గుంటూరు, సెప్టెంబర్ 9,
గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన లేడీ కిల్లర్స్ చేసిన హత్యల గురించి వింటుంటే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ కి చెందిన ముడియాల వేంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే 32 ఏళ్ల మహిళ తన తల్లి రమణమ్మ మరో కొంతమంది తో కలిసి ఒక గ్యాంగ్ లా ఏర్పడి నాలుగు హత్యలు చేశారు. ఇందులో బుజ్జి అత్తగారు సహా వారికి అప్పు ఇచ్చిన మరో వృద్ధురాలు, షేక్ నాగూర్ బీ అనే పక్కింటావిడను బంగారం డబ్బు కోసం కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి వేరు వేరు సమయాల్లో చంపేసిన విషయం తెలిసిందే. తెనాలిలో మోషే అనే మరో వ్యక్తిని అతని భార్య సహకారంతో ఇన్స్యూరెన్స్ డబ్బులో వాటా ఇచ్చేలా మాట్లాడుకుని అతనికి మద్యం లో సైనైడ్ కలిపి తాగించి చంపేశారు. కేసు దర్యాప్తులో ఈ మహిళలు చేసిన వరుస హత్యలు తెలుసుకున్న పోలీసులే షాక్ కు గురయ్యారని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. అయితే నిజానికి వారు మరో ముగ్గుర్ని కూడా చంపాలని ప్లాన్ చేశారు. కానీ ఆ ముగ్గురు చాలా లక్కీ గా చావునుంచి బయట పడ్డారని ఎస్పీ తెలిపారు. థ్రిల్లర్ సినిమా ట్విస్ట్ లను తలపించే ఆ ముగ్గురి డెత్ ఎస్కేప్ ఎలా జరిగిందో మీరూ తెలుసుకోండి.
1)అన్నంలో సైనైడ్ కలిపి వాలంటీర్ ను చంపే కుట్ర -
కెమికల్ రియాక్షన్ పుణ్యమా అంటూ చావు నుండి జస్ట్ మిస్
తెనాలి టౌన్ లో నివసించే అన్నపూర్ణ అనే ఆమె వాలంటీర్ గా పనిచేస్తుంది. గతంలో వాలంటీర్ గా పనిచేసిన ముడియాల వేంకటేశ్వరికి ఆమెతో కాస్త స్నేహం ఉంది. అన్నపూర్ణ ఇంట్లో దాదాపు 1,25,000 (లక్షా ఇరవై ఐదు వేలు) రూపాయల విలువైన బంగారం ఉందని తెలుసుకున్న వేంకటేశ్వరీ అలియాస్ బుజ్జి ఆమె తల్లి రమణమ్మ కలిసి అన్నపూర్ణ తినే ఆహారంలో సైనైడ్ కలిపారు. అన్నపూర్ణ చనిపోయాక ఆమె ఇంట్లో ఉన్న బంగారం తో పాటు అన్నపూర్ణ ఒంటిపై ఉన్న నగలు కూడా కాజేయ్యాలని బుజ్జి ఆమె తల్లి ప్లాన్ చేశారు. కానీ అదృష్టవశాత్తూ అన్నపూర్ణ తినే అన్నంలో కలిపిన సైనైడ్ కెమికల్ రియాక్షన్ కు గురై ఆ రంగు మారిపోయింది. ఆహారం పాడైంది అనుకుని దాన్ని తినకుండా బయట పారెయ్యడంతో తనకు తెలియకుండానే చావు నుంచి తప్పించుకుంది అన్నపూర్ణ. ఈ సంఘటన 2022 డిసెంబర్ లో జరిగింది.
2) భర్త ఫోన్ కాల్ రావడం తో చావు నుండి తప్పించుకున్న వరలమది
తెనాలిలో ఉండే మురగప్ప వరలమది అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం బంగారు నగలు చేయించింది. వాటిని కొట్టేయడం కోసం మంచి మాటలతో ట్రాప్ చేశారు బుజ్జి ఆమె తల్లి రమణమ్మ. ఒకరోజు మాట్లాడేపని ఉందని వరలమది నీ ఊరి బయటకు తీసుకెళ్ళారు తల్లీ కూతుళ్ళు. థమ్స్ అప్ లో సైనైడ్ కలిపి తాగించి చంపేయాలని అనుకుంటుండగా వరలమది కి ఆమె భర్త ఫోన్ చేశాడు. ఆమె తన భర్తకు బుజ్జి,రమణమ్మ లతో కలిసి బయటకు వచ్చానని చెప్పడం విన్న బుజ్జి ఇప్పుడు వరలమది చనిపోతే తమమీద అనుమానం వస్తుందని సైనైడ్ కలిపిన థమ్స్ అప్ ఆమెకు ఇవ్వలేదు. ఇలా భర్త చేసిన ఫోన్ కాల్ భార్య వరలమదిని చావు నుంచి కాపాడింది.
3) టీలో కలిపిన మత్తు బిళ్ళలు పనిచెయ్యలేదు - బతికి పోయిన మిరాబీ
తెనాలిలో ఉండే షేక్ మిరాబీ అనే ఆమె దగ్గర ఉన్న 20000 రూపాయలు కాజేసేందుకు ఆమె ఇంటికి వెళ్ళిన బుజ్జి రమణమ్మ ఆమెను మాటల్లో పెట్టి టీలో మత్తు బిళ్ళలు కలిపారు. మీరాబీ మత్తు లోకి వెళ్ళగానే ఆమెకు ఊపిరాడ కుండా చేసి చంపాలని ప్లాన్ చేసారు . అయితే ఆ మత్తు టాబ్లెట్లు పని చేయకపోవడం తో వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయింది.ఇలా బుజ్జి గ్యాంగ్ చేతిలో ఈ ముగ్గురు మహిళలు చావు నుంచి తృటిలో తప్పించుకోగా మిగిలిన నలుగురు మాత్రం తెనాలి లేడీ సైనైడ్ కిల్లర్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా పోలీసులు ఒంటరిగా ఉండే మహిళలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఎంత పరిచయం ఉన్న వారితోనైనా సరే జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.