YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

1097 మందిపై ఎన్నికలపై అనర్హత

1097 మందిపై ఎన్నికలపై అనర్హత

నల్గోండ, సెప్టెంబర్ 9,
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానిక నేతలు ఎప్పటి నుండో సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కొందరికి ఓ చిక్కు సమస్య పోటీకి అనర్హులుగా చేసింది. 2019లో నల్లగొండ జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. జనవరిలో పంచాయతీలకు, ఏప్రిల్, మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఎన్నికలు జరిగాయి. పంచాయతీరాజ్ 2018 చట్టం నిబంధనల మేరకు 45 రోజుల్లో ఎన్నికల సంఘానికి ఓడిన, గెలిచిన అభ్యర్థులు ఆయా ఎంపీడీవోలకు లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. ఓడిపోయామని కొందరు, అవగాహన లేక మరికొందరు లెక్కలు చూపలేదు. దీంతో నల్లగొండ జిల్లాలో 1097 మందిపై ఎన్నికల్లో పోటీచేయకుండా ఎన్నికల సంఘం 2021లో నిషేధం విధించింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయక నిషేధం బారిన పడిన అప్పటి అభ్యర్థులు ఇప్పుడు పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు.గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీ కాలం ఫిబ్రవరి 4కు ముగిసింది. మండల, జిల్లా పరిషత్ లకు జూన్ పదవీకాలం ముగిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతోంది. అయితే తాజాగా ప్రభుత్వం తాజాగా స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు చేస్తోంది. ఎన్నికల వివరాలు సమర్పించని నేతలపై ఎన్నికల సంఘం విధించిన మూడేళ్ల సమయం 2024 జులైతో ముగిసింది. నల్లగొండ జిల్లాలో సర్పంచులు16, వార్డు సభ్యులు1021, ఎంపీటీసీ సభ్యులు 54, జడ్పీటీసీ సభ్యులు ఆరుగురు అనర్హత వేటు పడి ఉన్నారు. ప్రభుత్వం.. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు గడువులోగా నిర్వహించి ఉంటే వారికి పోటీ చేసే అవకాశం లేకపోయేది. పోటీకీ అవకాశం రావటం, రిజర్వేషన్లు కూడా మారబోతున్నాయన్న సంకేతాలతో అభ్యర్థులు బలం, బలగాన్ని సిద్దం చేసుకుంటున్నారు. మొత్తం మీద వీరికి ఆలస్య అమృతమైంది.

Related Posts