YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొంప కొల్లేరేనా...

 కొంప కొల్లేరేనా...

ఏలూరు, సెప్టెంబర్ 6
ఐదు రోజులుగా వరద ముంపులో ఉన్న విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నగరాన్ని ముంచెత్తిన వరద ప్రవాహం క్రమంగా శాంతిస్తోంది. అయితే అదే బుడమేరు వరద నీరు వేగంగా కొల్లేరును ముంచెత్తబోతోంది. 30,31 తేదీల్లో కురిసిన వర్షాలతో బుడమేరు పొంగి ప్రవహిస్తోంది. బుడమేరు చరిత్రలో ఎరుగని వరద ప్రవాహం విజయవాడను ముంచెత్తింది. అదే సమయంలో బుడమేరు ప్రవాహం సజావుగా ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు ఇప్పుడు ప్రమాదం ముంగిట నిలిచాయి. 2005కు మించి కొల్లేరు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బుడమేరు వరద సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్న సమయంలో బుడమేరు చప్పుడు లేకుండా కృష్ణా, ఏలూరు జిల్లాలను ముంచెత్తుతోంది. 2005 నాటి విపత్తును మించి బుడమేరు ఉగ్రరూపాన్ని ప్రదర్శించడంతో ఇప్పుడు నిజంగానే కొంప కొల్లేరయ్యేలా ఉంది. కొల్లేటి లంకల్లో ఉన్న వేలాది మంది ప్రజలు ఇప్పుడు పర్యావరణ విధ్వంసానికి బలవుతున్నారు. దాదాపు 44 లంక గ్రామాలను మొదట వరద ముంచెత్తుతుంది. రెండు జిల్లాల్లోని 14 కాల్వలు డ్రెయిన్ల నుంచి కొల్లేరుకు ఉధృతంగా వరద నీరు కొల్లేటిని ముంచెత్తుతోంది.ప్రపంచంలోనే అతి పెద్ద మంచి నీటి సరస్సును కబళించిన మనుషుల స్వార్థానికి మరోసారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. 5వ కాంటూరు వరకు కొల్లేటిని కాపాడాలన్నా సంకల్పానికి అడ్డు తగిలిన ఆంధ్రా రాజకీయం.. దాని ఫలితాన్ని 20ఏళ్లలో రెండోసారి అనుభవించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటైన కొల్లేరును కబళించి చేపలు చెరువులుగా మార్చేసిన బడాబాబులు, రాజకీయ నాయకులస్వార్థానికి ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు.కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వరద నీటి ప్రవాహంతో సహజసిద్ధంగా ఏర్పడిన కొల్లేరు ఎన్నో పక్షి జాతులకు, మత్స్య సంపదగా ఆశ్రయంగా ఉండేది. కొల్లేటి సహజత్వానికి వాటిల్లుతున్న ముప్పును గ్రహించి పాతికేళ్ల క్రితమే దానిని అభయారణ్యంగా అంతర్జాతీయ ఒప్పందాలతో గుర్తించారు.అయితే కొల్లేటి సహజ సంపదను దోచుకునే యావలో చెరువులు తవ్వేసి, సహజ విస్తీర్ణానికి అడ్డంకులు సృష్టించి కొల్లేరును ఎడాపెడా ఆక్రమించిన ఫలితాన్ని ప్రస్తుతం విజయవాడ అనుభవిస్తోంది. బుడమేరు జన్మస్థలం నుంచి 170కి.మీ దూరంలో ఉండే కొల్లేరులొకి వరద నీరు ప్రవహించే మార్గాలను మూసేసి చేపలు, రొయ్యల చెరువులు తవ్వేయడంతో నీటి ప్రవాహానికి అటంకాలు ఏర్పడ్డాయి.2005లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అప్పట్లో వారం రోజుల పాటు విజయవాడ నగరం ముంపులో ఉండిపోయింది. విజయవాడకు ముంపు తగ్గిన 20రోజుల పాటు కొల్లేటి లంక గ్రామాలు జలదిగ్భంధంలో ఉండిపోయాయి. ఈ పరిస్థితికి కారణాన్ని గ్రహించి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఆపరేషన్ కొల్లేరుకు ఆదేశించారు.కృష్ణా జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఆపరేషన్ కొల్లేరును చేపట్టారు. వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న అక్రమ చెరువుల్ని గుర్తించి బాంబులు పెట్టి వాటిని పేల్చేస్తే తప్ప వరద ప్రవాహం సజావుగా వెళ్లలేదు. ఇదంతా జరగడానికి దాదాపు 20 రోజుల సమయం పట్టింది.

Related Posts