YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరీంనగర్ కాంగ్రెస్ లో గజిబిజీ...

కరీంనగర్ కాంగ్రెస్ లో గజిబిజీ...

కరీంనగర్, సెప్టెంబర్ 30,
అధికార పార్టీ కాంగ్రెస్ కరీంనగర్ లో హస్తవ్యస్తంగా మారింది. సరైన నాయకుడు లేక, ఇన్ చార్జి కానరాక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.‌ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ప్రభుత్వ విప్ లు, ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ కరీంనగర్ లో పార్టీని నడిపే సరైన నాయకుడు లేని దుస్థితి ఏర్పడింది.‌పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్ లో ప్రతిపక్ష పాత్రనే పోషిస్తుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బిజెపి కి చెందిన ఎంపీ, బిఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే ఉండడంతో కాంగ్రెస్ కు కనీసం ఇంచార్జి లేని పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయిఅధికార పార్టీ కాంగ్రెస్ కరీంనగర్ లో సరికొత్త సమస్య ఎదుర్కొంటుంది.‌ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా దశాబ్దం నాటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లే ప్రస్తుతం నెలకొంది. గంపెడు మంది నాయకులు ఉన్నా కరీంనగర్ ను పట్టించుకునే వారు కానరాక పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది.ముందుండి పార్టీని నడిపే నాయకుడు లేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ను, లీడర్ ను అందిస్తూ వచ్చిన కరీంనగర్ లో ఇప్పుడు కార్యకర్తలు తమకు దిక్కెవరు అని ప్రశ్నించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పేరుకు అధికార పార్టే కానీ, కార్యకర్తల్లో భరోసా నింపే కార్యక్రమం ఒక్కటి కూడా లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే లోక్ సభ ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఇప్పటి వరకు నగరంలో కాంగ్రెస్ పార్టీపరంగా సందడి వాతావరణం అలుముకోకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేస్తోంది.రెండు దశాబ్దాలకు పైగా నగరానికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇద్దరు ఇప్పుడు కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్నా పార్టీ బలోపేతం పై చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.కరీంనగర్ కు చెందిన పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయి బిజీగా మారారు. గతంలో ఎంపీగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జి ఉన్నంత కాలం నగరంలో పార్టీని ఏకతాటిపై నడిపించారనే పేరుంది.ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అక్కడ ఎక్కువ కాన్సెంట్రేషన్ చేయడంతో కరీంనగర్ పై పెద్దగా శ్రద్ద చూపడం లేదనే భావన క్యాడర్ లో నెలకొంది. పొన్నం సిద్దిపేట, మరో మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో కరీంనగర్ పై దృష్టి సారించే నాథుడే లేకుండా పోయారని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నాయి.ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ లో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు ఎంపీ గా ఓటమి పాలయింది. బిఆర్ఎస్ కు చెందిన గంగుల కమలాకర్ వరుసగా నాలుగుసార్లు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీశారు.గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో నిలువడం పార్టీ నాయకత్వ వైఫల్యానికి అద్దంపడుతోంది. చుట్టుపక్కల ఎక్కడా కానరాని బీజేపీ ఒక్క కరీంనగర్ అసెంబ్లీ స్థానం పరిధిలోనే వరుసగా మూడుసార్లు రెండవ స్థానంలో నిలువడం విశేషం. 2004లో మాజీ మంత్రి ఎమ్మెస్సార్ తర్వాత 2009 నుంచి కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు పడిపోతూ వస్తోంది. ఈ కారణంగానే 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క డివిజన్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది.గత అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ చార్జిగా పురమల్ల శ్రీనివాస్ కొనసాగుతున్నారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాల్లో చుట్టపుచూపుగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. బొమ్మకల్ మాజీ సర్పంచ్ అయిన శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు తనవంతుగా హాజరు కావడమే తప్ప స్వంతంగా ఏ ఒక్క కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవని చెబుతున్నారు.అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు సైతం మీడియా ప్రకటనలు మినహాయిస్తే నగరంపై ప్రత్యేకించి దృష్టి పెట్టిన సందర్భాలు లేవని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ఇద్దరు నేతలు కనీసం సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించలేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఆయా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారిన నేపథ్యంలో పార్టీ క్యాడర్ కు, ఇన్ చార్జిలకు మధ్య అగాధం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్ నుంచి నామినేటెడ్ పదవిని దక్కించుకున్న ఏకైక నాయకుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. మూడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విస్తరించి ఉన్న సుడా చైర్మన్ పదవిని చేపట్టి సుడా కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా మారారు.కార్యాలయానికి సంబంధించి పనులే విపరీతంగా ఉండటంతో అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సుడా చైర్మన్ పదవికి న్యాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో త్వరలోనే మరొకరు నగర అధ్యక్ష బాధ్యతలు చేపడతారనే ఆలోచనతో నరేందర్ రెడ్డి పార్టీ వ్యవహారాల కంటే పాలనా వ్యవహారాలకు అధిక సమయం కేటాయిస్తూ వస్తున్నారని తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలకు అత్యవసర పరిస్థితుల్లో నగర అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఒక్కరే దిక్కు కావడంతో ఏదైనా అవసరం పడితే కార్యకర్తలు సుడా కార్యాలయానికి క్యూ కడుతున్నారు.2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోరు సాగింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా గట్టిపోటీనివ్వలేకపోయింది. రెండో స్థానంలో నిలిచిన డివిజన్లు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే ఈసారి పార్టీ అధికారంలో ఉన్నందున మేయర్ పదవి తమదేనని ధీమాతో ఉన్న కార్యకర్తలు రోజులు గడుస్తున్నా కొద్ది ఆందోళన చెందుతున్నారు.పార్టీ అధికారంలోకి రాగానే గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలందరూ వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వచ్చారు. 11 మంది కార్పొరేటర్లు, సర్పంచులు, జడ్పీటీసీలు సహా పెద్ద ఎత్తున మాజీ ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అంతకు మించి పార్టీపరంగా జరిగిన కార్యక్రమాలేవీ లేవని కార్యకర్తలు అభిప్రాయపడుతు న్నారు.పార్టీలో చేరిన నేతలు కూడా పార్టీతో సంబంధం లేనట్టుగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోవడంతో నగరంలో పార్టీ పరిస్థితి త్రిశంకుస్వర్గంలా మారింది. మరో ఆరు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గానికో... నగరానికో బలమైన నేత లేకపోవడంతో ఆ ఎన్నికలను ఎలా ఎదుర్కొగలుగుతామన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం బలమైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించి, కొత్త కమిటీలు వేసి పార్టీని గాడిలో పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Related Posts