YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ

వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ ఎక్కడ

కాకినాడ, సెప్టెంబర్ 28,
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను కూట‌మి ప్ర‌భుత్వం ప్రకటించింది. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ ఎస్టీలకు పెద్దపీట వేసినట్లుగా ప్రకటించారు.ఉమ్మడి జిల్లా నుంచి ఏడు కార్పొరేషన్లల్లో 14 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించారు. అందులో జ‌న‌సేన‌కు ఒక కార్పొరేష‌న్ చైర్మ‌న్, నాలుగు కార్పొరేష‌న్ల‌కు డైరెక్ట‌ర్లు ప‌ద‌వులు ద‌క్కాయి. టీడీపీకి ఎనిమిది డైరెక్ట‌ర్ ప‌ద‌వులు ద‌క్కాయి. బీజేపీ ఒక డైరెక్ట‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. అందులో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా.. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన జనసేన నేత తోట మెహర్ సీతారామ సుధీర్‌కు కేటాయించారు. పౌరసరఫరాల సంస్థలో డైరెక్టర్లుగా పెద్దాపురానికి చెందిన బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మజ, ముమ్మిడివరానికి చెందిన టీడీపీ నాయకులు మోకా ఆనందసాగర్, కాకినాడ సిటీకి చెందిన జ‌నసేన నాయ‌కురాలు కడలి ఈశ్వరికి నియ‌మించారు.పద్మశాలి వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా రాజమండ్రి సిటీకి చెందిన టీడీపీ నేత‌ హరి కిషోర్, రాజ‌మండ్రి రూర‌ల్‌కి చెందిన టీడీపీ నేత ఎం. శివ సత్య ప్రసాద్, పిఠాపురానికి చెందిన టీడీపీ నేత తాడే సత్యనారాయణ, పిఠాపురానికి చెందిన‌ జనసేన నేత సూరిశెట్టి నాగకృష్ణను నియ‌మించారు. ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రాజమండ్రి సిటీకి చెందిన టీడీపీ నేత‌ ఎర్రా వేణుగోపాల్ రెడ్డికి పదవి దక్కింది.టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రాజమండ్రి సిటీకి చెందిన టీడీపీ నాయకుడు వాసిరెడ్డి రాంబాబు, జనసేనకు చెందిన గంటా స్వరూప దేవికి, ఏపీ మార్క్ ఫెడ్‌లో డైరెక్టర్‌గా రాజోలుకు చెందిన జనసేన నేత గుండుబోగుల నరసింహారావుకు, స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా అమలాపురం టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరికి, రాష్ట్ర వినియోగదారుల పరిరక్షణ కౌన్సిల్ సభ్యులుగా ముమ్మిడివరానికి చెందిన టీడీపీ నాయకుడు నాగిడి నాగేశ్వరరావులకు అవకాశం దక్కింది.ఎప్పటి నుంచో పదవులను ఆశిస్తున్న ఆశావహులకు మొదటి జాబితాలో అవకాశం దక్కకపోవడంతో నిరాశ చెందారు. ప్రధానంగా గడచిన ఎన్నికల్లో టికెట్ ఆశించి, పొత్తుల వ‌ల్ల‌ త్యాగం చేసిన వారికి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. వాస్తవానికి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కొందరు మంతనాలు ప్రారంభించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నాయకులు నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నించారు.మొదటి విడతలో కీలక కార్పొరేషన్ల పదవులను ప్రకటించినా పలువురికి అవకాశం రాలేదు. ఇందులో టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న మెట్ట ప్రాంతానికి చెందిన జ్యోతుల నవీన్ కాకినాడ ఎంపీ సీటుని ఆశించారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇప్పుడు ఏదొక కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఎదురు చూసినా నిరాశ ఎదురైంది. అయితే ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం శ్రమించిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్ఎన్ వర్మ.. మొదటి నుంచీ కీలక పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయలేదు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత రెండు ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు ఎన్నిక జ‌రిగింది. అందులో ఒక‌టి టీడీపీ, మ‌రొక‌టి జ‌న‌సేన‌కు వెళ్లాయి. అయితే చంద్ర‌బాబు హామీ ఇచ్చిన నేప‌థ్యంలో అప్పుడే అంద‌రూ పిఠాపురం వ‌ర్మ‌కు టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇస్తార‌ని అనుకున్నారు.కానీ.. టీడీపీ త‌రపున సీ.రామచంద్రయ్యకు ఇచ్చి, వ‌ర్మ‌కు మొండి చెయ్యి చూపించారు. ఇప్పుడు ఏదొక కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా దక్కుతుందని ఎదురు చూసినా ఈసారీ కూడా నిరాశ తప్పలేదు. అలాగే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత అల్లుమల్లు విజయకుమార్, జనసేన సీనియర్ నాయకుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు నామినేటెడ్ పదవులను ఆశించారు. కానీ ద‌క్క‌లేదు.కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణ, పిల్లి అనంతలక్ష్మి దంపతులు, టీడీపీ సీనియర్ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు కూడా కార్పొరేష‌న్ పదవిని ఆశించి నిరాశ చెందారు. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ముత్తా గోపాలకృష్ణ మాజీ మంత్రిగా పని చేశారు. ఆ ఆయన కుమారుడు ముత్తా నవీన్ జనసేన సీనియర్ నాయకునిగా పని చేస్తున్నారు. ఆయన కూడా నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూశారు. ప్రముఖ కాంట్రాక్టర్ జి.చంద్రమౌళి, మాజీ టీడీపీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్, బాలాజీ, ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు కత్తిపూడి బాబీలు పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.పెద్దాపురం జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మల బాబు (రామ‌స్వామి) కూడా ఎమ్మెల్సీ వ‌స్తుంద‌నే ఆశ‌తో తొలుత ఉన్నారు. కానీ టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత జ‌రిగిన మొద‌టి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున హ‌రి ప్ర‌సాద్‌ను ఆ పార్టీ రంగంలో దింపింది. దీంతో ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశించిన తుమ్మ‌ల బాబు భంగ‌పాటు ప‌డ్డారు. ఆ త‌రువాత క‌నీసం కార్పొరేష‌న్ ప‌ద‌వి అయిన వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ ఆ ప‌దవి ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న కార్య‌క‌ర్త‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.పెద్దాపురంలో అస‌లు బ‌లమే లేని బీజేపీకి కార్పొరేష‌న్‌లో స్థానం క‌ల్పించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ప‌ద‌వులు ఉన్నాయి. ఏమీ లేని బీజేపీకి ప‌ద‌వులు ఉన్నాయి. కానీ బ‌ల‌మైన జ‌న‌సేన‌కు మాత్రం ఒక్క ప‌ద‌వి కూడా లేదు. దీంతో జ‌న‌సేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టిక్కెట్టు రాక‌పోయిన‌ప్ప‌టీ, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డ, ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా అక్క‌డికి పెద్దాపురం నుంచి బ‌స్సులు పెట్టి జానాన్ని తీసుకెళ్లేవారు. అలాంటి తుమ్మ‌ల బాబుకు కార్పొరేష‌న్‌లో కూడా స్థానం ద‌క్క‌క‌పోవ‌డంతో జ‌న‌సైనికులు ఆగ్ర‌హంగా ఉన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ, జనసేన నాయకుడు అనుశ్రీ సత్యనారాయణ, నిడదవోలు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శ్రీనివాస నాయుడు, కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి జవహర్, రాజానగరం నియోజకవర్గం నుంచి సీనియర్ టీడీపీ నేత ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, గోపాలపురం నియోజకవర్గం నుంచి మాజీ జిల్లా పరిషత్తు చైర్మన్ టీడీపీ నేత నామినేటెడ్ పదవులను ఆశించి భంగపడ్డారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు లింగోలు పండు, పి.గన్నవరం నియోజవర్గం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు సిరిగినీడి వెంకటేశ్వరరావు, రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన సీనియర్ నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాపాక రమేష్, రామచంద్రాపురం నుంచి మాజీ ఆర్టీసీ జిల్లా రీజినల్ చైర్మన్ గా పనిచేసిన టీడీపీ నేత పితాని బాలకృష్ణ, జనసేన నుంచి కె.చంద్రశేఖర్, కొత్తపేట నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జ్ బండారు శ్రీనివాసరావు, మండపేట జనసేన నియోజకవర్గం ఇంఛార్జ్ లీలా కృష్ణ తదితరులు పోస్టులను ఆశించినా ఈ సారి నిరాశ తప్పలేదు.ప్రస్తుతం వివిధ కార్పోరేషన్ల పదవులను మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో ఇంకా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, కౌడా చైర్మన్, డైరెక్టర్లు, టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యులు, జిల్లా గ్రంధాలయాల సంస్థల చైర్మన్లు, డీసీసీబి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీపాద శ్రీవల్లభ గుడి, శ్రీ సంస్థాన సత్రం.. ఇలా పలు పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ సారైనా అవకాశం దక్కించుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు.

Related Posts