YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే

మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే

విజయవాడ, అక్టోబరు 3,
ఎమ్మెల్సీ రాజీనామా వ్యవహారంలో వైసీపీ వ్యూహం ఏంటి? నాన్చుడు ధోరణితో వ్యవహరించాలని చూస్తుందా? శాసనమండలి చైర్మన్ ద్వారా ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోందా? ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలిలో టిడిపి కూటమి బలం పెరగకూడదని చూస్తోందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీకి చెందిన పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వైసీపీకి సైతం గుడ్ బై చెప్పారు. ఎప్పుడో ఆగస్టులో తమ పదవులకు రాజీనామా చేస్తే ఇప్పటివరకు అవి ఆమోదం పొందలేదు. అందులో ఇద్దరు స్వయంగా మండలి చైర్మన్ మోసేన్ రాజుకు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. వ్యక్తిగత సమస్యలతోనే తాము పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఎంతవరకు మండలి చైర్మన్ వాటిని ఆమోదించలేదు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఇలా జాప్యం జరుగుతుందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పద్మశ్రీ సోమవారం మరోసారి మండలి చైర్మన్ మోసేన్ రాజును కలిశారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. లేఖ కూడా రాశారు. అయినా సరే ఆమోదానికి నోచుకోలేదు. విశేషమేమిటంటే అదే వైసీపీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. తమ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ కు అందించారు. వెనువెంటనే ఈ రాజీనామాలు ఆమోదించారు రాజ్యసభ చైర్మన్. కానీ ఎమ్మెల్సీల విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతుండడం విశేషం. కేవలం వైసీపీకి చెందిన మండలి చైర్మన్ ఉండడం వల్లే ఇలా జాప్యం చేయగలుగుతున్నారన్న టాక్ నడుస్తోంది.ఏపీలో కూటమి భారీ మెజారిటీతో గెలిచింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమికి ఏకంగా 164 సీట్లు దక్కాయి. అటు పార్లమెంట్ స్థానాలను సైతం దాదాపు స్వీప్ చేసినంత పని చేసింది కూటమి. 25 సీట్లకు గాను 21చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీకి మైండ్ బ్లాక్ అవుతోంది. మరోవైపు ఎన్నికల అనంతరం వైసిపి నుంచి కీలక నేతలు బయటకు వస్తున్నారు. వీరిలో ఇంకా పదవీకాలం ఉన్న రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఉండడం విశేషం. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదానికి నోచుకోకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఆ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి గెలిచినంత మాత్రాన వైసీపీకి పోయిందేమీ లేదని చెప్పుకొచ్చారు. శాసనమండలిలో 38 మంది, రాజ్యసభలో 11 మంది, శాసనసభలో 11 మంది, లోక్సభలో నలుగురు.. ఇలా కలుపుకొని వెళ్తే వైసీపీకి సైతం భారీగా ప్రజా ప్రతినిధులు ఉన్నారని.. ముఖ్యంగా శాసనమండలి ద్వారా టిడిపి కూటమి ప్రభుత్వాన్ని కట్టడి చేద్దామని ఎమ్మెల్సీలకు పిలుపు ఇచ్చారు. అయితే జగన్ నుంచి ఈ తరహా హెచ్చరిక రావడంతో టీడీపీ ప్రభుత్వం పాలు కదపడం ప్రారంభించింది. నేరుగా ఎమ్మెల్సీలను చేర్చుకోవడం కంటే.. వారితో రాజీనామా చేయించి.. ఖాళీ అయిన సీట్లను టిడిపి కూటమితో భర్తీ చేయాలన్నది ప్లాన్. అందులో భాగంగానే ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కానీ ఆ రాజీనామాలను ఆమోదించకుండా శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీలను గెలుచుకోవడం వైసీపీకి జరగని పని. ఎందుకంటే ఆ పార్టీకి ఉన్న బలం కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. కూటమికి 164 సీట్లు ఉన్నాయి. వైసీపీ సభ్యుల రాజీనామాతో కూటమి ఈజీగా ఆ స్థానాలను గెలిచే ఛాన్స్ ఉంది. అందుకే కూటమి వ్యూహాత్మకంగా వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చూస్తోంది. అయితే ఇలా చేస్తున్న రాజీనామాలను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు మండలి చైర్మన్ మోసేన్ రాజును వాడుకుంటుంది. ఇలాగే ఆయన వ్యవహార శైలి నడిస్తే ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి తగిన బుద్ధి చెప్పాలని చూస్తోంది. మొత్తానికైతే వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

Related Posts