YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్

రైతు భరోసా అందకుండానే ముగిసిన సీజన్

నిజామాబాద్, అక్టోబరు 5,
రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయిచ్చింది. వానాకాలం వ్యవసాయ సీజన్ ముగిసిపోయింది. అంటే సాగు భూముల్లో పంటల సాగు ముగిసింది. కానీ, ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన పంటల పెట్టుబడి సాయం రైతు భరోసా అందనేలేదు. అసలు జిల్లాల వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నుంచి రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆదేశాలు అందలేదు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో 2014 లో తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ కు ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు సీజన్ల ( ఖరీఫ్, రబీ)కు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరును అందించింది. నిరాటంకంగా కొనసాగింది. 2023 చివరన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేప్పటి 10 నెలలు గడిచిపోయినా.. ఇంతవరకూ నయా పైస రైతులకు పెట్టుబడి సాయంగా అందించలేదు. రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చి, రూ.5వేల స్థానే ఎకరాకు రూ.7500 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.15000 అందిస్తామని ఎన్నికల హామీల్లో పేర్కొంది. రైతు రుణ మాఫీకే నిధులన్నీ హరించుకుపోవడంతో రైతు భరోసా డబ్బులు వేయేలేదేమోన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణ మాఫీలో తలమునకలైన బ్యాంకర్లు, చివరకు పంట రుణాలనూ సకాలంలో ఇవ్వలేక పోయారు. పంట రుణాలు అందక, ప్రభుత్వం నుంచి పంటల పెట్టుబడి కోసం అందాల్సిన రైతు భరోసా సాయం అందక చివరకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు అప్పులు చేసి పంటలు సాగుచేసుకున్నారని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కనీసం రైతు భరోసాకు సంబంధించిన సమాచారం కూడా లేదంటున్నారు. ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ పంటల సర్వే లో నిమగ్నమై ఉంది. పంటల సాగు వివరాలతో డిజిటల్ సర్వే పనులు నడుస్తున్నాయి. ఈ వివరాలన్నీ సేకరించాక ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొంటున్నారు. రైతు భరోసాకు ఎలాంటి రైతులు అర్హులు అన్న అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం మంత్రుల ఉప సంఘాన్ని కూడా నియమించింది. ఈ కమిటీ నియామకైన రెండు వారాలకే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని, ఆ నివేదిక అందాక అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది జరిగి రెండు నెలల గడువు ముగిసినా.. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ లోగా వ్యవసాయ సీజన్ ముగిసింది పోయింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 10.50 లక్షల పైచిలుకు ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఇందులో 5.40 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైతే, 5.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గత ప్రభుత్వ హయాంలోని గణాంకాల మేరకు 5.42 లక్షల పైచిలుకు రైతులకు పంటల పెట్టుబడి సాయం అందేది. అప్పటి లెక్కల ప్రకారం జిల్లాలో రెండు సీజన్లకు కలిపి రమారమి రూ.1250 కోట్లు రైతు బంధు కింద అందేది. ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10వేలు అందిస్తే అంత మొత్తం ఖర్చయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వం ఎకరాకు రూ.7500 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో రెండు సీజన్లకు ఎకరాకు రూ.15000 ఖర్చు చేయాల్సి వచ్చేది. అంటే, రూ.1875 కోట్లు రైతు భరోసా సాయం అందాల్సి ఉండింది. కానీ, సీజన్ ముగిసిపోయినా ఎలాంటి సాయం అందకపోవడంతో ఆ మేర జిల్లా రైతాంగం నష్టపోయినట్టేనని అభిప్రాయపడుతున్నారు.

Related Posts