YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పారిశుధ్ధ్య సేవలు నిరుపమానం 10 రోజులగా విస్తృత సేవలు

పారిశుధ్ధ్య సేవలు నిరుపమానం 10 రోజులగా విస్తృత సేవలు

విజయవాడ, సెప్టెంబర్ 11,
విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి పదకొండో రోజుకు చేరింది.ఆగస్టు 31వ తేదీ తెల్లారేసరికి విజయవాడ నగరంలో సగభాగం బుడమేరులో కలిసిపోయింది. వారం రోజులకు పైగా వరద నీటిలోనే ఉండిపోయింది. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రానికి విజయవాడ నగరాన్ని ఆదుకోడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పారిశుధ్య కార్మికుల్ని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.దీంతో అన్ని కార్పొరేషన్లు, పురపాలక సంఘాల నుంచి అందుబాటులో ఉన్న శానిటరీ వర్కర్లను విజయవాడకు తరలించారు. సెప్టెంబర్ 2 తేదీ నాటికి వీరంతా విజయవాడ చేరుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో పని పూర్తి చేసుకుని వెళ్లిపోతామనుకుని కుటుంబాలను వదిలి రెండు మూడు జతల బట్టలతో రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు విజయవాడకు వచ్చారు.విజయవాడ నగరంలో వైఎస్సార్‌ కాలనీ మొదలుకుని మిల్క్ ప్రాజెక్టు, భవానీపురం, ఉర్మిళానగర్‌, కబేళా, చిట్టినగర్, పాలఫ్యాక్టరీ, వించిపేట, నైజాంగేటు, రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట, అజిత్ సింగ్‌ నగర్‌ వాంబేకాలనీ, అయోధ్యనగర్, దేవీ నగర్‌, న్యూ ఆర్‌ఆర్‌పేట, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇవన్నీ విజయవాడ కార్పొరేషన్‌లో ఉన్న ప్రాంతాలు. దాదాపు రెండున్నర లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటికితోడు విజయవాడ రూరల్‌ మండలంలో జక్కంపూడి, కొత్తూరు - తాడేపల్లి, అంబాపురం, షాబాద్‌, శాంతినగర్‌, కవులూరు గ్రామాలను కూడా వరద ముంచెత్తింది.విజయవాడలో దాదాపు ఆరున్నర లక్షల మంది ప్రజలు వారం రోజుల పాటు వరద నీటిలో చిక్కుకోవడంతో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా వరద ప్రారంభమైన వెంటనే పారిశుధ్య కార్మికుల్ని విజయవాడకు తరలించారు. మరోవైపు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న కార్మికుల్లో చాలామంది వరద బాధితులుగా మారారు. సింగ్‌ నగర్‌, పాయకాపురం, ఆర్‌ఆర్‌పేట ప్రాంతాల్లో నివసించే కార్మికులు కట్టుబట్టలతో నిర్వాసితులుగా మిగిలారు.నగరాన్ని ముంచెత్తిన వరదల్లో డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డు పడిన చెత్తను తొలగించడం మొదలుకుని వీధుల్లో పారిశుధ్య పనుల వరకు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు భుజానికి ఎత్తుకున్నారువరద హెచ్చరికల నేపథ్యంలో కార్మికుల్ని విజయవాడకు తరలించాలని అప్పటికప్పుడు ఆదేశించడంతో కమిషనర్ స్థాయి అధికారులు మొదలుకుని, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, కార్మికులు విజయవాడకు వచ్చేశారు. చాలామంది కార్మికులకు కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే నగరానికి వచ్చారు. సెప్టెంబర్ 2,3తేదీల్లో కూడా విజయవాడలో వర్షం కురుస్తున్నా అలాగే పనిచేశారు.రెండు మూడు రోజుల్లో వరదలు తగ్గిపోయి, స్వస్థలాలకు వెళ్లిపోతామని భావించిన వారు 9రోజులుగా నగరంలోనే ఉండిపోయారు. కళ్యాణమండపాలు, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా ప్రాంగణాల్లో వారికి వసతి కల్పించారు. ఊరు కాని ఊరులో ప్రకృతికి ఎదురొడ్డి శ్రమిస్తున్నారువీధులకు వీధులు వరద నీటిలో మునిగిపోవడంతో టన్నుల కొద్ది వ్యర్థాలను తొలగిస్తున్నారు. సోమవారం నాటికి వరద ప్రభావం కొద్దిగా తగ్గడంతో పారిశుధ్య పనుల్లో వేగం పెంచారు. రాష్ట్రంలోని వేర్వేరు మునిసిపాలిటీల నుంచి దాదాపు 7600మంది కార్మికులు విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీధుల్ని శుభ్రం చేయడం మొదలుకుని వరద నీటిలో మునిగిపోయిన ఇళ్లను శుభ్రం చేయడం వరకు అంతా తామై శ్రమిస్తున్నారు.పారిశుధ్య కార్మికులుగా వచ్చిన మహిళలు, పురుషులు ప్రతి వీధిని ఫైర్ సిబ్బంది సాయంతో శుభ్రంగా ఉడ్చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది కార్మికులకు కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే పనిచేస్తున్నారు. గత పది రోజులుగా విజయవాడలో వాన కురవని రోజు లేదు. రెండు మూడు రోజులుగా అల్పపీడన ప్రభావంతో రోజంతా వర్షం, చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. తలలకు టోపీలు లేకున్నా, కాళ్లకు చెప్పులు లేకున్నా వరద ముంపుల్లో చిక్కిన విజయవాడనుు తమ చేతులతో శుభ్రం చేస్తున్నారు.టన్నుల కొద్ది వ్యర్థాలు, తడిచి పాడైపోయిన దుస్తులు, ఆహార పదార్ధాలు, పనికి రాకుండా పోయిన బెడ్డింగులు, ఒకటేమిటి అంతులేని వ్యర్థాలను చేతులతోనే ఎత్తిపోస్తున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న ఆహారాన్ని తినేసిన తర్వాత, మిగిలిపోయిన ఆహారాన్ని రోడ్ల పాలు చేస్తే తమ చేతులతో వాటిని ఎత్తి తరలిస్తున్నారు.
పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలకు విజయవాడ నగరం ఏమిచ్చినా తీర్చుకోలేనంత రుణాన్ని కార్మికులు మిగులుస్తున్నారు. వరద సహాయక చర్యల్లో అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొంటున్నా అత్యధికంగా శ్రమిస్తున్నది మాత్రం పారిశుధ్య కార్మికులే. నాలగైదు రోజుల్లో ఇళ్లకు వెళ్లిపోతామనుకున్నామని, ఇక్కడ పరిస్థితులు, వరద ముంపు వారంపైగా కొనసాగడంతో తాము కూడా ఉండిపోవాల్సి వచ్చిందని కడప నుంచి వచ్చిన కార్మికులు చెప్పారు.రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 7600మంది పారిశుధ్య కార్మికులు విజయవాడకు వచ్చారు. అధికారులతో కలిపి 10వేల మందికి పైగా నగరాన్ని తిరిగి మునుపటి స్థితికి తెచ్చేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. మధ్యలో కొద్ది గంటల పాటే విశ్రమిస్తున్నారు. త్వరగా పని పూర్తి చేస్తే ఇ‌ళ్లకు వెళ్లొచ్చనే ఉద్దేశంతో తెల్లవారక ముందే చీపుర్లు, పారలతో పనిలో దిగుతున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో విధుల కోసం రెండు, మూడు జతల బట్టలతో నగరానికి వచ్చారు. ఎప్పుడు తిరిగి వెళ్లడానికి అనుమతిస్తారో తెలియదని, చేయాల్సిన పని పూర్తి చేసి వెళ్తామని కార్మికులు చెబుతున్నారు. పారిశుధ్య కార్మికులు వరద ప్రభావితప్రాంతాల్లో శుభ్రం చేసిన తర్వాత శానిటేషన్ చేస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చేస్తున్నారు. కాళ్లకు చెప్పులు, కనీస సదుపాయాలు లేకున్నా వారు అందిస్తున్న సేవల్ని చూసి విజయవాడ నగర వాసులు సెల్యూట్ చేస్తున్నారు.

Related Posts