ఒంగోలు, సెప్టెంబర్ 12,
శిద్దా రాఘవరావు. మాజీ మంత్రి.. ప్రకాశం జిల్లాకు చెందిన బడా గ్రానైట్ వ్యాపారవేత్త. గత కొంత కాలంగా అధికార టీడీపీ లో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అటు వైపు నుంచి సానుకూల స్పందన రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలుద్దామని ప్రయత్నించినా కూడా కుదర్లేదు. అయితే ఇటీవల వరద బాధితులను అదుకునేందుకు శిద్దా రాఘవరావు ముందుకు వచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. సీఎంఆర్ఎఫ్ విరాళం పేరుతో చంద్రబాబును కలిసి శిద్దా.. అదే మంచి సమయమని భావించి తన మనసులో ఉన్న మాట బయటపెట్టేశారట.శిద్దాపై బాబుకు సైతం ఎటువంటి వ్యతిరేకత లేకపోవడంతో.. టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. శిద్దా రాఘవరావు త్వరలోనే టీడీపీ గూటికి చేరబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గ్రానైట్ వ్యాపారిగా స్థిరపడిన శిద్దా రాఘవరావు రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే మొదలైంది. 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. 2007లో అదే పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. అందరినీ కలుపుకొనిపోతూ అజాతశత్రువు గా పేరు తెచ్చుకున్న శిద్దా.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యునిగా ఎన్నిక అవ్వడమే కాకుండా చంద్రబాబు మంత్రిమండలిలో చోటు దక్కించుకోగలిగారు.శిద్దా రాఘవరావు కుటుంబానికి చీమకుర్తి మండలం బూదవాడ గ్రామంలో గ్రానైట్ క్వారీలతో పాటు ఫ్యాక్టరీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో గతంలో అధికారం ఉన్నప్పుడు కీలకంగా వ్యవహించిన శిద్దా రాఘవరావు ఒకదశలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాస పాత్రుడిగా వ్యవహరించారు. 2014కి ముందు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు వెంటే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యంగా శిద్దా రాఘవరావు అసెంబ్లీకి బదులుగా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్ధి అయిన మాగుంట శ్రీనివాసులురెడ్డి చెతిలో ఒడిపోయారు.2019లో రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల వ్యాపారాలను టార్గెట్ చేసింది .. అందులో భాగంగా శిద్దా రాఘవరావు గ్రానెట్ క్వారీలపై పోకస్ పెట్టింది. ఆ క్వారీల్లో అక్రమాలు జరిగాయంటూ 400 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఫైన్ విధించింది. దాంతో క్వారీలు ముతపడే స్థితికి రావడంతో ఆయన ఆర్ధిక లావదేవీలు ఒక్కసారిగా స్తంభించాయి. ఇక చేసేదేమీ లేక తప్పని పరిస్థితిలలో ఆయన వైసీపీ కండువ కప్పుకున్నారు.మొన్నటి ఎన్నికల్లో సిద్దా దర్శి వైసీపీ టికెట్ ఆశించినప్పటికీ జగన్ నిరాకరించారు. అప్పటి నుంచే ఆయన ఆ పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఆ క్రమంలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఆయన దర్శి టీడీపీ టికెట్ కోసం విఫలయత్నం చేశారంటారు. అప్పటి నుంచి టీడీపీలో చేరడానికి విశ్వ ప్రయాత్నాలు చెస్తున్నా ఫలించలేదు. చంద్రబాబు నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రాకపోవడంతో శిద్దా పొలిటికల్ కెరీర్ సందిగ్ధంలో పడ్డట్లు కనిపించింది.టీడీపీలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, ఎమ్మెల్సీ, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పలు కీలక పదవులు నిర్వహించిన శిద్దాకు చంద్రబాబు సముచిత ఇచ్చారు. 2014 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంత్రిని చేశారు. నెల్లూరు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా కూడా బాధ్యతలు కట్టబెట్టారు. అంత ప్రయారిటీ ఇస్తే కష్ట సమయంలో పార్టీకి కార్యకర్తలకు అండగా ఉండకుండా వైసీపీలోకి వెళ్ళటంపై బాబు అగ్రహం వ్యక్తం చేశారంటారు. ఆ కోపంతో వైసీపీకి రాజీనామా చేశాక ఆయనకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంట.ఇన్ని రోజులకు సీఎం సహాయనిధికి విరాళం రూపంలో ఆయన చంద్రబాబును కలవగలిగారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళాన్ని సిఎం చంద్రబాబుకి అందించారు. ఆ కాస్త టైంలోనే కాగల కార్యం చక్కబెట్టేశారంట. సార్ తప్పుయింది.. సారీ.. అన్న ఒక డైలాగ్‌తో శిద్దాకు చంద్రబాబు ఆశీస్సులు లభించాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. టీడీపీలో చేరడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శిద్దా అనచరులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. శిద్దా టీడీపీలో రీఎంట్రీకి సంబంధించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కీరోల్ పోషించారంట. మొత్తానికి మంచి మూహుర్తం చూసుకుని శిద్దా పసుపు కండువా కప్పుకోవడం ఖాయమైందంటున్నారు.సిద్దా రాఘవరావు వైసీపీలో చేరాక దర్శి టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. మొన్నటి ఎన్నికల్లో చివరి నిముషంలో వరకు అక్కడ కేండెట్ ఎవరో చంద్రబాబు నిర్ణయించలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి పక్క జిల్లా నరసరావుపేట నుంచి ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవి సోదరి గొట్టిపాటి లక్ష్మిని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అయినా దర్శిలో టీడీపీ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.. ఈ పరిస్థితికి కారణమైన శిద్దాపై దర్శి తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తిరిగి పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారంతో వారు మరింత రగిలిపోతున్నారు. మరి దర్శిలో పరిస్థితులను శిద్దా ఎలా చక్క దిద్దుకుంటారో చూడాలి.