YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెజవాడలో బురద రాజకీయాలు

బెజవాడలో బురద రాజకీయాలు

విజయవాడ, సెప్టెంబర్ 16,
విజయవాడ వరదల సందర్బంగా ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. అయితే గత 15 రోజుల్లో ఏపీ పాలిటిక్స్ లో పరిణామాలు గమనించిన వారికి కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. యాదృచ్చికమో లేక పక్కా ప్లానింగో చెప్పలేం కానీ కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్లస్ లు గత పక్షం రోజుల్లో ఎదురైతే స్ట్రాటజీ లోపంతో వైసీపీకి కొన్ని అంశాలు మైనస్ గా మారాయి.విజయవాడ లోని సగభాగం మునిగింది అని తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన మకాం విజయవాడ కలెక్టరేట్ లోనే ఏర్పాటు చేసుకుని 10 రోజులు అక్కడినుండే వార్ రూమ్ నడిపించారు. 70 ఏళ్లు దాటినా, ఈ వయసులో సైతం వరద నీటిలో, బోట్లలో తిరుగుతూ నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే చాలా ఏరియాల్లో మంచి నీరు, పాలు సహా నిత్యావసరాలను సరఫరా చేశారు. విపక్షాలు ఇదంతా ప్రచార ఆర్భాటం అని ప్రచారం చేసినా టీడీపీ సోషల్ మీడియా అతి చేస్తోంది అన్న విమర్శలు వచ్చినా జనాల్లో మాత్రం చంద్రబాబు ఇమేజ్ బాగా పెరిగింది. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయనకున్న గుడ్ నేమ్ ను మరోసారి నిలబెట్టుకున్నారన్న పేరు ఏపీ అంతటా వచ్చిందిప్రజలు ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో వారు తమను ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తారు తప్పించి రాజకీయాల గురించి అసలు పట్టించుకోరు. వైసీపీ ఈ విషయాన్ని ఎందుకో సరిగ్గా గమనించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిగో వరదలు ముగిసిన ప్రస్తుత సమయంలో ఆరోపణలు విమర్శలు ఎన్ని చేసినా చెల్లుతాయి. కానీ సరిగ్గా వరదల్లో ఇబ్బంది పడుతున్న సమయం లో "ఈ వరదలు చంద్రబాబు వైఫల్యం వల్లే వచ్చాయి ఆయన తన ఇంటిని కాపాడుకోవడానికి వరదలను విజయవాడ వైపు మళ్లించారు" అనే ఆరోపణలు జనంలోకి పెద్దగా వెళ్లినట్లు కనిపించడం లేదు. ఒకవైపు వరదల వార్తలు నడుస్తుండగానే సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం రాసలీలలు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన తనను చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు మీడియా ముందుకు రావడం రాజకీయంగా సంచలనం గా మారింది. అయితే ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు సత్యవేడు ఎమ్మెల్యేను  టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఉదయం వీడియో బయటకు వస్తే మధ్యాహ్నానికి ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జనాల్లో టీడీపీ కు ప్లస్ గా మారింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ సందర్బంగా గతంలో కొందరు వైసిపీ నేతలపై వచ్చిన ఆరోపణలు వారికి అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతుగా నిలవడం వంటి అంశాలు  మరోసారి తెరపైకి వచ్చాయి. కొందరైతే ఏకంగా హత్యచేసి క్రిమినల్ కేసుల్లోనే ఇరుక్కున్నారు. అయినా గానీ, కొందర్నీ జైలుకెళ్ళి మరీ జగన్ పరామర్శించి రావడం జనాల్లోనూ సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.వరద సహాయక చర్యల్లో కూటమి మంత్రులు సైతం చాలా యాక్టివ్ గా పనిచేసారు. మున్సిపల్ మంత్రి నారాయణ, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, హోం మంత్రి అనిత అయితే వరద ఉన్నన్ని రోజులూ నిద్రాహారాలు మాని తిరిగారు. లోకేష్, నాదెండ్ల మనోహర్ లాంటి మంత్రులూ ఇదే పంథాలో పనిచేశారు. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఎక్కువగా ఫీల్డ్ లోనికి రాకపోయినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్ధికంగానూ, తన శాఖల పరంగానూ తనవంతు కృషి తాను చేశారు. అలాగే మిగిలిన శాఖల మంత్రులు కూడా ఎంతో కొంతమేర తమ తమ విధులు నిర్వర్తించారు. అన్నింటినీమించి కొన్ని విపత్కర సమయాల్లో  మంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకున్న సంఘటనలూ ఉన్నాయి. ఇది కూటమి పాలనా శైలిపై ప్రజల్లో కొంత సానుకూల దృక్పథాన్ని పెంచింది.అయితే గత ప్రభుత్వంలో ఈ పాయింట్ మిస్సయింది అని ఆ పార్టీ నుండి బయటికు వచ్చిన నేతలే అంటున్నారు. ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులకు పెద్దగా స్వేచ్ఛ ఉండేది కాదని పార్టీ ముఖ్యులు చెప్పిన అంశాలు తప్ప ఇతర విషయాల్లో సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయేవారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అలాంటి స్వేచ్ఛ ఆ పార్టీలో ఉండి ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయి ఉండేవారు కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో సైతం ఉంది. ఓవరాల్ గా వరదల సందర్బంగా అందివచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం రెండు చేతులా అందిపుచ్చుకుంటే.. కీలకంగా వ్యవహరించాల్సిన వైసిపీ మాత్రం ఎక్కడో స్ట్రాటజీ లోపంతో ఇబ్బందిపడుతోంది అన్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఊహించని స్థాయిలో నష్టపోయిన వైసీపీ భవిష్యత్తులో ఏం చేస్తుంది, ఒక్కో మెట్టు పేర్చుకుని కంచుకోట తయారు చేసుకుంటారా.. ఇలాగే వ్యవహరించి మరోసారి దెబ్బతింటారా అని చర్చ జరుగుతోంది. త్వరలోనే వైసిపీ ఈ అంశాలను సరి చూసుకుంటుందో, లేదో...!

Related Posts