భువనేశ్వర్, సెప్టెంబర్ 13,
త్రివిధ దళాల్లో చేరే సైనికులకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశంలో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన వారిని అగ్నివీరులుగా 4 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేయించిన తర్వాత వారిని బయటకు పంపిస్తామని చెప్పడంతో యువతతోపాటు ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. మరోవైపు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఇక కొన్ని నెలల క్రితం ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మాజీ అగ్నివీరులకు ఒడిశా ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీసుల్లోని గ్రూప్ సీ,డీ ఉద్యోగాల్లో నేరుగా నియామకాలు ఇచ్చేలా చేసిన ప్రతిపాదనకు ఒడిశా మంత్రివర్గం ఆమోదం కల్పించింది.ఒడిశాలో గ్రూప్ సీ, డీ ఉద్యోగాల్లో అగ్నివీరులుగా పనిచేసి రిటైర్ అయిన వారికి 10శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ మోహన్ మాఝి నేతృత్వంలోని ఒడిశా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ మాజీ అగ్నివీరులను యూనిఫామ్ సర్వీసుల్లోకి నేరుగా నియమించుకుంటామని పేర్కొంది. అయితే ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటాకు అదనంగా ఈ అగ్నివీరులకు 10శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు చెప్పారు. సీఎం మోహన్ మాఝి నేతృత్వంలో సమావేశమైన కేబినెట్.. ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ అగ్నివీర్ రూల్స్ 2024కు ఆమోదం కల్పించింది.దీని ప్రకారం ఒడిశాలోని పోలీస్, ఎక్సైజ్, అటవీశాఖ, ఫైర్ డిపార్ట్‌మెంట్ లేదా ఇతర శాఖల్లో మాజీ అగ్నివీరులకు అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ యూనిఫామ్ సర్వీసుల్లో నియామకాల సందర్భంగా మాజీ అగ్నివీర్‌లు కచ్చితంగా కొన్ని అర్హతలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. అగ్నివీరులకు ఫిజికల్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుందని.. దీంతోపాటు 3 ఏళ్ల సడలింపు లభిస్తుందని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అగ్నిపథ్‌కు సంబంధించి కీలక మార్పులు తీసుకుంది. మాజీ అగ్నివీరుల విషయంలో కేంద్ర పారామిలటరీ బలగాలైన సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్, ఆర్‌పీఎఫ్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భవిష్యత్తులో చేపట్టే కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 10శాతం రిజర్వ్ చేస్తున్నట్టు జులైలోనే ప్రకటించింది.అగ్నిపథ్ పథకాన్ని జూన్ 2022న కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 17 నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న యువత మాత్రమే త్రివిధ దళాల్లో అగ్నివీర్‌లుగా విధులు నిర్వహించేందుకు అర్హులు అని కేంద్రం తెలిపింది. 4ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి తప్పుకున్న అగ్నివీర్‌లకు పింఛను సహా ఇతర సైనికులు అందుకునే సౌకర్యాలు ఏవీ కల్పించరు. వారిలో 25శాతం మందిని మాత్రమే మరో 15 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీస్‌లోకి తీసుకుంటారు. దీంతో ఈ అగ్నిపథ్ పథకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రిజర్వేషన్లు ప్రకటిస్తున్నాయి.