విజయవాడ, సెప్టెంబర్ 5,
వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటించారు. రెండు సార్లు ప్రభుత్వ వైఫల్యమేనని తీర్మానించారు. బుధవారం విజయవాడ పర్యటనలో ఆయన చంద్రబాబు సీఎంగా ఫెయిలయ్యారని వరదల్ని సరిగ్గా డీల్ చేయలేదని స్పష్టం చేశారు. అదే తాము అధికారంలో ఉంటే ముందుగా వరదలు ఎప్పుడు వస్తాయో తెలుసుకుని వాలంటీర్ల సాయంతో ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించే వారమన్నారు. ప్రజలకు జరుగుతున్న కష్టనష్టాలకు చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోియందనే.. కలెక్టరేట్ లో పడుకుంటున్నారని ఆరోపించారు. ఇంకా చాలా అన్నారు. అయితే జగన్ గతంలో సీఎంగా చేసి ఉండకపోతే ఈ విమర్శలకు మంచి వాల్యూ ఉండేదేమో కానీ ఇప్పుడు ఆయన ఐదేళ్లు సీఎంగా చేశారు.. ఆ కాలంలో ఎన్నో విపత్తులు వచ్చాయి. ఆయన పనితీరు కూడా ప్రజల ముందు ఉంది. అందుకే టీడీపీ నేతలు అనేక రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో అత్యంత ఘోరమైన విపత్తు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం. డ్యాములు కొట్టుకుపోవడం అంటే చిన్న విషయం కాదు. దీని వెనుక మానవ తప్పిదం ఉందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో ప్రకటించారు. అనూహ్యమైన వరద వస్తుందని పక్కా సమాచారం ఉంది. అదే సమయంలో డ్యామ్ గేట్లు ఎత్తలేదు. ఇసుక లారీల కోసం డ్యామ్ గేట్లు ఎత్తలేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కారణం ఏదైనా డ్యాం కొట్టుకుపోయింది. పట్టించుకోలేదు. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయిన తర్వాత కూడా జగన్ పెద్దగా స్పందించలేదు. వారం రోజుల తర్వాత ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. అంతా తాను చూసుకుంటానని చెప్పారు. కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు గుడారాల్లోనే బతుకుతున్నారు. ఇక జగన్ హయాంలో అత్యంత భారీ విపత్తు కరోనా. ఈ సమయంలో ముఖ్యమంత్రి అసలు బయటకే రాలేదు. ఆయన పూర్తిగా తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకే పరిమితమయ్యారు. పైగా అది పెద్ద వైరస్ కాదని.. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నించారు. అసలు కరోనాను సీరియస్ గా తీసుకోలేదు కానీ..ఆయన మాత్రం బయటకే రాలేదు. క్వారంటైన్ సెంటర్లను సందర్శించి ధైర్యం చెప్పలేదు. మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి పెద్ద వయసు సీఎంలు క్వారంటైనా సెంటర్లను కరోనా ఆస్పత్రులను సందర్శించారు.కానీ జగన్ మాత్రం ఎప్పుడూ బ యటకు రాలేదు. అయితే జగన్ మాత్రం తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేసిందని కితాబిచ్చుకుంటున్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు రాలేదని చెబుతున్నారు. నిజానికి విపత్తలు వస్తే పట్టించుకోకుండా ఎవరి ఖర్మకు వారిని వదిలేయడమే జగన్ చేసిన పని అని.. గొప్ప అన్నట్లుగా స్వయం కితాబులు ఇచ్చుకుంటున్నారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఫలానా విపత్తు వచ్చినప్పుడు సక్రమంగా పని చేసిందన్న అభిప్రాయం ఏ విషయంలోనూ జగన్ ప్రభుత్వంపై రాలేదని టీడీపీ నేతల వాదన. చంద్రబాబునాయుడు విపత్తులు వస్తే ఫీల్డ్ లోనే ఉంటారు. ఆయన ఫీల్డులో ఉంటే అధికారులు బాధ్యతతో పని చేస్తారు. ప్రతి విషయాన్ని మానిటర్ చేస్తారు. అయితే ఇదంతా చేతకానితనమని జగన్ అంటున్నారు. చంద్రబాబుకు చేతకాలేదు కాబట్టి రాజీనామా చేయాలని అంటున్నారు. అంటే జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన బయటకు రాలేదు కాబట్టి.. ప్రజల్లో తిరగలేదు కాబట్టి అది సరైన పద్దతి అదే చంద్రబాబు తిరుగుతున్నారు కాబట్టి అది కరెక్ట్ పద్దతి కాదన్నట్లుగా మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. జగన్ హయాంలో .. విపత్తులు వస్తే ప్రజల్ని గాలికి వదిలేశారని ఆయన సొంత జిల్లా అన్నమయ్య డ్యాం ఘటన జరిగినప్పుడే తేలిపోయిందని..ఇప్పుడు కొత్తగా తానే ఉంటే ఏం చేసేవాడినో చెబితే ఎవరు నమ్ముతారన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తంగా ఫీల్డ్ లో తిరుగుతున్న చంద్రబాబును విమర్శించడం.. జగన్ సీఎంగా బయటకు రాకపోవడంపై చర్చ ప్రారంభమయింది.