అందితే జుట్టు. లేకపోతే కాళ్లు పట్టుకుని అందలాన్ని కాపాడుకోవడం ఆధునిక రాజకీయాల్లో సర్వసాధారణ విషయం. మోడీ , అమిత్ షాలు ఇందుకు అతీతులేమీ కాదు.. ఇప్పుడు తమ ప్రయోజనాలే పార్టీ ప్రయోజనాలుగా మోడీ, షాలు అగ్రనేత అద్వానీని మభ్యపెట్టేందుకు చేస్తున్న యత్నాలను ఆయన ఎంతవరకూ సమ్మతిస్తారు? సానుకూలంగా స్పందిస్తారా? అల్టిమేట్ గా పార్టీ ప్రయోజనాల కోసం మోడీ, అమిత్ షా ల ను క్షమించేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిత్రపక్షాలను చాలారాష్ట్రాల్లో తొక్కిపారేసిన ఘనత వీరిది. సొంత పార్టీలోనూ అసమ్మతి స్వరాలను అణగదొక్కేశారు. అద్వానీ వంటి నేతకూ అడ్రస్ గల్లంతు చేసేంతవరకూ వెళ్లిపోయారు. పరిస్థితులు ప్రతికూలంగా కనిపించడంతో కాళ్లబేరానికి దిగుతున్నారు. ఈ ద్వయం చేసిన అవమానాలను పెద్దనాయకులు దిగమింగుకున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం సొంత ప్రయోజనాలను పక్కన పెట్టేశారు. భారతీయ జనతాపార్టీ కురుక్షేత్రంలో క్రుష్ణుడూ, అర్జునుడూ అద్వానీయే. అధికార పీఠం మాత్రం ధర్మరాజు వంటి వాజపేయిది. జనసంఘ్ శకలాల నుంచి 1980లో బీజేపీకి ఊపిరిపోశారు వాజపేయి, అద్వానీ. పార్టీని క్రమేపీ నిర్మించుకుంటూ అధికారానికి తెచ్చారు. ఇందులో వాజపేయి కంటే అద్వానీ పాత్రే ఎక్కువ. తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం పార్టీ సిద్దాంతాల సీరియస్ నెస్ ను పక్కనపెట్టే తత్వం వాజపేయిది. పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆమోదముద్ర వేయించి అధికారానికి తెచ్చింది అద్వానీ. రామజన్మభూమి ఉద్యమం, రథయాత్ర వంటివి సంప్రదాయక ఓటు బ్యాంకును సాధించిపెట్టాయి. ఇతర పక్షాల మైనారిటీ ఆకర్షక విధానాలకు ప్రతిగా హిందూ ఓటు సంఘటిత మయ్యేందుకు అద్వానీ చేసిన ప్రచారం ఉపయోగపడింది. 1986 నుంచి 91 వరకూ 93 నుంచి 98 వరకూ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని బలోపేతం చేశారు. మూలమూలకూ విస్తరించారు. తన సారథ్యంలోనే బీజేపీకి అధికారం దక్కింది. కానీ ఇతర పక్షాల మద్దతు కూడగట్టడానికి ఆమోదయోగ్యుడైన వాజపేయిని ప్రధానిగా తానే ప్రతిపాదించారు. వ్యక్తిగత స్వార్థాన్ని విస్మరించి తన కంటే అర్హుడైన వ్యక్తి వాజపేయి అని అద్వానీ భావించారు. దాంతో అటల్ మూడుసార్లు ప్రధాని పీఠం అధిష్టించగలిగారు. అద్వానీ సెకండ్ లెఫ్టినెంట్ గానే మిగిలిపోయారు.2002లో గుజరాత్ మత ఘర్షణల్లో వెయ్యిమందికి పైగా చనిపోయారు. దేశం అట్టుడికిపోయింది. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతింది. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ అప్పుడప్పుడే రాజకీయంగా పట్టు సాధిస్తున్నాడు. పార్టీకి, దేశానికి అతనివల్ల చెడ్డపేరువస్తోందని బీజేపీలోని ప్రముఖులు చాలా మంది భావించారు. ఇక విపక్షాల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒకటయ్యేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉద్యమాలు సాగాయి. మీడియా గొంతెత్తింది. ఈ సంఘర్షణను నివారించాలంటే రాజధర్మం పేరిట మోడీని తొలగించాలని వాజపేయి భావించారు. అద్వానీ పట్టుపట్టి అడ్డుపడ్డారు. మోడీ సామర్ధ్యాన్ని వివరించి సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. తాను బాద్యత తీసుకుంటానని సర్దిచెప్పారు. ముఖ్యమంత్రి స్థానాన్ని కాపాడారు. ఆ తర్వాత కాలంలోనే వ్యూహాత్మకంగా మోడీ ఎదిగిపోయారు. చంద్రబాబు నాయుడి వంటి నాయకులు ఎంతగా పట్టుబట్టినా కేవలం అద్వానీ కారణంగానే మోడీ బతికిబట్టకట్టగలిగారు . అందులోనూ లౌకిక ప్రతిష్ట కోసం పార్టీ ప్రయోజనాలను త్యాగం చేసేందుకు సిద్దపడే వాజపేయి వంటివారిని సైతం సముదాయించగలిగారు అద్వానీ. ఇది అప్పట్లో పార్టీలోనూ, మద్దతుగా నిలిచే మిత్రుల్లోనూ చాలా చర్చకు దారి తీసింది. అయినప్పటికీ ద్రుఢంగా , రక్షణకవచంగా నిలిచారు అద్వానీ. నరేంద్రమోడీలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనకు ఎప్పటికప్పుడు మద్దతునిస్తూ వచ్చారు. మొగ్గలోనే తుంచేసి ఉంటే ఆయన ఈరోజున ప్రధానిగా ఎన్నికై ఉండేవారే కాదు. అసలు బీజేపీ 2013లో అతనిని ప్రధాని అభ్యర్థిగా గుర్తించే అవకాశమే ఉండేది కాదు.రథ యాత్రల సందర్బంగా మోడీ చురుకైన పాత్ర పోషిస్తూ అద్వానీకి ఆప్తుడయ్యారు. శిష్యునిగా స్థానం సంపాదించగలిగారు. అప్పటికే అద్వానీ బీజేపీ అధ్యక్షునిగా ఉండటంతో సన్నిహితంగా మెసలే మోడీకి కూడా పార్టీలో పట్టు చిక్కింది. ప్రధాన కార్యదర్శి సహా వివిద పదవులు దక్కాయి. ఇదంతా మోడీ,అద్వానీల మధ్య అనుబంధానికి సంబంధించిన ఘట్టం. వాజపేయి అనంతర కాలంలో 2009లో అద్వానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దాంతో అగ్రెసివ్ హిందూయిజం అనుసరించే మోడీని 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంచుకుంది. తనను పక్కనపెట్టి తాను అధ్యక్షునిగా ఉన్న సమయంలో 1987లో ఒక సాధారణ కార్యకర్తగా బీజేపీలో ప్రవేశించిన మోడీ శకం మొదలవుతోందని తెలిసినా అద్వానీ అవమానాన్ని దిగమింగుకున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. పార్టీకి, దేశానికి అందించిన సేవలకు గాను కనీసం రాష్ట్రపతి పదవితో సముచిత గౌరవం లభిస్తుందని అందరూ భావించారు. కానీ మోడీ, అమిత్ షాలు తమ చెప్పుచేతల్లోని వ్యక్తే అక్కడ ఉండాలని భావించారు. పార్టీలో పట్టు ఉన్న అద్వానీ రాష్ట్రపతి అయితే ప్రధానిపై పరోక్షపెత్తనం చేస్తారని భావించి గండి కొట్టారు. దాంతో రాజకీయ జీవితం నుంచి నిష్క్రమించాలని అద్వానీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారు . ఇష్టారాజ్యంగా చెలరేగి పోతున్న మోడీ, అమిత్ షా లకు ఇప్పుడిప్పుడే కష్టాలు మొదలయ్యాయి. దీంతో మళ్లీ సీనియర్ మోస్టు నాయకులైన అద్వానీ, మురళీ మనోహర్ జోషిల వంటివారిని కాకా పట్టాలని చూస్తున్నారు. 2019లో తిరిగి లోక్ సభకు పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా పార్టీకి, దేశానికి సానుకూల సంకేతాలు పంపాలని భావిస్తున్నారు. అలసిపోయిన కురువ్రుద్ధుని వంటి అద్వానీ శిష్యుని విన్నపాన్ని మన్నిస్తారా? పార్టీ ప్రయోజనాల కోసం అవమానాలను అణిచిపెట్టుకుంటారా? అన్నది కాలమే తేల్చాలి.