ఆనం రామనారాయణరెడ్డి…కాంగ్రెస్ లో సీనియర్ నేతగా….ఆర్థిక శాఖ మంత్రిగా విశేష అనుభవం ఉన్న వ్యక్తి. అయితే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగడంపై సస్పెన్స్ నడుస్తూనే ఉంది. తాజాగా నెల్లూరులో జరిగిన నవనిర్మాణ దీక్ష, మహా సంకల్ప సభకు ఆనం రామనారాయణరెడ్డి డుమ్మా కొట్టారు.ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జిల్లా పర్యటనకు వస్తున్నారంటే సహజంగా అందరూ హాజరవుతారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు హాజరయి ముఖ్యమంత్రికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తారు. కాని ఆనం మాత్రం దూరంగా ఉన్నారు. ఆనం వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్ వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కార్యక్రమం దాదాపు పదిహేను రోజుల క్రితమే ఖరారయింది. ఆ మేరకు ఆనం తన హైదరాబాద్ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఈ సభకు స్వయానా ముఖ్యమంత్రి హాజరయినా ఆనం హాజరు కాకపోవడంపై చర్చ జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో పట్టున్న కుటుంబంగా పేరున్న ఆనం రామనారాయణరెడ్డి ఎందుకు గైర్హాజరయ్యారు. టీడీపీలో ఉండటం ఇష్టం లేకనా? ఇతర పార్టీలవైపు ఆయన మొగ్గు చూపుతున్నారా? ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.ఆనం కుటుంబం గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉంది. తాము కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా తమను పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఆనం కుటుంబం ఉంది. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఆనం రామనారాయణరెడ్డి ఉన్నప్పటికీ అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన కన్నబాబుకు మంత్రి సోమిరెడ్డి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.కొద్ది రోజుల నుంచి ఆనం కుటుంబం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతుందన్న ప్రచారం జరగుతుంది. ఆ ప్రచారం జరుగుతుండగానే ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ మినీ మహానాడుకు హాజరయ్యారు. అక్కడ కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. విజయవాడలో జరిగిన మహానాడుకు గైర్హాజరయిన ఆనం తమ పరిస్థితి ఏంటో ముఖ్యమంత్రి వద్దనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆనంకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ దొరకక పోవడంతో కొంత కినుకు వహించారు. తాజాగా నెల్లూరులో జరిగిన మహా సంకల్ప సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయినా ఆనం కన్పించకపోవడంతో తెలుగుదేశం పార్టీలోనే గుసగుసలు విన్పిస్తున్నాయి. మరి ఆనం నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.