తిరుమల, సెప్టెంబర్ 26,
తిరుమల లడ్డు మారింది. నెయ్యిలో నాణ్యత లడ్డుతో పాటు శ్రీవారి అన్న ప్రసాదాల రుచిని మార్చింది. నెయ్యి కల్తీతో లడ్డు ప్రసాదం అపవిత్రం అయిందన్న దుమారం భక్తుల్లో ఆందోళనకు గురి చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ అయ్యింది. శ్రీవారి మహా ప్రసాదంలో క్వాలిటీని పెంచింది. వెంకన్న ప్రసాదం మహా అద్భుతంగా ఉందన్న సంతృప్తిని కలిగించింది. తిరుమల లడ్డు.. మహా ప్రసాదంగా కోట్లాది మంది భక్తులు స్వీకరించే లడ్డూ రుచి ఎంతో మాధుర్యం. 310 ఏళ్లు నిండిన ఆ లడ్డు మాధుర్యం ఈ మధ్య కల్తీ నెయ్యితో రుచితప్పిందన్న భావన భక్తుల్లో బలంగా వినిపించింది. అమృత పదార్ధంగా భక్తిరస మాధుర్యాన్ని పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డూ లోని నెయ్యి కల్తీ వ్యవహరమే ఇందుకు కారణం అయ్యింది. తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేకపోవడానికి నెయ్యి నే కారణమని తేలింది. దీంతో నెయ్యి నాణ్యతను పెంచడం ద్వారా మహా ప్రసాదంలో క్వాలిటీ తీసుకురావాలని టీటీడీ భావించింది. ఈ చర్యనే కాంట్రవర్సీ కారణం అయ్యింది వెంకన్న భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డు ప్రసాదం నాణ్యత పై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో అంతే ప్రాధాన్యత ఇస్తున్న శ్రీవారి లడ్డు ప్రసాదం మహా ప్రసాదంగా భక్తులు భావించేలా చర్యలు చేపట్టింది. లడ్డు నాణ్యతపై భక్తుల నుంచి పిర్యాదులు, విమర్శలకు టీటీడీ చెక్ పెట్టే ప్రయత్నంలో సక్సెస్ అయింది. తిరుమలలో ప్రక్షాళన షురూ చేసిన సర్కార్ లడ్డు తయారీలో నాణ్యతకు పెద్ద పీట వేసింది. లడ్డు తయారీ కి వినియోగించే నెయ్యిలో నాణ్యత లేదని పోటు సిబ్బంది కూడా ఈవో దృష్టికి తీసుకుని రావడంతో నెయ్యి సరఫరా మారింది. నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టిన టీటీడీ సమూల మార్పులు చేసింది. లడ్డు తయారీకి వినియోగించే ముడి సరుకులలో నాణ్యత తోపాటు స్వచ్ఛమైన నెయ్యి ని కొనుగోలు చేస్తోంది. లడ్డు రుచి, నాణ్యత ను నందిని నెయ్యితో పెంచింది. ఇలా తిరుమల లడ్డు, శ్రీవారి అన్న ప్రసాదాలు నాణ్యత, రుచి పై టీటీడీ మరింత ఫోకస్ పెట్టింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో క్వాలిటీ పెంచిన టీటీడీ.. 10 లక్షల కేజీల నందిని నెయ్యి కొనుగోలుకు కేఏంఎఫ్ కు ఆర్డర్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం కర్ణాటక నుంచి తిరుపతికి నందిని నెయ్యి ట్యాంకర్ల ద్వారా చేరుతోంది. ఇలా భక్తకోటికి అమృత పదార్థంగా భక్తి రసం ఆధ్వర్యంలో పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డు కు దాదాపు 310 ఏళ్ల చరిత్ర ఉంది. 1715 లో తిరుమలేశుడికి శ్రీవారి ప్రసాదం అందుబాటులోకి రాగా 15వ శతాబ్దం నుంచే శ్రీవారి ప్రసాదం వడ భక్తుల కడుపు నింపేది. ఇలా శ్రీహరి ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఉండగా భక్తకోటికి ప్రీతిపాత్రమైన లడ్డూ నైవేద్యమంటే తిరుమలేశునికీ కూడా ఎంతో ఇష్టమైనది.ఇలా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది. ఇదో చారిత్రక ఆధారం కాగా అప్పటి నుంచే ప్రసాదాలు కూడా విక్రయించే వారన్న ప్రచారం ఉంది. పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలయ్యిందని చరిత్ర చెబుతోంది. అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనలు గా నైవేద్య వేళలు ఖరారు కాగా ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారనీ తెలుస్తోంది. ఆ రోజుల్లో కొండమీద భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవన్న ప్రచారం కూడా ఉండగా భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం ఆ తర్వాత సుఖీయం మనోహరపడి ఇలా ప్రసాదాలను ప్రవేశ పెట్టారు. వీటిలో వడ తప్ప మరేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాక పోవడంతో వడకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.ఇక, 1940 నుంచే భక్తుల చేతికి లడ్డూ అందింది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తరువాత ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచగా 1940 నుంచి బూందీని లడ్డుగా మార్చి భక్తులకు అందజేయడం అమల్లోకి వచ్చింది. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అనే పేరుతో 1950లో తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి ఖరారు చేసింది. దిట్టం పరిమాణాలను ఖరారు చేసిన టిటిడి ఆలయ అవసరాలతోపాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వస్తోంది. 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్న టిటిడి లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తుంది. భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీ కోసం చిన్న లడ్డూకు రూ. 48 వరకు ఖర్చు చేస్తున్న టీటీడీ రూ. 50 లకు విక్రయిస్తోంది.ఇక పోటులో దిట్టం ప్రకారం 5100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 803 కేజీల ముడి సరుకును వినియోగిస్తున్న టీటీడీ ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 18 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు వినియోగిస్తోంది. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది. భక్తులకు అందజేసే ఉచిత లడ్డు కాకుండా మూడు రకాల లడ్డూలను టిటిడి తయారు చేస్తోంది. రోజూ దాదాపు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తూ మూడు నుంచి మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తున్న పోటులో 600 మందిని సిబ్బంది గుమ గుమలాడే లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తోంది. 100 మంది కాంట్రాక్ట్ సిబ్బంది మరో 500 మంది శ్రీవైష్ణవులు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని, శ్రీవారికి నైవేద్యాలను సాంప్రదాయబద్ధంగా తయారు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు లడ్డులో నాణ్యతను పెంచిన టిటిడి క్వాలిటీ నెయ్యి వాడటం లేదన్న ఆరోపణలకు చెక్ పెట్టింది.ఈ టెండరింగ్ ద్వారా స్వచ్ఛమైన నెయ్యిని ప్రొక్యూర్ చేసుకుంటున్న టీటీడీ ఏటా 5 వేలకు పైగా మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తుంది. దీంతో లడ్డు తయారీలో నాణ్యతను పెంచిన టిటిడి ప్రతి నెల 1.10 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయిస్తోంది. ఏటా రూ 500 కోట్ల ఆదాయాన్ని గడిస్తోంది. దీంతో తిరుమల లడ్డూ ఎవర్గ్రీన్ అన్నట్లు కల్తీ వివాదానికి చెక్ పెట్టేలా నాణ్యతను పెంచడమే కాదు వెంకన్నను దర్శించుకున్న భక్తులకు అడిగినన్ని లడ్డూలను అందుబాటులోకి తెచ్చింది. స్వచ్ఛమైన నెయ్యితో తయారవుతున్న లడ్డుకు మరింత ప్రాశాస్త్యాన్ని తీసుకురా గలిగింది. లడ్డూలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు కలిపారనే వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం భక్తులపై పడకుండా స్వచ్ఛమైన నేతి వాడకంతో శ్రీవారి మహా ప్రసాదం గుమగుమలాడేలా చేసింది. నిత్యం శ్రీవారిని సగటు రోజూ దర్శించుకునే 70 వేల మందికి పైగా భక్తుల మన్ననలు టీటీడీ పొందుతోంది. రోజువారీగా లడ్డూను కొనుగోలు చేస్తున్న భక్తకోటి నాణ్యత పెరిగిందన్న సంతృప్తిని వ్యక్తం చేస్తోంది.ఒకవైపు తిరుమల లడ్డూ పై కల్తీ వివాదం నడుస్తుండగానే లడ్డూకు డిమాండ్ మాత్రం కొనసాగుతోంది. లడ్డూలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు కలిపారనే వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం ప్రపంచ వ్యాప్తం గా చర్చకు దారితీసినా ప్రతిరోజూ దర్శనం కోసం వచ్చే కొండకు వచ్చే భక్తులు పెరుగుతున్నట్లే లడ్డుకు డిమాండ్ పెరుగుతుంది. ఎప్పటిలాగే లడ్డూను కొనుగోలు భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. గత నాలుగు రోజుల్లో 14 లక్షలకు పైగా తిరుపతి లడ్డూలు భక్తులకు చేరాయి. సెప్టెంబర్ 19న 3.59 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక సెప్టెంబర్ 20న 3.17 లక్షలు, 21న 3.67 లక్షలు, 22న 3.60 లక్షల లడ్డూలు అమ్మకాలు జరిగాయి. ఇలా టీటీడీ గణాంకాలు ప్రకారం రోజువారీ సగటున దాదాపు 3.50 లక్షల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రస్తోంది. కల్తీ నెయ్యి వివాదం ఉన్నా ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యితో తయారవుతున్న లడ్డూల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపలేదన్న అభిప్రాయం భక్తుల కొనుగోలు స్పష్టం చేస్తోంది.