విజయవాడ, సెప్టెంబర్ 30,
ఓ ఎక్స్ ప్రెస్ రైలులో భారీ చోరీ జరిగింది. బాధితులు నిద్ర లేచి చూసేసరికి దుండగులు రూ.2.50 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలను అపహరించారు. కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్, రంగారావు సత్తెనపల్లిలో 'సాయిచరణ్ జ్యువెలర్స్' పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. వీరు ఆభరణాలు తయారు చేసి కర్ణాటకలోని బళ్లారిలో విక్రయిస్తుంటారు. ఇందులో భాగంగానే రంగారావు, ఆయన సోదరుడు సతీశ్‌బాబుతో కలిసి బంగారు ఆభరణాలను తీసుకుని మంగళవారం రాత్రి సత్తెనపల్లి నుంచి బళ్లారి వెళ్లారు. 3 రోజుల పాటు అక్కడే ఉండి పలువురు వ్యాపారులను సంప్రదించినా.. వారి ఆభరణాల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో శుక్రవారం రాత్రి హుబ్బళ్లి - విజయవాడ రైలులో తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణంలో నంద్యాల వరకూ మెళకువగా ఉన్నా.. రంగారావు ఆభరణాల బ్యాగును తన తల కింద పెట్టుకుని నిద్రపోయారు. రైలు దొనకొండ సమీపానికి వచ్చే ముందు మెళకువ వచ్చి చూడగా బ్యాగు మాయమైంది. దీంతో ఆందోళనకు గురైన వారు దొనకొండ రైల్వే స్టేషన్‌లో దిగిపోయారు. అక్కడ రైల్వే పోలీస్ స్టేషన్ లేకపోవడంతో కొందరు మార్కాపురం వెళ్లాలని సూచించారు. అక్కడ వారు నర్సరావుపేట వెళ్లాలని చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లారు. అక్కడి రైల్వే పోలీసులు పలు ప్రశ్నలు అడిగి చోరీ జరిగిన ప్రాంతం నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని.. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే, దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిందని తెలిసినా.. దొంగలను పట్టుకునేందుకు వెంటనే స్పందించకపోగా.. పరిధి పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.