YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయోమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు

అయోమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు

విశాఖపట్టణం, సెప్టెంబర్ 11,
విశాఖ ఏజెన్సీలో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు దిక్కులేక బిక్కుబిక్కు మంటున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో లేకపోవడం, ఉమ్మడి జిల్లాలో సైతం సరైన మార్గనిర్దేశం చేసే లీడర్‌ కనిపించకపోవడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విలవిలలాడుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచినా సరే ప్రజలకు ఏ పని చేయాలో, ఆ పనిని అధికారులతో చేయించుకోవడంపై అవగాహన లేక అయోమయంలో ఉన్నారు. వీరిలో ఒకరు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, మరొకరు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం.వీరిద్దరు ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ, శాసన సభ్యులుగా పని చేసే అవకాశం రాలేదు. అయితే జిల్లా వ్యాప్తంగా వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా, ఏజెన్సీలోని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం మంచి మెజార్టీతో గెలిచారు. ఐతే వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఈ ఇద్దరిని ప్రభుత్వంలో పట్టించుకున్న వారే లేకపోయారు. ఇక ప్రతిపక్షంగా పోరాడదామన్నా పరిమిత వనరులతో ముందుకు వెళ్లలేకపోతున్నారని చెబుతున్నారు. పాడేరు, అరకులో కూటమి అభ్యర్థులు ఓటమి పాలైనా నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తుండటంతో ఎమ్మెల్యేలుగా వారిని అడ్డుకోవడం సవాల్‌గా మారిందంటున్నారుపాడేరు ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరాజుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా, ఎమ్మెల్యేగా తొలిసారే ఎన్నికయ్యారు. ఫలితాలు వచ్చిన దాదాపు మూడు నెలలు అవుతున్నా ఈయన అసలు బయటకు రాలేకపోతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు చురుగ్గా తిరుగుతున్న విశ్వేశ్వరరాజుకు పార్టీ పరంగా ఎలాంటి అండదండలు ఉండటం లేదని అంటున్నారు. దీంతో ప్రజా సమస్యలపై పోరాడలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీపరంగా విశ్వేశ్వరరాజుకు పెద్దగా సమాచారం ఇస్తున్నట్లు కనిపించడం లేదంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా కార్యకలాపాల్లో ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరాజుకు పార్టీ నుంచి పిలుపు ఉండటం లేదని అంటున్నారు. దీంతో ఆయన కూడా ఉన్నామంటే ఉన్నానన్నట్లు తూతూ మంత్రంగా గడిపేస్తున్నారంటున్నారు.ఇక అరకు ఎమ్మెల్యే మత్స్య లింగందీ ఇదే విధమైన స్టోరీ.. ఈయనకు పార్టీ కార్యక్రమాలపై పెద్దగా సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కూటమి నేతల నుంచి ఎమ్మెల్యే గట్టి సవాల్‌ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పరంగా ఎమ్మెల్యేకు పెద్దపీట వేయాల్సి వున్నా, కూటమి నేతల డామినేషన్‌తో మత్స్యలింగంను ఏ కార్యక్రమానికి పిలవడం లేదంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలుగా తమ ఉనికి చాటుకోవడమే ఈ ఇద్దరికీ చాలెంజింగ్‌గా మారింది. మరోవైపు టీడీపీకి చెందిన గిడ్డి ఈశ్వరి పాడేరులోను… దున్నుదొర అరుకులోనూ దూసుకుపోతుండటం ఎమ్మెల్యేలను కలవరానికి గురిచేస్తోందంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆ సంతోషం దక్కడం లేదని తమ అనుచరుల వద్ద వాపోతున్నారట ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు.

Related Posts