YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతి తర్వాతే టీటీడీ బోర్డు.,,?

సంక్రాంతి తర్వాతే టీటీడీ బోర్డు.,,?

తిరుమల, సెప్టెంబర్ 30,
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉండే నామినేడెట్‌ బోర్డు అది… జీవితంలో ఒకసారైనా ఆ బోర్డులో ఏదో ఒక పోస్టులో పనిచేయాలని చాలా మంది కలలు కంటుంటారు. సీఎం నుంచి పీఎం వరకు రికమెండేషన్స్‌ చేయించుకుంటుంటారు. అలాంటి పోస్టును వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావించింది.ఒకరిద్దరి పేర్లు ప్రచారంలోకి వచ్చినా లిస్టు మాత్రం ఫైనల్‌ అయిందనే అనుకున్నారు. కానీ, తొలివిడత నామినేడెట్‌ పోస్టుల జాబితాలో ఆ బోర్డు ఊసే లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో నియామకం జరిగే ఛాయలు కూడా కనిపించడం లేదు. ఇక క్యాలెండర్‌ మారితేగాని ఆ పోస్టు భర్తీ ఉండదనే తాజా సమాచారం ఆశావహుల ఆశలకు గండికొడుతోందంటున్నారు… ఇంతకీ ఆ క్రేజీ పోస్టు ఏంటి? నియామకంలో చోటుచేసుకుంటున్న ట్విస్టులేంటి?ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నామినేటెడ్‌ పోస్టుల్లోకల్లా అత్యంత ప్రధానమైనది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు. చైర్మన్‌తోపాటు దాదాపు డజను మంది సభ్యులుగా ఉండే ఈ బోర్డుకు దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాల వారే కాదు టీటీడీ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేసేందుకు తమిళ, కన్నడ నేతలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల వారూ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఏపీకి చెందిన ప్రముఖులు టీటీడీ చైర్మన్‌ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు.వీఐపీలతో సంబంధాలతోపాటు నిత్యం శ్రీవారి సేవలలో తరించే భాగ్యం కోసం టీటీడీ చైర్మన్‌, డైరెక్టర్‌గా పనిచేసేందుకు నేతలు పోటీ పడుతుంటారు. ఇంతటి పోటీ ఉన్న బోర్డు ప్రస్తుతం ఖాళీగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుంచి టీటీడీ బోర్డు నియామకంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మదిలో ఏముందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.కూటమి ప్రభుత్వం కొలువు దీరి వంద రోజులు దాటిపోయింది. మరో వారం గడిస్తే నాలుగో నెల కూడా పూర్తవుతుంది. అయినా టీటీడీ బోర్డు నియామకం జరగలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో బోర్డు నియామకం ఉండదనే టాక్‌ వినిపిస్తోంది. శ్రీవారి ప్రసాదం లడ్డూ వ్యవహారంలో ఏదో ఒకటి తేలితేగానీ టీటీడీ పదవులను భర్తీ చేయరని ప్రచారం జరుగుతోంది. జూన్‌లో ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న వెంటనే తొలుత టీటీడీ బోర్డునే భర్తీ చేస్తారని చెప్పుకున్నారు.అయితే అప్పట్లో దుర్ముహూర్తాలు ఉన్నాయని ఆగస్టుకు వాయిదా వేశారు. ఆగస్టులో రకరకాల విశ్లేషణలు, సర్వేలతో కాలం హరించుకుపోయింది. ఇక ఈ నెల ఆరంభంలో విజయవాడ వరదలతో నామినేటెడ్‌ పోస్టుల ఊసే ఎత్తలేదు. ఇక కొద్ది రోజుల క్రితం 20 నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసినా, అందులో టీటీడీ లేదు. దీనికి ప్రధాన కారణం లడ్డూ వివాదమేనని చెబుతున్నారు. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతోనే టీటీడీ బోర్డును భర్తీ చేయలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.గత బోర్డు తీసుకున్న నిర్ణయం వల్లే నెయ్యిలో నాణ్యత లేదని నిరూపించేందుకు కొత్త బోర్డును వేయలేందంటున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ బోర్డు నియమించివుంటే లడ్డూ పాపం.. కొత్త బోర్డుపై పడేదని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తాజాగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇప్పట్లో టీటీడీ బోర్డు కొలువుదీరే పరిస్థితి కనిపించడం లేదుటీటీడీ చైర్మన్‌ పదవి కోసం టీడీపీలో చాలా మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఓ మీడియా సంస్థ అధినేతకు చైర్మన్‌ పదవి ఖరారు చేశారని ప్రచారం జరిగింది. బోర్డు సభ్యులు మాత్రమే ఎంపిక చేయాల్సివుందని చెప్పారు. అయితే పార్టీ నేతలకు కాకుండా మీడియా సంస్థ అధినేతకు ఎలా ఇస్తారంటూ కొద్ది మంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీంతో పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి టీడీ జనార్దన్‌రావు పేరు తెరపైకి వచ్చింది.ఇదే సమయంలో ఓ రిటైర్డ్‌ న్యాయమూర్తి, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, సీనియర్‌ ఎమ్మెల్యే కళావెంకటరావు వంటివారి పేర్లు పరిశీలించారని అంటున్నారు. ఐతే ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నవారికే చైర్మన్‌ పదవి ఇవ్వాలని పార్టీ సీనియర్ల సూచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మీడియా సంస్థ అధినేతకు ఖాయం అనుకున్నా, పార్టీ సీనియర్ల సూచనలతో నియామక ప్రకటన ఆలస్యమైందని.. ఈ లోగా లడ్డూ వివాదంతో ఇప్పట్లో ఈ పోస్టు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.ప్రస్తుతం లడ్డూ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు జరుపుతుంది. ఈ అంశంలో తప్పు ఎక్కడ జరిగింది? బాధ్యులు ఎవరు అన్నది స్పష్టమైన తర్వాతే.. టీటీడీపై కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఉన్నట్లు జంబో పాలకవర్గం ఉండదని, బీజేపీ పెద్దలు కూడా టీటీడీని రాజకీయ పునరావస కేంద్రంగా చేయొద్దని కోరడంతో పాలకవర్గ ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.మరోవైపు లడ్డూ వ్యవహారం వెలుగుచూసిన తర్వాత టీటీడీని ధార్మిక సంఘాలకు అప్పగించాలని సాధు సంతులు కోరుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేనివారికి టీటీడీలో పదవులు కట్టబెట్టాలని హిందూ సంఘాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాలకవర్గ నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. టీటీడీ బోర్డు నియామకం సంక్రాంతి తర్వాతేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts