YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈటెలకు కృష్ణయ్యతో బ్రేక్...

ఈటెలకు కృష్ణయ్యతో బ్రేక్...

హైదరాబాద్, సెప్టెంబర్  26,
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2020 నుంచి 2023 వరకు బీజేపీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అధిష్టానం ఎన్నికల సమయంలో తప్పించింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల ఒత్తిడికి బీజేపీ అధిష్టానం తలొగ్గిందన్న వాదనలు వినిపించాయి. దీంతో అప్పటి వరకు జోష్‌గా ఎన్నికలకు సిద్ధమైన కేడర్‌ ఒక్కసారిగా డీలా పడింది. కిషన్‌రెడ్డి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. బండి సంజయ్‌ తప్పుకున్న తర్వాత కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకుని అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే.. బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి కొత్తగా పార్టీలోచేరిన ఈటల రాజేందర్‌తోపాటు, రఘునందన్‌రావు, మరికొందరు నేతలు కారణమని ప్రచారం జరిగింది. బీసీ నేత అయిన బండిని తప్పించేందుకు మరో బీసీ నేత అయిన ఈటల రాజేందర్‌ యత్నించడమే సంచలనంగా మారింది. దీంతో పార్టీలోని బీసీలు రెండు వర్గాలుగా విడిపోయారు. సంజయ్‌కి కొన్ని వర్గాలు, ఈటల రాజేందర్‌కు కొన్ని కులాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీలను ఒక్కటి చేసేందుకు కమలం అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్యను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది.రాజ్యసభ ఎంపీ అయిన ఆర్‌.కృష్ణయ్య.. సైలెంట్‌గా వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదించినట్లు రాజ్యసభ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు విషయం ఎవరికీ తెలియదు. ఇలా జగన్‌కు షాక్‌ ఇచ్చిన కృష్ణయ్య.. ఇప్పుడు కమలంలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మోపిదేవి వైసీపీని వీడిన సమయంలోనే ఆర్‌. కృష్ణయ్య కూడా పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన తాను జగన్‌ వెంటే ఉంటానని ప్రకటించారు. కానీ సడన్‌గా హ్యాండ్‌ ఇచ్చారు.కొత్త పార్టీ పెట్టాలని ఆర్‌.కృష్ణయ్య ఆలోచన చేశారు. బీసీల కోసం ప్రత్యేక పార్టీ ఉండాలని భావించారు. కానీ, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం కొత్త పార్టీ పెట్టకుండా బ్రేక్‌ వేసింది. ఆయనను కమలంలోకి ఆహ్వానించి రాజ్యసభ టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా కృష్ణయ్యకు మద్దతు తెలిపారు. బీజేపీలో బీసీలను చీల్చిన ఈటల రాజేందర్‌కు చెక్‌ పెట్టే వ్యూహంతో కృష్ణయ్యను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణయ్య వస్తే.. పార్టీలోని బీసీలంతా ఒక్కటవుతారని, పార్టీకి అది ప్లస్‌ అవుతుందని, వచ్చే ఎన్నికల నాటికి బీసీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం కూడా బావిస్తోంది. దీంతో ఆర్‌. కృష్ణయ్య కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts