YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అప్పటి చిరంజీవి నటి... ఇప్పుడు కన్నడ మంత్రి

అప్పటి చిరంజీవి నటి... ఇప్పుడు కన్నడ మంత్రి
నీ మీద నాకు ఇదయ్యో...’ అంటూ రాక్షసుడు మూవీలో చిరంజీవితో కలిసి స్టెప్పేసిన ఆ అందాలనటి గుర్తుందా..? ఆమె పేరే జయమాల. ప్రస్తుతం ఆమె కన్నడ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కొత్తగా కొలువైన కుమార స్వామి మంత్రి వర్గంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్‌ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు కన్నడ కేబినేట్‌ ఏకైక మహిళా మినిష్టర్‌గా చరిత్ర సృష్టించారు. దీంతో ఆమె గురించి నెట్‌లో అన్వేషణ మొదలైంది. 62 ఏళ్ల జయమాల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం యాక్టివ్ మెంబర్‌గా ఉంటూ.. ఆ పార్టీ తరుపున విధానపరిషత్‌ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం తాజా మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. కన్నడ నటిగా పలు చిత్రాల్లో అలరించిన జయమాల సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. గతంలో శబరిమల అయ్యప్ప ఆలయం గర్భగుడిలోకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దక్షిణ కన్నడలో చిక్కమగళూరు జన్మించిన ఈమె ‘కాస్ దాయె కండన’ అనే తుళు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 1974 నుండి 2018 వరకూ పలు కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. కన్నడ రాజ్ కుమార్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, శంకర్ నాగ్, అంబరీష్‌లతో కలిసి నటించింది. శకర్ గురు, గిరి కన్య లాంటి సూపర్ హిట్స్ మూవీలో నటించి మెప్పించారు. అనంతరం తెలుగులో రాక్షసుడు మూవీలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించారు. ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ‘నీ మీద నాకు ఇదయ్యో...’ అంటూ స్టెప్పులేశారు. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ వివాహం చేసుకున్నారు. తరువాత అతనికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామేన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్ళి చేసుకున్నారు. ఈమెకు సౌందర్య అనే కుమార్తె ఉన్నారు. ఆమె కూడా హీరోయిన్‌గా రాణిస్తోంది. గాడ్ ఫాదర్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య 2012లో టాలీవుడ్‌లో ‘మిస్టర్ ప్రేమికుడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఇక జయమాల పొలిటికల్ ఎంట్రీకి ముందే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC)కి కోశాధికారిణిగా, అధ్యక్షురాలిగా పనిచేసిన ఏకైక మహిళగా కూడా ప్రసిద్దికెక్కారు. ఈమె కర్ణాటకలోని గ్రామీణ స్త్రీల పునరావాసము అనే అంశంపై పరిశోధనలు చేసి బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి 2008లో ఎ.పి.జె.అబ్దుల్ కలాం చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను తీసుకున్నారు. ఆ విధంగా భారతీయ సినీ పరిశ్రమలో థీసిస్ వ్రాసి డాక్టరేట్‌ను స్వీకరించిన ఏకైక నటిగా పేరుగడించారు జయమాల. నటిగా, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షురాలిగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ వచ్చిన జయమాల కర్ణాటక రాజకీయాల్లో రాణిస్తూ.. మంత్రి స్థాయికి ఎదిగారు.

Related Posts