కర్ణాటక కేబినెట్ లో శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. సీఎం కుమారస్వామి గౌడ ప్రభుత్వంపై 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది కానీ అసంతృప్త జ్వాల రగులుతూనే ఉంది. రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కకపోవడంతో అధిష్ఠానంపై వారంతా గుర్రుగా ఉన్నారు. ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావు, రోషన్ బైగ్, రామలింగారెడ్డి, సతీష్ ఝార్కిహొలి, శివశంకరప్ప వంటి సీనియర్ నేతలు తమకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ లుకలుకలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. కొంత టెన్షన్ వాతావరణం ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తిగా ఉన్న వారి విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. ఈ పరిణామాల పట్ల పార్టీలోని సీనియర్ల అసంతృప్తితో ఉన్నారని.. అయితే వారికి తగిన న్యాయం చేసేందుకు అధిష్ఠానం త్వరలో ఖాళీగా ఉన్న కేబినెట్ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నిజమేనని, సరైన నిర్ణయంతో తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తిరిగి గాడిలో పెడుతుందని, సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. కాగా, తిరుగుబాటు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర రంగంలోకి దిగినట్టు సమాచారం. అయితే, ఆ ఎమ్మెల్యేలతో పరమేశ్వర జరుపుతున్న చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం.