హైదరాబాద్
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గనులశాఖ డైరెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో గురువారం రాత్రి 9.30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఈ నెల 11న గనుల శాఖాధికారుల ఫిర్యాదుతో వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని నేరపూరిత మోసం,నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నాయి. ఆయన కోసం ఏసీబీ టీమ్లు రంగంలోకి దిగాయి.. చివరికి హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు
ఏసీబీ నమోదు చేసిన కేసులో వెంకటరెడ్డి ఏ1గా.. అనిల్ ఆత్మారామ్ కామత్, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ (జేపీవీఎల్) ప్రతినిధి ఏ2గా ఉన్నారు. పి.అనిల్కుమార్, ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధి ఏ3, ఆర్.వెంకట కృష్ణారెడ్డి, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి ఏ4గా ఏసీబీ కేసు నమోదు చేసింది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) ఏ5గా.. ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, హైదరాబాద్ ఏ6గా చేర్చారు. జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ7లతో పాటు ఇతరులు నిందితులుగా ఉన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంలో ఏకంగా రూ.2,566 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ దర్యాప్తులో తేలింది. కీలక ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్టు చేశారు.