YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారా... నిన్న రోజా... ఇవాళ తమ్మినేని

సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారా... నిన్న రోజా... ఇవాళ తమ్మినేని

తిరుపతి, సెప్టెంబర్ 27,
వైసిపి ఆత్మ రక్షణలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైసిపి హయాంలో వైఫల్యాలు బయటకు వస్తున్నాయి. అదే సమయంలో పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతల సంఖ్య పెరుగుతోంది. ఒక విధంగా ఇది సంక్లిష్ట పరిస్థితి.అందుకే వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. వైసిపి నాయకులతో ప్రెస్ మీట్ లు పెట్టిస్తున్నారు. తాజాగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. కానీ వల్లభనేని వంశీ ఒక్క మాట అనకుండా సైలెంట్ గా ఉన్నారు. అదే సమయంలో కొడాలి నాని సైతం గతానికి భిన్నంగా మాట్లాడారు. ఎక్కడా మాటల్లో మునుపటి దూకుడు తనం ప్రదర్శించలేదు. బూతులు మాట్లాడలేదు. టీటీడీ లడ్డు వ్యవహారంలో వైసిపి తప్పు లేదని మాత్రమే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుపై సునిశిత విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు వల్లభనేని వంశీ దిగాలుగా కనిపించారు. అయితే అది వ్యూహకర్తల పనేనని ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సైతం మీడియాతో మాట్లాడారు. గతంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండేటప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన తమ్మినేని.. ఇప్పుడు వైసీపీ నేతగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడారు. అయితే వైసిపి ఆత్మ రక్షణలో పడడం వల్లే దాక్కున్న నేతలంతా బయటకు వచ్చారని ప్రచారం ప్రారంభమైంది. ప్రస్తుతం ఏపీలో తిరుమలలో వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయంలో వైసీపీని కార్నర్ చేసింది టిడిపి కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముప్పేట దాడి చేస్తున్నారు.గత వంద రోజులు మాట్లాడని వారు మీడియా ముందుకు వచ్చారు. టిడిపి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చంద్రబాబు ఈ తరహా ప్రచారానికి తెర తీసారనిజగన్ ఆరోపించారు. సిబిఐతో పాటు సింగిల్ జడ్జి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిటిడి చైర్మన్లుగా పనిచేసిన వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు ఖండించారు. అది తప్పుడు ప్రచారం గా పేర్కొన్నారు. తాజాగా మాజీ మంత్రులు కొడాలి నాని, తమ్మినేని సీతారాం ఈ వివాదం పై మాట్లాడారు. కొడాలి నాని కాస్త కూల్ గా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తేలికపాటి విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే స్పీకర్ గా పనిచేసిన సీనియర్ నేత తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. అందులో జంతు కొవ్వు కలిసిందన్నది ఓ నిర్ధారణలో తేలినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. అయితే ఈ తప్పును తమ్మినేని ఒప్పుకున్నట్లు ప్రకటన చేశారు. తప్పు టిటిడిది కాదు.. ఆవుది అంటూ అర్థం వచ్చేలా మాట్లాడారు. సాధారణంగా ఆవాలు, పామాయిల్ తినే ఆవులు ఇచ్చే పాలలో కల్తీ అవుతుందని.. అలా నెయ్యిలో కల్తీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ తమ్మినేని చేసిన ప్రకటన వైసీపీకి మరో డ్యామేజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇది ఉద్దేశపూర్వకంగా, రాజకీయ పగతో చేసిన పని అని ఇప్పటివరకు వైసీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. కానీ తమ్మినేని మాత్రం ఏకంగా ఆవుపై నెపం మోపడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఆయన మట్టిలో ఉండే మాట్లాడుతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నించే దాకా పరిస్థితి వచ్చింది. అంటే తమ్మినేని కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్టేనా? నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సమస్యపై మాట్లాడిస్తే తమ్మినేని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంత పార్టీలోనే తమ్మినేని కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి.ఈ వివాదం కోట్లాదిమంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ వివాదములో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. దాని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ ఆపసోపాలు పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఒక సీనియర్ నేతగా ఉన్న తమ్మినేని.. ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి ఈ వివాదం యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇక రోజా...
వైసీపీ ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి రోజా ఒకరు. గత ఐదేళ్లుగా ప్రత్యర్థులపై టార్గెట్ చేయడంలో ఆమె తీరే వేరు. 2014లో తొలిసారిగా ఆమె నగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ వైసీపీ ఏర్పాటుకు ఆ పార్టీలో చేరి.. ఎమ్మెల్యేగా విజయం సాధించాలన్న తన కలను సాకారం చేసుకున్నారు.అయితే ఐదేళ్ల పాటు వైసీపీ విపక్షంలో ఉండిపోయింది. ఆ సమయంలో ఎంతో దూకుడు కనబరిచారు రోజా. జగన్ టీమ్ లో ముఖ్య నేతగా మారిపోయారు. నాడు అధికారపక్షం పై విరుచుకుపడే తీరు ఆకట్టుకుంది.అదే ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వేటుకు కారణమైంది.అయితే రోజా మాత్రం దూకుడు తగ్గించలేదు. అదే స్పీడ్ తో 2019 ఎన్నికల్లో నగిరి నుంచి రెండోసారి గెలిచారు. అక్కడి నుంచి రోజా వెను తిరిగి చూడలేదు. తొలి మంత్రివర్గంలో ఆమెకు చోటు దక్కలేదు. కానీ విస్తరణలో మాత్రం ఛాన్స్ ఇచ్చారు జగన్. అక్కడి నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. ఆపై వివాదాస్పదం అయ్యారు. బూతు నేతల సరసన చేరిపోయారు. అదే ఆమెకు ఇబ్బందిగా మారింది. వైసిపి దారుణంగా ఓడిపోయింది. రోజా నగిరి నుంచి భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో కొద్ది రోజులు పాటు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. స్థానికంగా కూడా కనిపించకుండా పోయారుతాజాగా తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తెరపైకి వచ్చారు రోజా. ఈ విషయంలో సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. అసలు వైసీపీ ది తప్పు కాదన్నట్టు చెప్పుకొచ్చారు. తమ పార్టీని వెనుకేసుకొచ్చారు. అయితే పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని పరచు తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలకు వెళ్లడం ద్వారా రోజా తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్నారు. బ్రేక్ దర్శనాలతో ఆమె డబ్బులు దండుకున్నారని ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తిరుమల లడ్డు వివాదం పై మాట్లాడడం జనాల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. ఈ విషయంలో ఆమె మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.అయితే రోజా తనకు తాను అతిగా ఊహించుకున్నారు. లడ్డు వివాదం నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేశారు. తిరుమల ఎవరి హయాంలో మెరుగ్గా ఉందని.. లడ్డు విషయంలో ఎవరిది తప్పు అంటూ ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో పోల్స్ పెట్టారు. మెజారిటీ జనాలు చంద్రబాబుకు జై కొట్టారు. కనీస స్థాయిలో కూడా జగన్ ను సమర్ధించలేదు. ఈ పోల్ రిజల్ట్స్ కు సంబంధించి స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దెబ్బతో రోజా యూట్యూబ్ ఛానల్ ని మూసివేశారు. ఆపై మాట మార్చారు. అసలు తాను యూట్యూబ్ ఛానల్ లో లేనట్టు చెప్పుకొచ్చారు.

Related Posts