YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ లండన్ టూరుకు బ్రేక్ ...

జగన్ లండన్ టూరుకు  బ్రేక్ ...

గుంటూరు, సెప్టెంబర్ 14,
 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై ఇంకా స్పష్టత లేదు. షెడ్యూల్ ప్రకారం ఆయన మూడో తేదీన లండన్ కు వెళ్లాల్సి ఉంది. లండన్ లో ఉన్న తన కుమార్తెల్లో ఒకరి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు. 25వ తేదీ వరకూ ఆయనకు లండన్ లో పర్యటించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు కానీ అనూహ్యంగా పాస్ట్ పోర్టు సమస్య వచ్చి పడింది.  సీఎంగా ఉన్నప్పుడు లభించిన డిప్లొమాటిక్ పాస్ పోర్టు రద్దు కావడతో జనరల్ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీబీఐ కోర్టు ఆయనకు ఐదేళ్ల పాటు పాస్ పోర్టు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఆయనపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రస్తుత మంత్రి పొంగూరు నారాయణ... గతంలో ఓ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అది  విచారణలో ఉంది. ఈ కారణంగా  పాస్ పోర్టు కోసం ఎన్వోసీ కావాలంటే.. కోర్టుకు హాజరై పూచికత్తు సమర్పించాలని..అలాగే పాస్ పోర్టును ఏడాదికి మాత్రమే ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఆదేశాలు నచ్చలేదు. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు గత  బుధవారం తీర్పు వెలువరించింది. జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల పాటు పాస్ పోర్టు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఆయన ఇందు కోసం స్వయంగా  ప్రజా ప్రతినిధుల కోర్టుకు వెళ్లి రూ. ఇరవై వేల రూపాయల పూచీకత్తును సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో మినహాయింపు ఇవ్వలేమని తెలిపింది. అయినా జగన్మోహన్ రెడ్డికి  కోర్టుకు వెళ్లి పూచికత్తు సమర్పించలేదు. దీంతో  పాస్ పోర్టు అంశం తేలలేదు. ఇప్పుడు వరద ప్రాంతాల పర్యటనలకు వెళ్లారు. జగన్ కు కోర్టుకు వెళ్లి పూచికత్తు సమర్పించడం ఇష్టం లేదని అందుకే  వెళ్లలేదని  వైసీపీ  వర్గాలు చెబుతున్నాయి. కుమార్తె  పుట్టిన రోజు కూడా ముగిసిపోయినందున ఇప్పుడు లండన్ కు వెళ్లాల్సిన అవసరం లేదని.. పైగా కోర్టు ఇచ్చిన గడువులో సగం రోజులు పూర్తయిపోయాయని.. ఒక వేళ వెళ్లినా ఎక్కువ రోజుల ఉండలేరు కాబట్టి..మరోసారి కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే లండన్ పర్యటనను జగన్ ఇప్పటికి అయితే వాయిదా వేసుకున్నారని తర్వాత పాస్ పోర్టు సమస్య పరిష్కారం అయిన తర్వాత మరోసారి కోర్టుకు విజ్ఞప్తి చేసుకుని వెళ్తారని అంటున్నారు. పార్టీ కార్యాలయంలో రోజూ నేతలతో సమావేశమవుతున్న జగన్ జిల్లాల అధ్యక్షుల్ని నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల అధ్యక్ష బాధ్యతల్ని సీనియర్లకు ఇవ్వాలని అనుకుంటున్నారు.    
 

Related Posts