కాకినాడ, అక్టోబరు 3,
ఎన్నికల్లో త్యాగం చేశారు వర్మ. జనసేన అధినేత పవన్ కోసం తన పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకున్నారు. టిడిపి తో జనసేన పొత్తు కుదరడం, పవన్ పిఠాపురం నియోజకవర్గాన్ని కోరుకోవడం చకచకా జరిగిపోయాయి. తొలుత పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకునేందుకు వర్మ తట పటాయించారు. కానీ చంద్రబాబు చెప్పేసరికి కాదనలేకపోయారు. రాష్ట్రంలోఖాళీ అయ్యే తొలి ఎమ్మెల్సీ స్థానాన్ని వర్మతో భర్తీ చేస్తారని అప్పట్లో ప్రచారం చేశారు. ఉన్న ఒక్క మంత్రి పదవి కూడా ఆయన కోసం ఖాళీగా ఉంచినట్లు చెప్పుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు అయ్యాయి. అదే సమయంలో రాజ్యసభ పదవులకు సైతం కసరత్తు జరుగుతోంది. కానీ ఎక్కడ వర్మ పేరు ప్రస్తావనకు రావడం లేదు. దీంతో వర్మ అనుచరుల్లో ఒక రకమైన బాధ కనిపిస్తోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని తనకు శాశ్వతంగా ఉంచుకోవాలని పవన్ భావిస్తున్నారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మెగా కుటుంబానికి చెందిన వారికి సైతం పిఠాపురం పై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇక పిఠాపురం పై వర్మ ఆశలు వదులుకోవాల్సిందే.అయితే ఇంత త్యాగానికి గుర్తింపు లేకుండా పోవడంతో వర్మ సైతం లో లోపల బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అటు నియోజకవర్గంలో సైతం జన సైనికులు వర్మను పట్టించుకోవడం మానేయడంతో.. ఆయన అనుచరులు సైతం తెగ బాధపడిపోతున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు పట్టు ఎక్కువ.2014 ఎన్నికల్లో టిడిపి టికెట్ దక్కకపోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. తన శక్తి యుక్తులతో గెలిచారు కూడా. తరువాత టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఓడారు. 2024 ఎన్నికల్లో పోటీకి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో పవన్ ఎంటర్ కావడంతో పక్కకు తప్పుకున్నారు వర్మ. కానీ ఆయన త్యాగానికి ఇంతవరకు ఫలితం దక్కలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప వర్మకు పదవి కేటాయించలేదు. తాజాగా గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రానుంది. ఇది ఈజీగా గెలిచే స్థానం. కానీ వర్మ పేరు పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం.ఎన్నికల్లో 70 వేల మెజారిటీతో గెలిచారు పవన్. ఆయనను ఎలాగైనా ఓడిస్తామని వైసిపి నేతలు ప్రతిన బూనారు. కానీ వర్మ పట్టుబట్టారు. తన శక్తి యుక్తులను ప్రదర్శించారు. రికార్డు స్థాయి మెజారిటీ వచ్చేలా వ్యూహం పన్నారు. అటు పవన్ సైతం వర్మ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన గౌరవానికి తగ్గట్టు నడుచుకుంటామని హామీ ఇచ్చారు. అయితే రాజకీయంగా అనుకున్న స్థాయిలో వర్మకు గౌరవం దక్కడం లేదు. జనసైనికులు పెద్దగా విలువ ఇవ్వడం లేదు. దీంతో వర్మ అనుచరులు బాధపడుతున్నారు.ఇటీవల చంద్రబాబు నామినేటెడ్ పదవులను ప్రకటించారు. దాదాపు 20 కార్పొరేషన్లకు సంబంధించిన నియామకాలు చేశారు. కానీ వర్మ పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఎమ్మెల్సీవిషయంలో సైతం స్పష్టత ఇవ్వడం లేదు. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానంలోనైనా వర్మ కు ఛాన్స్ ఇస్తానన్న క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో వర్మలో ఒక రకమైన బాధ కనిపిస్తోంది. మరి ఇంత అన్యాయమా అని ఆయన ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది.