YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం పరుగులే...

పోలవరం పరుగులే...

ఏలూరు, అక్టోబరు 3,
పోలవరం ప్రాజెక్టు పనులు 2026 మార్చికే పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు, పునరావాసం వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ. 30,436,95 కోట్లతో తాజా డీపీఆర్ ను ఆమోదించింది. దీని వల్ల ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రూ. 12,157 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజా డీపీఆర్ ఆమోదం తరువాత ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం కృషితో పోలవరానికి అడ్వాన్స్ గా నిధులిచ్చేందుకూ కేంద్రం ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి రూ. 5,500 కోట్లు, ప్రధాన డ్యాం కాలువల్లో నిర్మాణ పనులకు రూ. 1,700 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమని అధికారుల అంచనా వేశారు.ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెట్టాలి.. తొలిదశలో ఎనిమిది మండలాల పరిధిలో 172 నివాసాల్లో 38,060 మందికి పునరావాసం కల్పించాలి. ఇప్పటి వరకు 12,797 మందికి పునరావాసం కల్పించారు. ఇంకా 25,263 మందిని పునరావాస కేంద్రాల్లోకి తరలించాల్సి ఉంది. వీరికోసం 16,440 ఎకరాల భూమి సేకరించాలి. దీనికిగాను రూ. 2,435 కోట్లు అవసరం అవుతుంది. మరొకవైపు వీరందరికీ నిర్వాసిత ప్యాకేజీ కోసం రూ. 2,043.59 కోట్లు అవసరం అవుతుంది. అదేవిధంగా పునరావాస కాలనీల నిర్మాణానికి రూ. 3,314 కోట్లు కావాల్సి ఉంది. 2025 జూన్ నాటికి ఎంత వరకు చేయగలరో అంతవరకు చేయాలని కోరుతూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. తక్షణం 5,500 కోట్లు కావాలంటూ ప్రతిపాదనల్లో పేర్కొన్నారుకొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నవంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయి. కొత్త డయాఫ్రం వాల్ మట్టి సాంద్రత పెంపు.. ప్రధాన డ్యాం గ్యాప్-2లో పాత డయాఫ్రం వాల్ కు సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం దాదాపు 64వేల చదరపు మీటర్లు పని చేయాల్సి ఉంటుంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా నవంబర్ నాటికి డిజైన్లు, ఇతర అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.ప్రధాన డ్యాం మొదటి రెండు గ్యాప్ లలో మట్టి సాంద్రత పెంచే పనులు చేయాల్సి ఉంది. అక్కడ ఇసుకను నింపి వైబ్రో కాంపాక్షన్ ద్వారా అక్కడ మట్టి గట్టిదనం పెంచాల్సి ఉంది. ఇందుకు షెడ్యూలు కూడా పోలవరం అథారిటీకి అధికారులు సమర్పించారు. అనుసంధాన పనుల్లో ఎడమ టన్నెల్ హెడ్ రెగ్యులేటర్, ఎడమ టన్నెల్ లైనింగ్, కుడి టన్నెళ్లలో మట్టి తవ్వకం లైనింగ్ కూడా 2025 జూన్ నాటికి పూర్తి చేసేలా షెడ్యూల్ చేశారు. ఇంకా తొలిదశలో ఆయకట్టు నీళ్లించేలా కుడి, ఎడమ కాలువల్లో కూడా పనులు చేయాల్సి ఉంది. ప్రధాన డ్యాం, కాలువల్లో నిర్మాణ పనులకు రూ.1700 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమని అధికారులు అంచనా వేశారు.

Related Posts