విజయవాడ,సెప్టెంబర్ 16,
ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు సవాల్‌గా మారింది. ఇప్పటికే మూడు విధాలుగా ప్రయత్నించినప్పటికీ.. అధికారులకు నిరాశే ఎదురైంది. బ్యారేజీకి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా బోట్లను తొలగించాల్సి ఉంది. మరోవైపు వరద ప్రవాహం వస్తూ ఉండడం కూడా ఆపరేషన్స్‌కు అడ్డంకిగా మారుతోంది. ప్లాన్-A లో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదల్లేదు. దీంతో ప్లాన్ A ఫెయిల్ అయింది. ఆ తర్వాత ప్లాన్ B లో భాగంగా ఎయిర్ బెలూన్స్‌ని రంగంలోకి దించారు. అయితే మునిగిన బోట్లు చాలా బరువు ఉండడం, వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్-B కూడా ఫెయిల్ అయింది. దీంతో బోట్లను తొలగించడానికి కచ్చులూరు బోట్ ప్రమాదంలో పనిచేసిన అబ్బులు టీమ్‌ను.. కాకినాడ నుంచి తీసుకొచ్చింది అధికార యంత్రాంగం.ప్లాన్-C లో భాగంగా కాకినాడకు చెందిన అబ్బులు అండ్ టీమ్ రంగంలోకి దిగింది. 7 భారీ పడవలను రంగంలోకి దించారు అధికారులు. మునిగిపోయిన బోట్లకు ఐరన్ రోప్‌లు, తాళ్లు కట్టి, వాటిని ఈ 7 పడవలకు కట్టి, లాక్కుంటూ ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. దీనిలో భాగంగా ఓ బోటును కొద్ది దూరం కదిలించగలగడంతో అధికారుల్లో ఆశలు చిగురించాయి. అయితే చివరికి పడవలు, రోప్‌లతో బోట్లను లాగే ప్రయత్నం కూడా ఫెయిలైందని చెబుతున్నారు. పడవలను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఐదో రోజు తీవ్రంగా ప్రయత్నించారు. ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C కూడా ఫెయిల్ కావడంతో తాత్కాలికంగా రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌ను నిలిపివేసింది. మరో పద్ధతిలో బోట్లు బయటకు తీసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇదైనా సక్సెస్ అవుతుందా.. లేదా.. ఇంకా ఎన్ని రోజులు బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందో చూడాలి.
* ప్రకాశం బ్యారేజీ దగ్గర క్లిష్టంగా మారిన బోట్ల తొలగింపు
* బోట్లను తొలగించేందుకు ఆరు రోజులుగా శ్రమిస్తున్న సిబ్బంది
* వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయం
* గొల్లపూడి నుంచి రెండు కార్గో బోట్లు తీసుకురావాలని ప్లాన్
* బోట్లలో వాటర్ నింపి బోట్లను లాక్ చేయనున్న సిబ్బంది