విజయవాడ, సెప్టెంబర్ 9,
విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులైంది. ఇప్పుడిప్పుడే వరద ముంపు కాస్త తగ్గుతున్నా ఇంకా లక్షలాది ప్రజలు వరదల్లోనే చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజులుగా విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉంటూ వరద సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపుకు గురైన డివిజన్‌లకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు వరద సహాయక చర్యలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.గత ఆదివారం నుంచి విజయవాడ పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ నియోజక వర్గంలోని పలు డివిజన్లను ప్రభుత్వ యంత్రాంగం విస్మరించింది. వరద సహాయక చర్యలన్నీ సింగ్‌నగర్‌వైపు కేంద్రీకృతం అయ్యాయి. బుడమేరు తీవ్రతను గుర్తించిన తర్వాత నగరంలోని అన్ని ప్రాంతాలకు వరద సాయాన్ని విస్తరించారు.వెలగలేరు దిగువున బుడమేరు డైవర్షన్ ఛానల్ కాల్వలకు గండి పడటంతో వరద ప్రవాహం నగరాన్ని ముంచెత్తింది. విజయవాడకు వెలుపల కవులూరు, పైడూరుపాడు, శాంతినగర్ జక్కంపూడి, వేమవరం, వైఎస్సార్ కాలనీ, అంబాపురం, నున్న వంటి ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో విజయవాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా ఇవన్నీ గ్రామ పంచాయితీలుగానే ఉన్నాయి. బుడమేరు వరద సహాయక చర్యలన్నీ విజయవాడలోనే కేంద్రీకృతం కావడంతో గ్రామీణ ప్రాంతాలకు బయట నుంచి సరుకులు కూడా అందడం లేదు. ప్రధానంగా అంబాపురం, పాతపాడు, జక్కంపూడి, షాబాద్, కొత్తూరు-తాడేపల్లి వంటి గ్రామాలు విజయవాడ నగరానికి వెలుపల ఉంటాయి.విజయవాడ నగరంలో భాగమే అయినా పంచాయితీలుగా ఉండటంతో బుడమేరు వరద సహాయక చర్యలు వారం దాటినా ఈ గ్రామాలకు చేరలేదు. విజయవాడ-కొత్తూరు తాడేపల్లి ప్రధాన రోడ్డు ఇంకా వరద ముంపులోనే ఉంది.జక్కంపూడి వైఎస్సార్ కాలనీ వరకే ప్రభుత్వ సహాయక చర్యలు అందుతుండటంతోదానికి ఎగువున ఉన్న గ్రామాలు బిక్కుబిక్కు మంటూ ఉన్నాయి. పాముల కాల్వ నుంచి కొత్తూరు వెళ్లే గ్రామంలో వేమవరం గ్రామంలోకి సైతం వరద ముంచెత్తింది. కొత్తూరు-వెలుపల ఉన్న చెరువు పొంగడంతో దాని సమీపంలో ఉన్న ఇళ్లలో వారిని స్థానికంగా ఉన్న సెయింట్ బెనిడిక్ట్ పాఠశాలలో నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. స్థానిక టీడీపీ నాయకులు బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో గ్రామాలకు వరద సాయం అందుతుందని భావించినా ఇప్పటి వరకు ఎలాంటి సాయం రాలేదని కొత్తూరు తాడేపల్లి గ్రామస్తులు తెలిపారు.విజయవాడ నగరంతో రాకపోకలు తెగిపోవడంతో గ్రామాల్లో ఉండే సరుకులు కూడా నిండుకున్నాయి. నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకునే పరిస్థితులు లేవని, కూరగాయలు కూడా లేవని గ్రామస్తులు చెబుతున్నారు. విజయవాడ నగరంలో అద్దెల్ని భరించలేక చాలామంది రూరల్ గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. నిత్యం ఉపాధి కోసం నగరంలోకి వచ్చే వారికి ఎనిమిది రోజులుగా వరద ముంపు కష్టాలు తప్పడం లేదు. విజయవాడ నగరంలో సహాయ చర్యలు అందుతున్నా బుడమేరు వరద ముంపుకు మొదట గురైన గ్రామాలను కూడా ఆదుకోవాలని రూరల్ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.