పీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు నాయకులు తమ రాజకీయ భవిష్యత్ కోసం కొత్తదారులు తొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార టీడీపీకి భారీ షాక్ ఇచ్చేందుకు ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ, ఇతర ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పార్టీలో నెలకొన్న విభేదాలు ఒక కారణంగా కాగా.. వ్యక్తిగత రాజకీయ భవిష్యత్ మరోకారణమనే టాక్ వినిపిస్తోంది.ఉత్తరాంధ్రకు చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఏర్పడిన విభేదాల కారణంగా పార్టీ మారుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీ నుంచి పోటీచేసి, మంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గంటా టీడీపీలో ఉండగా ఇక ఇక్కడ తనకు అవకాశం రాదనే ఉద్దేశంతోనే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి ఆయన రాజకీయ భవిష్యత్ కోసం చకచకా పార్టీలు మారతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు పీఆర్పీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం టీడీపీలో ఎంపీ అయ్యారు. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మళ్లీ ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నట్లు తెలుస్తోంది.మ్యాటర్ ఏంటంటే గతంలో ప్రజారాజ్యం నుంచి భీమిలిలో ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నుంచే ఎమ్మెల్యేగా గెలవాలని చూస్తున్నారు. అయితే అక్కడ పాగా వేసిన మంత్రి గంటా అవంతి ప్రయత్నాలు అడ్డుకుంటున్నారు. అవంతి అనకాపల్లి, చోడవరంలో ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉండడంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల అవంతి ప్రయత్నాలు సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే ఆయన భీమిలిపై కన్నేశారు. ఇక్కడ గంటా ఆయన ప్రయత్నాలకు బ్రేక్ వేస్తుండడంతో ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. విశాఖపట్నం భూ కుంభకోణానికి సంబంధించి సిట్ దర్యాప్తులో తన పేరు బహిర్గతం చేస్తే తాను కూడా పార్టీ మారటానికి ఒక ఎమ్మెల్యేసిద్ధమైనట్లు సమాచారం. దీంతో పాటు రాయలసీమకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఆయన కూడా పార్టీ మారటానికే రెడీ అవుతున్నట్లు తెలిసింది. మరో ఎమ్మెల్యే కూడా జనసేన వైపు చూస్తున్నారు. కొంత మంది వైసీపీ వైపు, మరికొంత మంది జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీ మారితే కొంతమేరకు నష్టం జరుగుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.