నుంచి పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో విజయవాడ సగం మునిగిపోయింది. మునగడం అంటే మామూలుగా కాదు... నీళ్లలోకి నీరు చేరింది. మొదటి అంతస్తులోకి కూడా నీరు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే తెలుస్తుంది. విజయవాడ అంటేనే ముందుగానే గుర్తుకు వచ్చేది లారీలు. లారీలు, బస్సులు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. లారీలు సరుకులను తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తుంటాయి. కొన్ని వేల సంఖ్యలో లారీలు నాలుగు రోజులు స్టాండ్ లలోనే ఉన్నాయి. దీంతో తమకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని లారీ యజమానుల సంఘం చెబుతుంది. ఒక్క లారీ కూడా కదలలేని పరిస్థితి. రహదారులన్నీ జలమయం కావడంతో పాటు జాతీయ రహదారులపైకి కూడా నీరు చేరడం, అనేక చోట్ల గండ్లు పడటంతో లారీలన్నీ నిలిచిపోయి తమకు లక్షల రూపాయల్లో నష్టం తెచ్చిపెట్టిందని, దీనిని పూడ్చేదెవరని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రయివేటు బస్సులు కూడా అంతే. ప్రయివేటు బస్సు సంస్థలు విజయవాడ కేంద్రంగా ఎక్కువగా తిరుగుతున్నాయి. ట్రావెల్స్ సంస్థలు అన్నీ నాలుగు రోజులు మూతపడ్డాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో తమకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇక కాళేశ్వరరావు మార్కెట్ కోస్తాంధ్రలోనే అతి పెద్ద మార్కెట్. హోల్ సేల్ వ్యాపారాలున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకుని వెళుతుంటారు. కానీ ఆ మార్కెట్ పూర్తిగా నాలుగు రోజుల నుంచి మూతపడి పోయింది. వ్యాపార సంస్థలు గేట్లుకూడా తెరవడం లేదు. ఈ నష్టం కోట్లలో ఉంటుందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ ఫుడ్ బిజినెస్ కు ఫేమస్. పర్యాటకులతో పాటు ప్రతి రోజూ విజయవాడకు వచ్చే వారితో హోటళ్లన్నీ కళకళలాడుతుంటాయి. కానీ భారీ వర్షాలు, వరదలతో ఈ బిజినెస్ కూడా పూర్తిగా దెబ్బతినింది. దాదాపు ప్రతి హోటల్ లో ఇదే పరిస్థితి. కనీసం పట్టుమని పది మంది కూడా హోటల్ కు వచ్చి భోజనం చేయలేదని వారు చెబుతున్నారు. ఇక లాడ్జీలు మాత్రం కొంత నిండిపోయాయి. విల్లాల్లోకి, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు రావడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడం, మంచి నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో విజయవాడకు చెందిన సంపన్నులు మాత్రం లాడ్జిలకు వచ్చి తలదాచుకున్నారు. నేడు నీరు తగ్గడంతో వారి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మొత్తం మీద బెజవాడలో వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
నాలుగు రోజుల నరకం
ఎన్నడూ చూడని బాధలను గత నాలుగు రోజుల నుంచి విజయవాడ ప్రజలు చూశారు. ఒకరకంగా నరకాన్ని అనుభవించారు. తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు. అంత వరదలోనూ వర్షం కురవాలని కోరుకున్నవారు అధికంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వర్షపు నీటితోనైనా తమ గొంతులను తడుపుకుందామన్న భావన వారిలో కలిగింది. బాధితులు ఇప్పుడు బయటకు వచ్చి తాము పడ్డ బాధలు చెబుతుంటే కన్నీరు ఆగడం లేదు. అందుకే బెజవాడను వదలి వెళ్లిపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు చిన్న పిల్లలు పాల కోసం ఏడుస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.మానవ తప్పిదమే కాదు. ఎందుకంటే విజయవాడలో ఇంత స్థాయిలో ఎప్పుడూ భారీ వర్షాలు పడలేదు. అయితే ప్రభుత్వం కూడా సరైన సమయంలో ప్రజలను అప్రమత్తం చేయకపోవడం కూడా ఒక తప్పుగానే చూడాలి. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కింది స్థాయి ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ కష్టపడ్డారు. వారిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. భరోసా కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని ప్రాంతాలకు ఆహార పదార్ధాలను, మంచినీటిని, పాలను అందించలేకపోయారు. ఇందుకు అధికారుల తప్పిదమో, ప్రభుత్వ వైఫల్యమో అని చెప్పలేం.ఎందుకంటే అధికారంలో ఎవరున్నా ఇదే పరిస్థితి ఉంటుంది. అలాగే అధికారుల్లో కూడా అంతే. ప్రభుత్వాలతో పనిలేదు. వారి విధి నిర్వహణలో భాగంగా తమకు అప్పగించిన డ్యూటీని చేస్తారు. కానిస్టేబుల్ నుంచి రెవెన్యూ ఉద్యోగి వరకూ ఎవరైనా బాధితులకు సాయం చేయాలనే ఉంటుంది. కానీ సహకరించని పరిస్థితులు ఉంటాయి. బుడమేరు పొంగి కొన్ని ప్రాంతాలకు బోట్లు కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఎనిమిది అడుగుల నీరు రావడంతో శివారు ప్రాంతాలకు ఆహార పదార్థాలను చేరవేయలేకపోయారు. అందుకు కారణం మొదటి రోజు బోట్లు అందుబాటులో లేకపోవడం. రెండో రోజు మర బోట్లు వచ్చినా అవి అన్ని ప్రాంతాలకు చేరుకోలేకపోవడంతో ఫుడ్ మెటీరియల్ ను చేర్చలేకపోయామని చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బాధితుల సంఖ్య. ఇది మూడున్నర లక్షల మంది. మూడున్నర లక్షల మందికి ప్రతి రోజూ ఆహార పదార్థాలను, తాగేందుకు నీటిని అందించాలంటే మానవ సాధ్యం కాదు. అందరినీ ఒక చోట చేర్చగలిగితే వారికి భోజనం అందించవచ్చు. కానీ వారి ఇళ్లకు వెళ్లి అందించాలంటే అది ఎవరివల్లా కాదని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇప్పుడు బెజవాడ తేరుకుంటుంది. మరోసారి భారీవర్షాలు పడతాయని హెచ్చరించడంతో ఇళ్లను వదిలేసి గుంటూరు పరిసర గ్రామాలకు వెళ్లి తలదాచుకుందామని లక్షల మంది బెజవాడను ఖాళీ చేసి వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారీ వరదలు కన్నీటిని కుటుంబాలకు మిగిల్చింది. నష్టం ఎంత జరిగిందన్నది మాత్రం అంచనాకు కూడా అందడం లేదు