YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైడ్రా కన్నీటి గాధలు...

హైడ్రా కన్నీటి గాధలు...

హైదరాబాద్, సెప్టెంబర్ 28,
చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల రక్షణ కోసం హైడ్రా పని చేస్తుందని వార్తలు వచ్చినప్పుడు.. మంచిదే కదా అని అందరూ అనుకున్నారు. పెద్ద పెద్ద వ్యక్తుల నిర్మాణాలు కూల్చివేస్తుంటే.. కరెక్టే కదా అని చర్చించుకున్నారు. కానీ ఇప్పుడు ఎంతోమంది పేద, మధ్య తరగతి ప్రజలు కన్నీరు పెడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరం చైతన్యపురి మూసీ నది ఏరియాలో అధికారులు సర్వే చేపట్టి.. కూల్చివేయాల్సిన వాటికి మార్క్ చేస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు.'నా భార్య 9 నెలల కడుపుతో ఉంది. ఇప్పుడు ఉన్నపళంగా వచ్చి మా ఇల్లు కూల్చేస్తే.. మేము ఎక్కడికి పోవాలి' అని ఆవేదన వ్యక్తం చేస్తూ.. చైతన్యపురిలో పెట్రోల్ పోసుకొని ఒ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పట్టా భూమిలోనే ఇల్లు కట్టుకున్నాం.. కరెంట్ బిల్లు, ఇంటి పన్ను అన్ని కడుతున్నామని వాపోయాడు. అయినా అతని ఇల్లు నిలబడటం లేదు.'కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు.. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం అంటున్నారు. ఇంట్లో ఆడవాళ్లు భయపడి.. బీపీ, షుగర్ పెరిగిపోతున్నాయి. కాళ్లు, చేతులు ఆడట్లేదు. ప్రశ్నిస్తే కేసు వేస్తామని జీప్ ఎక్కించడానికి లాక్కుపోతున్నారు' అని మరో బాధితుడు చెబుతూ.. కన్నీటి పర్యంతం అయ్యారు.'మేం ఇంట్లోనే ఉంటాం. మా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని చంపి మూసీ నదిలో పడేయండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే. రాత్రికి రాత్రి ఇళ్లకు మార్కింగ్ వేసి పోతున్నారు. అసలు నిద్రపోకుండా భయం భయంగా బతుకుతున్నాం' అని ఓ మహిళ గుండె బాదుకుంది. ఇన్నాళ్లు లేని సమస్య ఇప్పుడే ఎలా వచ్చిందని ప్రశ్నించింది.ఈ నెల 8న సున్నం చెరువు కూల్చివేతలతో అంజలి అనే మహిళ తన గుడిసెను కోల్పోయింది. అంజలి తన సోదరుడి ఇంటికి తల దాచుకోవడానికి వెళ్లి.. అక్కడే గుండె పోటుతో మృతి చెందింది.విజయ్ ప్రతాప్ గౌడ్ అనే వ్యక్తి.. రూ.50 లక్షలతో ఫుడ్ కేటరింగ్ పెట్టుకున్నాడు. 68 మందిని తన దగ్గర పనికి చేర్చుకున్నాడు. హైడ్రా కూల్చివేతలో తన కేటరింగ్ గోడౌన్ నేలమట్టం అయ్యింది. దీంతో రూ.50 లక్షలు నష్టం జరిగింది. 68 మంది ఉపాధి కోల్పోయారు.కడుపుతో ఉన్న తన భార్య రోదిస్తున్నా.. సామగ్రిని బయట పెట్టుకోడానికి అధికారులు సమయం ఇవ్వలేదని రవి అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా హైదరాబాద్ నగరంలో ఎందరో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంకా కొందరైతే.. తమ కూల్చే సమయంలోనే.. తమను కూడా చంపేయండని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాము ఇంటి పన్ను, నల్లా పన్ను, కరెంట్ బిల్లు కడుతున్నామని బాధితులు చెబుతున్నారు. అనుమతి లేకుండా నిర్మిస్తే.. ఇవన్నీ ఎందుకు చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అధికారులే అనుమతి ఇచ్చి.. ఇప్పుడు వారే కూల్చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు. నిర్మాణం అక్రమం అయితే.. కట్టినప్పుడు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌లు కొన్నవారు దీనస్థితిలో ఉన్నారు. బిల్డర్ తమకు అమ్మితే కొనుక్కున్నాం.. ఇప్పుడు కూలిస్తే.. తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts