కాకినాడ
అన్నదాతగా డొక్కా సీతమ్మ ప్రపంచానికి ఆదర్శనీయురాలు అని శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ అన్నారు. కాకినాడ సత్కళా వాహినిలో ఆంద్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ 193వ జయంతి వేడుకలను ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డా.అద్దంకి రాజా ఆధ్వర్యంలో వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ వ్వవస్ధాపకుడు డా.నందిక మహాలక్ష్మి కుమార్ అధ్యక్షతన నిర్వహించారు . ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ వంటి అన్నదాత మరలా జన్మించరన్నారు.ఆమె మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం అని కొనియాడారు. బ్రిటన్ రాజు తన పట్టాబిషేకానికి డొక్కా సీతమ్మ చిత్ర పఠాన్ని రప్పించుకోవడం ఆంధ్రులుగా మనకు గర్వకారణం అన్నారు.
అందుకే ఆమె పేరును రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సీతమ్మ పేరు పెట్టినట్లు వెళ్ళడించారు. డొక్కా సీతమ్మ ఐదవ తరం వారసుడు డొక్కా భీమ వెంకటసత్య కామేశ్వరరావు మాట్లాడుతూ సీతమ్మ గారి వారసుడుగా తానెంతో గర్వపడుతున్నానన్నారు. సీతమ్మ పేరు నిలపడానికి తనవంతు కృషి చేస్తున్నట్లు వివరించారు.ఎ.పి.ఎస్ పి.ఎఫ్ కమెండర్ డా.కొండా నరసింహ రావు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ నేటి తరానికి ఆదర్శప్రాయురాలన్నారు. ఆకలితో అలమటించేవారికి అన్నం పెట్టాలనే స్పృహ కలగడం నిజంగా ఎంతో గొప్పవిషయమన్నారు. అది మహాత్ములకే సాధ్యం అవుతోంది అన్నారు. కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డా.సంకురాత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ ప్రాతఃస్మరణీయురాలన్నారు. అన్నార్తుల ఆకలి తీర్చిన సీతమ్మ స్త్రీ జాతిలో ఆణిముత్యం అని కొనియాడారు. అనంతరం 20మంది ప్రముఖులకు డొక్కా సీతమ్మ స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు.