YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డ్యామేజ్ కంట్రోల్ లో గులాబీ అధిష్టానం

డ్యామేజ్ కంట్రోల్ లో గులాబీ అధిష్టానం

హైదరాబాద్, సెప్టెంబర్ 16,
తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీల మధ్య జరిగిన వార్.. బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారనుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు గులాబీ పార్టీని దెబ్బతీయనున్నాయా? అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని కారు పార్టీ వచ్చే ఏడాది జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓటమి నుంచి తప్పించుకోలేకపోవచ్చా? అసలే వరుస పరాజయాలతో నైరాశ్యంలోకి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి బూస్టప్ ఇవ్వడానికి అగ్రనాయకత్వం అనేకప్రయత్నాలు చేస్తున్నది. ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయడానికి ఆ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నది. ఇంతలో ఉప్పెనలా దూసుకొచ్చాడు పాడి కౌశిక్ రెడ్డి. ఆయన ఫైర్.. తిరిగి ఆ పార్టీకే నష్టం కలిగించే ముప్పు ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇది వరకు ఉన్న ఆనవాయితీలో భాగంగా ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. అరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారని, లేదంటే చేరనట్టు నిరూపించుకోవాలని గులాబీ పార్టీ నాయకులు సవాళ్లు విసిరారు. పాడి కౌశిక్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి ఆయన నిజంగానే తమ పార్టీలోనే ఉన్నారంటే.. గులాబీ కండువా పట్టుకుని ఆయన ఇంటికి వెళ్లుతానని, ఆ తర్వాత ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని సవాల్ చేశారు. ఆ తర్వాత ప్రతి సవాల్ చేసిన అరెకపూడి గాంధీ.. నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఉభయ వర్గాల మధ్య ఘర్షణలు, పూల కుండీలు, టమాటలు, గుడ్లు విసిరేసుకున్నారు. ఈ ఉద్రిక్తతల తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. అరెకపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డిని దూషించారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి కూడా దూషణల పర్వం సాగించారు. అదే క్రమంలో అరెకపూడి గాంధీ ఆంధ్రోడని, ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. తాను నికార్సైన తెలంగాణ బిడ్డనని, ఇక్కడ తాను భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని బీఆర్ఎస్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే వెంటనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ఈ వ్యాఖ్యలు కలకలం రేపిన తర్వాత కౌశిక్ రెడ్డి తనకు ఆంధ్రా సెటిలర్లపై గౌరవం ఉన్నదని, తాను కేవలం అరెకపూడిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని సర్దిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తమ అధినాయకుడు ఆంధ్రా సెటిలర్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పాడని గుర్తు చేశారు. తాజాగా శనివారం కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. తాము ఆంధ్రా సెటిలర్లకు ఎలాంటి హానీ తలపెట్టమని, తమ పదేళ్ల పాలనలో వారు ఎంతో సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నారని వివరించారు. ప్రాంతీయతను రేకెత్తించే విధంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపడం మూలంగానే కేటీఆర్ ఈ రోజు వివరణ ఇవ్వాల్సి వచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాస్తవానికి ఆంధ్రా సెటిలర్లు అధికంగా ఉండే జీహెచ్ఎంసీ పరిధిలోనే బీఆర్ఎస్‌కు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో జోక్యం చేసుకుంటే అది తమ కుర్చీకే ముప్పు తెస్తుందని భావించి గ్రేటర్‌లోని కీలక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిన్నకుండిపోయారని రాజకీయ పండితులు చెబుతున్నారు. తలసాని, మల్లారెడ్డి, పద్మారావు, వివేకానంద వంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరెకపూడి గాంధీ ఎపిసోడ్‌పై కామెంట్ చేయలేదు. సెటిలర్లకు వ్యతిరేకంగా కామెంట్ చేయడం.. తమ ఓటు బ్యాంకుకు ముప్పు తేవచ్చని భావించి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ వెంట ఉన్న ఆంధ్రా సెటిలర్లు.. పాడి కౌశిక్ వ్యవహారంతో పార్టీకి దూరం కావొచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ సీట్లకు గండిపెడుతూ బీజేపీ అనూహ్యంగా రాణించింది. ఎంఐఎం పరోక్ష సహకారంతో బీఆర్ఎస్ జీహెచ్ఎంసీని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్‌ వెంట ఎంఐఎం ఉన్నట్టు కనిపించడం లేదు. అలాగే.. బీజేపీ కూడా దూకుడు పెంచింది. అధికారంలోని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవడానికి పట్టుదలగా ఉన్నది. ఇప్పటికే పలువురు గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి తరుణంలో కౌశిక్ రెడ్డి ఆంధ్రా సెటిలర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్‌కు గండి కొట్టే ముప్పు ఉన్నదని విశ్లేషణలు వస్తున్నాయి.

Related Posts