YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎమ్మెల్యేలకు సీరియస్ క్లాస్

ఎమ్మెల్యేలకు సీరియస్ క్లాస్
టీఆర్‌ఎస్‌లో తమ పరిధికి మించి మాట్లాడుతున్న కొందరు లీడర్లకు గులాబీబాస్ ఎలా చెక్ పెట్టబోతున్నారు? తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేతలకు ఎలాంటి వార్నింగ్ బెల్స్ వెళ్తున్నాయి? ఇటీవల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోన్న పలువురు నేతల వ్యవహారశైలిపై పార్టీ సీనియర్లతో సీఎం కేసీఆర్ ఏమని చర్చించారు? "పార్టీలో ఉండేవారు ఉంటారు.. పోయేవాళ్లు పోతారన్న'' ధోరణితో ఎందుకు వ్యాఖ్యలు చేశారు?
అధికారపార్టీలో గీత దాటుతున్న నేత‌ల‌కు గులాబీబాస్ కేసీఆర్ చెక్‌పెట్టే యోచ‌న‌లో ఉన్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం గురించి బ‌య‌ట నోరు జారుతున్న నేత‌లపై ముఖ్యమంత్రి దృష్టి సారించిన‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. మీడియాకు లీకులిచ్చి వార్తలు రాయించుకునే గులాబీ నేత‌లపైన కూడా గులాబీ దళపతి సీరియస్ అయిన‌ట్లు వినికిడి. "ఉంటే ఉంటారు.. పోతే పోతారు.. రాష్ట్రంలో మ‌రోమారు అధికారంలోకి వ‌చ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. పోయేవాళ్ళని ఆపేది లేదు..'' అంటూ సీఎం కేసీఆర్ కొంత మంది సీనియ‌ర్ నేతలతో ఇటీవల అన్నారట. ఈ విషయంపైనే ఇప్పుడు పార్టీలో వాడివేడి చర్చ జ‌రుగుతోంది. ఈ పరిణామంతో నోరు జారుతున్న నేతల్లోనూ అలజడి మొదలైందట.
ఆ మధ్య కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు వైరాగ్యపు వ్యాఖ్యలు చేశారట. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్లు దక్కడం కష్టమేని అనుచరులతో అన్నారట. స‌ర్వేల్లో త‌మ‌కు త‌క్కువ మార్కులు రావ‌టంతో టిక్కెట్‌ ఆశలు కొడిగడుతున్నాయని వాపోయారట. ఈ విష‌యం ఆ నోటా ఈ నోటా ప‌డి సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వ‌చ్చింద‌ట‌. ఈ నేపథ్యంలోనే పెద్దప‌ల్లి జిల్లాకు చెందిన ఒక సీనియ‌ర్ ఎమ్మెల్యేని పిలిచి సీఎం కేసీఆర్ ఇటీవల క్లాస్ పీకారట. టిక్కెట్ రాద‌ని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నావ‌ని అంటూ కడిగేశారట. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కొంద‌రు నేత‌లు చేస్తున్న రాజ‌కీయ రగడపై కూడా టీఆర్‌ఎస్‌ అధినేత సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది. త‌మ కుటుంబంలో మ‌రొక‌రికి టిక్కెట్ కోసం ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మీడియాకు లీకులిచ్చి వార్తలు రాయించుకోవ‌టంపై చ‌ర్చించిన‌ట్లు పార్టీ వర్గాల కథనం. టిక్కెట్ ఇవ్వక‌పోతే పార్టీ మారుతార‌ంటూ వార్తలు వ‌స్తుండ‌టంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారట. ఈ తరుణంలోనే "ఉండేవాళ్ళు ఉంటారు.. పోయే వాళ్ళు పోతారు.. వాళ్ళిష్టం.. ఎవ‌రినీ ఆపేది లేదు'' అని ఆయన స్పష్టంచేశారట.
కొందరు నేతలు ఇత‌ర పార్టీల‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వ‌చ్చినా స‌ముచిత పీఠాలు వేశామనీ.. అయినా వారిలో కొందరు పరోక్షంగా అధిష్టానంపై నోరు జారుతున్నారనీ సీఎం కేసీఆర్‌కు రిపోర్టులు అందుతున్నాయట. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక సీనియ‌ర్ నేత పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం లేద‌ని చెప్పుకోవ‌టంపై కేసీఆర్ సీరియ‌స్ అయిన‌ట్లు వినికిడి. ఆయనకు తగిన గౌర‌వం లభించినా త‌నను ప‌ట్టించుకోవ‌టం లేద‌ని చెప్పుకొని తిర‌గ‌టం వాళ్ళకే న‌ష్టమన్నట్లుగా పలువురు ముఖ్య నేతల వద్ద కేసీఆర్ వ్యాఖ్యానించారట!
మొత్తానికి గులాబీబాస్ కేసీఆర్ సీరియస్ కావడంపై గులాబీ శిబిరంలో ఆందోళన మొదలైందట. తమని దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారన్న భావనతో ఆయా నేతలు ఒకింత ఆందోళన చెందుతున్నారట. అయితే ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గర‌ప‌డుతున్న వేళ ఆ నేతల నోళ్లకి తాళాలు వేయడానికే కేసీఆర్ ఇలా చర్చించి ఉంటారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

Related Posts