YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తాడ్వాయి ఫారెస్ట్ విచారణ షురూ

 తాడ్వాయి ఫారెస్ట్ విచారణ షురూ

వరంగల్, సెప్టెంబర్ 5
ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా ఫారెస్ట్ రేంజ్ లో ఏకంగా 200 హెక్టార్లలో చెట్లు నేల మట్టం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఎంతటి భారీ వర్షాలు కురిసినా అటవీ ప్రాంతాలు ప్రభావితమైన దాఖలాలు చాలా తక్కువే. కానీ ఇప్పుడు కురిసిన వర్షాలకు చిన్న, పెద్ద వృక్షాలు అన్ని కలిపి 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ ఏరియా భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్రంలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీ శనివారం రాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. కాగా ములుగు జిల్లాలో కూడా వర్ష ప్రభావం ఉండగా.. అది ఫారెస్ట్ ఏరియాపై ఎక్కువ కనిపించింది. ఏకంగా 200 హెక్టార్లలో 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం అయ్యాయంటే మామూలు విషయం కాదు. అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అసలు ఫారెస్ట్ ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంపై విచారణకు ఆదేశించారు.ఈ మేరకు వరంగల్ సీసీఎఫ్ ప్రభాకర్, ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ కిషన్ జాదవ్, ఇతర అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం సాయంత్రం ఒక దఫా ఎంక్వైరీ చేసి, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. చెట్లు నేలకూలిన ప్రదేశాన్నంతా కలియ తిరిగారు. ఒక్క గాలివానకే ఇంత పెద్ద నష్టం జరగడం ఇదే తొలిసారి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళవారం అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టగా.. బుధవారం టెక్నికల్ టీమ్ అధికారులు కూడా అటవీ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక తయారు చేయనున్నట్లు తెలిసింది.అటవీ ప్రాంతం నేలమట్టం కావడంపై ఫారెస్ట్ అధికారులు శాస్త్రీయ కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఈ మేరకు చెట్లు కూలిపోయిన ప్రదేశంలో మట్టి శాంపిల్స్ సేకరించారు. దాదాపు మూడు మీటర్ల లోతులో నుంచి మట్టి శాంపిల్స్ తీసుకుని, వాటిని ల్యాబ్‌కు పంపి పరీక్షించే పనిలో పడ్డారు. చెట్లు నేల కూలడానికి అసలు కారణాలు ఏంటి.. అక్కడి నేల స్వభావం ఏమైనా మారిందా.. లేదా ఇందులో కుట్ర ఏమైనా దాగి ఉందా.. అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. రెండు రోజుల కిందటే మట్టి శాంపిల్స్ కు పంపించగా.. అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్ ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఒక వేళ నేల స్వభావం మారితే ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అటవీ ప్రాంత రక్షణ కోసం తగిన చర్యలు చేపట్టనున్నట్లు అటవీ శాఖ సిబ్బంది వివరించారు.వనదేవతలు సమ్మక్క-సారక్కల దయవల్లనే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని మంత్రి సీతక్క అన్నారు. ఈ గాలి విధ్వంసం గ్రామాల్లో జరిగి ఉంటే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదని అన్నారు. అమ్మ దయ వల్లే ప్రమాదం తప్పిందని చెప్పారు. ఆ తల్లుల దీవెనతోనే ప్రజలు సురక్షితంగా బయట పడగలిగారని అన్నారు. ఈ ఘటనపై కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్రం నుంచి ప‌రిశోధ‌న టీంలు రప్పించి కార‌ణాలు గుర్తించాలన్నారు. అట‌వీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇక పెను విధ్వసంతో చెట్లు నేలకొరగటంపై అటవీ శాఖ అధికారులు ఇప్పటికే విచారణ మెుదలు పెట్టారు. గాలులు వీచిన విధానంపై.. జరిగిన విధ్వంసంపై వారు సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో విధ్వంసానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. త్వరలోనే ఈదురు గాలులు చోటు చేసుకోవటానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు.

Related Posts