- అన్ని సమస్యలూ ప్రధానికి వివరిస్తా..
- పొత్తుపై పెదవి విప్పిన పవన్..
- వాళ్లకు ఓట్లడికే హక్కు లేదు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంత పర్యటనలో ఆసక్తిక సన్నివేశం చోటుచేసుకుంది. దివంగత నేత పరిటాల రవికి-పవన్‌కు మధ్య గొడవలు జరిగాయని, ఈ నేపథ్యంలో రవి.. పవన్‌కు గుండుకొట్టించారని పెద్దఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అనంత పర్యటనలో పవన్ కల్యాణ్ ఏకంగా పరిటాల ఇంటికి పోవడం ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. పవన్‌ను మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఇంటికెళ్లిన కొద్దిసేపటికి పవన్ అక్కడ బ్రేక్ పాస్ట్ చేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల గురించి సుమారు అరగంటపాటు సునీత-పవన్-శ్రీరామ్ మధ్య చర్చజరిగింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.
"అనంత కరువుపై జిల్లా నేతలందర్నీ కలుపుకుని సయోధ్యతో ఏమేం చేస్తే బాగుంటుంది అని మంత్రితో చర్చించడానికి ఇక్కడికి వచ్చాను. త్వరలోనే ఈ కరువు విషయాన్ని ప్రధాని నరేంద్రమోదికి నివేదిక రూపంలో తెలియజేసి కరువును పారద్రోలేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరతాను" అని పవన్ స్పష్టం చేశారు.
టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందా? అన్న మీడియా ప్రశ్నకు పవన్ స్పందించారు. పార్టీ ఎంత వరకు వెళుతుంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని తెలుసుకుని ప్రజాబీష్టం మేరకే ముందడుగు వేస్తాను. వ్యక్తిగతంగా అందరి మీద గౌరవం ఉంది. నాకు ఎవరితోనూ గొడవల్లేవ్. నాకు నిజంగానే ప్రజాబీష్టం మేరకే ముందకెళతాను. ఎన్నికల సమయంలో పొత్తులు గురించి మాట్లాడుతాను" అని ఆయన తేల్చి చెప్పారు.
హామీలు అమలు చేసిన, చేసే పార్టీలకే తన మద్దతు పూర్తిగా ఉంటుందని పవన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పార్టీలు ఇచ్చిన హామీలు కొన్ని సాధ్యడపతాయి..మరికొన్ని సాధ్యపడవు. సాధ్యపడని హామీల గురించి వాటిని ఏ పరిస్థితుల్లో సాధ్యం చేయలేకపోతున్నామన్నది స్పష్టత ఇవ్వాలి. ఉదాహరణకు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దీనికి సంబంధించిన సరైన అకౌంటబిలిటీ అనేది ఇవ్వకపోతే రేపొద్దున ఓట్లు అడిగే హక్కు ఉండదు" అని ఆయన చెప్పుకొచ్చారు.
పరిటాల రవితో గొడవలున్నాయని కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై అటు పరిటాల కుటుంబీకులు, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చినప్పటికీ జనాలు మాత్రం పుకార్లకు మాత్రం తెరపడలేదు. దీంతో తాజాగా పవన్ మరసారి స్పందించారు. అనేక విమర్శలకు, ఆరోపణలకు ఈ ఒక్క భేటీతో పవన్ చెక్ పెట్టినట్లైంది. మాకు ఎలాంటి గొడవల్లేవ్ అని పరిటాల సునీత, పవన్ కల్యాణ్ నవ్వుతూ మీడియాకు చెప్పారు. అనంత సమస్యల్ని అర్థం చేసుకోవడానికే పరిటాల కుటుంబాన్ని కలిశాను"అని స్పష్టతనిచ్చారు.
"హైకోర్టు, రైల్వేజోన్‌తో పాటు మిగతా అన్ని సమస్యలనూ నివేదిక రూపంలో ప్రధాని మంత్రి దృష్టికి తీసుకెళతాను. నివేదికలో ముఖ్యంగా రాయలసీమ సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. అమరావతి అభివృద్ధిలో మాకు సంబంధం లేకుండా ఉంది అనే ఆలోచన రాయలసీమ వాసుల్లో ఉంది.. తెలంగాణలో మాదిరిగా భావోద్వేగాలు రాకుండా ఈ సమస్యను అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రతీ నేత, రాజకీయపార్టీలపైన ఉంది" అని జనసేనాని చెప్పారు.