ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రూపొందించారనే వార్త కలకలం రేపుతోంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే మోదీని చంపేయాలని మావోలు కుట్ర పన్నారని తెలుస్తోంది. ప్రధాని రోడ్ షోలను టార్గెట్ చేసి ప్లాన్ అమలు చేయాలనే మావోల కుట్రలను పుణే పోలీసులు ఆదిలోనే భగ్నం చేశారు. రాజీవ్ గాంధీ తరహాలో మరో ఘటన దిశగా ఆలోచిస్తున్నామనే లేఖను పోలీసులు ఓ ఇంట్లో జరిపిన తనిఖీల్లో కనుగొన్నారు. ఇది అంత తేలికేం కాదు, ఆత్మహత్యా సాదృశ్యమే. విఫలమయ్యే అవకాశం ఉన్నా.. పార్టీ ఈ ప్రతిపాదన విషయంలో సీరియస్‌గా ఆలోచించాలి. మోదీ రోడ్ షోలను టార్గెట్ చేయడం సమర్థవంతమైన వ్యూహం’ అని ఆ లేఖలో ఉంది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీతో సంబంధం ఉన్న రోనా విల్సన్ ఇంట్లో ఈ లేఖను కనుగొన్నామని పుణే పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. ఈ లేఖ బయటకొచ్చే ముందు రోజే పుణే పోలీసులు దళిత హక్కుల కార్యకర్త సుధీర్ ధావాలే, లాయర్ సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, షోమా సేన్, రోనా విల్సన్‌లను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. వీరికి కొద్ది నెలల క్రితం జరిగిన భీమా-కోరేగావ్ ర్యాలీ హింసతో సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. రాజీవ్ తరహా ఘటన అని రాసిన ఆ లేఖలో.. రూ.8 కోట్లు ఎం-4 రైఫిల్, నాలుగు లక్షల రౌండ్లు కావాలని రాసి ఉంది. బీజేపీ 15 రాష్ట్రాల్లో గెలుపొందడంలో మోదీ విజయం సాధించాడు. దూకుడు ఇలాగే సాగితే మావోయిస్టు పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.