విజయవాడ, సెప్టెంబర్ 28,
బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటిస్తే అది కాస్త బ్యాంకుల పాలవుతోంది. గత రెండ్రోజులుగా ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డుతో లింకైన బ్యాంకు ఖాతాలకు పరిహారాన్ని చెల్లిస్తోంది. ఈ క్రమంలో కొందరు వరద బాధితుల పరిహారాన్ని బ్యాంకులు తమ పాత బాకీల్లో జమ చేసుకుంటున్నాయి. మైనస్ అకౌంట్లలోఉన్న నగదును బ్యాంకులు మళ్లించుకుంటుండంతో బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వరద బాధితుల నష్టం గణించినపుడు ఇచ్చిన బ్యాంకు అకౌంట్ ఒకటైతే ఆ ఇంట్లో ఎవరి అకౌంట్లో మైనస్ ఖాతా ఉంటే ఆ ఖాతాలకు నగదు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో బాధితులు లబోదిబోమంటున్నారు. కుటుంబంలో డిబిటి మ్యాపింగ్ ఉన్న ఖాతాలకు పరిహారం జమ చేస్తున్నట్టు బ్యాంకులు చెబుతున్నాయి. కొందరికి ఇనాక్టివ్ ఖాతాలు, ఆధార్ కేవైసీ కానీ ఖాతాలకు కూడా పరిహారం జమైన ఉదంతాలు వెలుగు చూశాయి. బుడమేరు వరదల్లో ముంపుకు గురైన బాధితులకు పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం చెల్లించింది. ఈ క్రమంలో పలు జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఈ మొత్తాన్ని పాతబకాయిలు, మైనస్ అకౌంట్లలో జమ చేసుకుంటున్నాయి. బుధవారం నుంచి నగదు చెల్లింపులు మొదలు కావడంతో లబ్దిదారులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఆ ఖాతాల్లో నగదు పడినా వెంటనే బ్యాంకులకు ఆటోమెటిక్ డెబిట్ కావడంతో తామేమి చేయలేమని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.సర్వం కోల్పోయిన బాధితులకు పరిహారం అందకుండా బ్యాంకులు చేయడంపై బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగదు రాకపోవడంతో బ్యాంకుల వద్ద బాధితులు ఉసురుమంటూ వెనుదిరుగుతున్నారు.ఆధార్ బేస్డ్ పేమెంట్స్ పద్ధతిలో ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం చెల్లించింది. పరిహారం నగదు విషయంలో బ్యాంకులకు సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఈ సమస్యలు తలెత్తాయి. కెనరా బ్యాంకు ఖాతాదారులకు ఈ సమస్యలు ఎక్కువగా ఎదురైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.బుడమేరు వరద బాధితులకు పరిహారం చెల్లింపు కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి దాదాపు 536.28కోట్ల రూపాయల పరిహారాన్ని ముంపు బాధితుల ఖాతాలకు ఆధార్ బేస్డ్ చెల్లింపుల ద్వారా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో చేపట్టారు. గురువారం సాయంత్రానికి మొత్తం 3,71, 302మందికి పరిహారం చెల్లింపుకు ఏర్పాట్లు చేసినట్టు రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా హిందుస్తాన్ టైమ్స్‌కు తెలిపారు.మరో రూ.10.69కోట్ల రుపాయల చెల్లింపులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయన్నారు. 16668మంది బాధితులకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల పరిహారం చెల్లింపు జరక బ్యాంకు ఖాతాలకు తిరిగి వచ్చాయని వివరించారు. మొత్తం 3,54,634మంది బాధితులకు రూ. 525.59కోట్ల రుపాయల్ని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. మిగిలిన వారికి కూడా చెల్లింపులు కొనసాగుతాయని వివరించారు.నగరంలోని వివిధ దశల్లో చేపట్టిన వరద నష్టం గణనలో పలు కుటుంబాలు తమకు పరిహారం అవసరం లేదని పేర్కొన్నాయి. ఇలాంటి కుటుంబాలు దాదాపు 80వేల వరకు ఉండొచ్చని సిఎంఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వరదల్లో ప్రధానంగా ఒక అంతస్తులోపు మాత్రమే నివాసాలు ఉన్న వారికి ఎక్కువ నష్టం వాటిల్లింది. రెండో అంతస్తు ఉన్న వారికి వరద ముంపుకు గురి కాలేదు. మొదటి అంతస్తులోపు ఉన్న వారికి రూ.25వేలు, మొదటి అంతస్తు ఆపై ఉన్న వారికి రూ.10వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. ద్విచక్ర వాహనానికి రూ.3వేలు, ఆటోకు రూ.10వేలు చెల్లించారు. దుకాణాలు, పశువులు, కోళ్లు ఇలా అన్నింటికి లెక్క కట్టి పరిహారం చెల్లించారు. వరద నష్టం గణనలో పలు కుటుంబాలు తమకు ఎలాంటి నష్టం జరగలేదని, పరిహారం అవసరం లేదని పేర్కొనడాన్ని అధికారులు గుర్తించారు. ఇలాంటి కుటుంబాలు 80వేల వరకు ఉండొచ్చని, వరద నష్టం చెల్లింపు పూర్తైన తర్వాత పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
రుణాలు కింద జమవద్దు= కలెక్టర్
లబ్ధిదారులు బ్యాంకుల నుంచి ఇప్పటికే ఏవిధమైన రుణాలునైనా తీసుకొని ఉంటే జమచేసిన ఆర్థిక సహాయాన్ని రుణం కింద జమచేసుకోవద్దని సూచించారు. సర్వం కోల్పోయి ఎన్నో ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఈ విషయంలో బ్యాంకుల భాగస్వామ్యం అవసరమన్నారు. జమచేసిన సొమ్ము ఆటోమేటిక్‌గా రుణ తిరిగి చెల్లింపు కింద కట్ అయినట్లు గుర్తిస్తే ఆయా బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు సమాచారమందించాలన్నారు. తిరిగి వారికి నగదు రూపంలో ఆర్థిక సహకారాన్ని అందించి వారు ఇబ్బందుల నుంచి బయటపడేయడంలో సహకరించాలని కలెక్టర్ సృజన బ్యాంకు అధికారులకు సూచించారు. దీనిపై కలెక్టర్ సూచనలను పరిగణనలోకి తీసుకొని తప్పనిసరిగా ఆర్థిక సహాయం బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు చెప్పారు. లబ్ధిదారులకు సహకరించడంలో బ్యాంకర్లు ముందుంటామని తెలిపారు