విజయవాడ, అక్టోబరు 8,
ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిళ స్పీడ్ పెంచారా.. ఒక వైపు కూటమికి, మరోవైపు వైసీపీకి తన కామెంట్స్ తో షాకిస్తూ.. రాజకీయంగా బలోపేతం కానున్నారా.. పక్కా వ్యూహంతో ఏపీలో కాంగ్రెస్ ను బలమైన పార్టీగా నిలపాలన్న తన లక్ష్యం వైపు షర్మిళ సాగుతున్నట్లు ఏపీ కాంగ్రెస్ ముఖచిత్రం కనిపిస్తోంది.మొన్నటి వరకు తన అన్న మాజీ సీఎం జగన్ లక్ష్యంగా.. విమర్శల వర్షం కురిపించిన షర్మిళ.. తన గురి కూటమి వైపుకు తిప్పినట్లు ఉందని తాజాగా ఆమె విమర్శలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తాను ముందుంటానంటూ కామెంట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి షర్మిళ ఘాటుగానే స్పందించారు.అధికారం లేని సమయంలో ఒక వేషబాష, అధికారం వచ్చాక మరో రకం వేషబాష కరెక్ట్ కాదంటూ షర్మిళ అన్నారు. అంతేకాకుండా ఒకే మతానికి మీరు మద్దతిస్తే.. మిగిలిన మతాలు ఏమి కావాలని ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు మాత్రం ఏకంగా సీఎం చంద్రబాబుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి షర్మిళ కౌంటర్ గట్టిగానే ఇచ్చారన్నది టాక్.ఆ లేఖను ఇప్పుడు షర్మిళ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి మరీ.. మీరు ఢిల్లీ వెళుతున్నారు.. కేంద్ర పెద్దలను విశాఖ ప్రైవేటీకరణ పై నిలదీయండి. లేకుంటే మద్దతు ఉపసంహరణ అంటూ డిమాండ్ పెట్టండి. ఆంధ్రుల హక్కు ముఖ్యమా… లేక బీజేపీతో పొట్టు ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. అంతటితో ఆగక విశాఖ ఉక్కు ముఖ్యమా ? లేదా ఎన్డిఏ లో పదవులు ముఖ్యమా ? మాట మీద నిలబడే సిఎం అవుతారా ? లేక మోసగాడు గా ముద్ర వేసుకుంటారా ? తేల్చుకోండని ట్వీట్ చేశారు.కార్మికులకు విజయదశమి కానుకగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేస్తున్నట్లు, 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తున్నట్లు, భూములు కోల్పోయిన 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు, 23 వేల ఎకరాల్లో ఒక్క ఎకరా కూడా అమ్మేది లేనట్లు, అధికారిక ప్రకటన చేయించాలని, లేకుంటే ఎన్డిఏ కూటమి నుంచి వైదొలగాలని సీఎం చంద్రబాబుకు
కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.మరి షర్మిళ చేసిన ఈ ట్వీట్ కి టీడీపీ నుండి ఎటువంటి సమాధానం వస్తుందో కానీ.. ఇటీవల షర్మిళ తనదైన శైలిలో ఛాన్స్ దొరికినప్పుడల్లా కూటమి, వైసీపీ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు.