YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ నవగ్రహ యోగం...

కేసీఆర్ నవగ్రహ యోగం...

మెదక్, సెప్టెంబర్ 9,
రాజకీయ యోగానికి యాగం దగ్గరి దారని చాలా మంది నమ్ముతుంటారు. ఇలాంటి సెంటిమెంట్లను నమ్మేవారిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ముందుంటారు. అందుకే ఎప్పటికప్పుడు యజ్ఞాలు, యాగాలతో తన భక్తి ప్రవత్తులను చాటుకుంటారు కేసీఆర్. అధికారంలో ఉండగా, రకరకాల యాగాలు చేసిన కేసీఆర్… ఇప్పుడు ప్రతిపక్షంలోనూ నవగ్రహాల అనుగ్రహం కోసం మరో యాగం చేస్తున్నారట… ఇందుకోసం తన లక్కీనెంబర్ ఆరో తేదీనే యాగం ప్రారంభించడం మరో విశేషంగా చెబుతున్నారు… తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆధ్యాత్మికత కూడా చాలా ఎక్కువ. తరచూ గుడులు, గోపురాలను దర్శించుకునే కేసీఆర్… ఎప్పటికప్పుడు యజ్ఞయాగాదులు చేస్తుంటారు. అధికారంలో ఉండగా, చాలా యాగాలను చేసిన కేసీఆర్ వాటి ఫలితాలను పొందారు.కానీ, ఎందుకనో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ తరహా పూజలకు కాస్త దూరంగా ఉన్న కేసీఆర్… ఇప్పుడు మళ్లీ యాగం చేయడం మొదలుపెట్టారట. తన లక్కీ నెంబర్ 6 అయితే.. సెప్టెంబర్ 6న నవగ్రహ యాగాన్ని మొదలుపెట్టారు కేసీఆర్. తన వ్యవసాయ క్షేత్రంలో కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ యాగం చేస్తున్నారు కేసీఆర్. దీంతో కేసీఆర్ సెంటిమెంట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే లేనట్లు ఒక్కస్థానం గెలుచుకోలేకపోయింది. ఇక వ్యక్తిగతంగా కుమార్తె కవిత అరెస్టు కేసీఆర్‌ను మరింత కుంగదీసింది. ఇప్పుడు కవిత బెయిల్‌పై విడుదల కావడం.. ఇకపై ఇలాంటి కష్టాలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో నవగ్రహ యాగం చేయాలని సంకల్పించారట కేసీఆర్. ఈ యాగం తర్వాతే స్థానిక ఎన్నికల్లో క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారట కేసీఆర్. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నందున మంచి రోజు చూసుకుని నవగ్రహ యాగం మొదలుపెట్టారు కేసీఆర్. ఉద్యమనేతగా తెలంగాణపై ప్రత్యేక ముద్ర వేసిన కేసీఆర్‌లో దైవభక్తి ఎక్కువ… ఉద్యమ సమయం నుంచే ఆయన ఎన్నో యాగాలు చేసేవారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహాయాగాలను చేసిన కేసీఆర్ వాటి ఫలితాలను అందుకున్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు. 2015లో ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లో 5 రోజుల పాటు ఆయుత చండీ యాగం నిర్వహించిన కేసీఆర్… 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేసి రెండోసారి రాజయోగాన్ని ఒడిసిపట్టుకున్నారు. ఐతే 2023 ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం మళ్లీ చేసినా, ఆయనకు రాజ యోగం దూరమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మళ్లీ యాగం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ యాగం పూర్తయిన తర్వాత తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ చేస్తున్న నవగ్రహ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాలుపంచుకోగా, కుమారుడు కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని 7వ తేదీన యాగంలో భాగస్వామి అవుతారని చెబుతున్నారు. మొత్తానికి నవగ్రహాల అనుగ్రహించాలని కోరుతూ కేసీఆర్ చేస్తున్న యాగం ఎంతవరకు ఫలితమిస్తుందో కానీ, ఆయన సెంటిమెంట్‌ వర్క్అవుట్ కావాలని బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం బలంగా కోరుకుంటున్నాయి.

Related Posts