విజయవాడ, అక్టోబరు 9,
ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచిందా? వైసీపీ లేని లోటును భర్తీ చేసే పనిలో పడిందా? తిరుమల లడ్డూ వ్యవహారం తర్వాత ఫ్యాన్ పార్టీ డౌన్ ఫాల్ అయ్యిందా?లడ్డూ వ్యవహారం తర్వాత కొందరు వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.తిరుమల లడ్డూ వ్యవహారంపై గత వైసీపీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. దాని నుంచి తప్పుకునేందుకు కుంటుసాకులు వెతుకుతోంది. ఒకప్పుడు ఆ పార్టీ నేతలు సీబీఐ విచారణ కావాలంటూ గొంతెత్తారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పెషల్ సిట్ వేయడంతో ఆ పార్టీ నేతలకు నోటి వెంట మాట రాలేదు.సింపుల్‌గా చెప్పాలంటే లడ్డూ వ్యవహారంపై తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ పార్టీ అధినేత జగన్. సిట్ లేదు.. బిట్టు అవసరం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. లడ్డూ వ్యవహారంపై వైసీపీ నేతలు ఆలోచన పడ్డారు. దీనికితోడు అధినేత ప్రజలకు దూరంగా తాడేపల్లి టు యలహంక ప్యాలెస్‌కు చక్కర్లు కొట్టడంతో ఆ పార్టీ పనైపోయిందనే వాదన క్రమంగా బలపడుతోంది.ఫ్యాన్ పార్టీకి చెందిన నేతలు టీడీపీ కంటే జనసేనలోకి వెళ్లాలని ఆలోచన చేశారు. లడ్డూ వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్షకు దిగడంతో ఆ తర్వాత సనాతన ధర్మం కాన్సెప్ట్ వెలికి తీయడంతో ఆ పార్టీకి లైఫ్ లేదన్నది కొందరి నేతల అంచనా. ఈ సమయంలో కాంగ్రెస్ ఒక్కటే మార్గమని భావిస్తున్నారు.ఏపీలో ప్రతీ విషయంపై వైఎస్ షర్మిల తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల తరపున పోరాడుతూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు. వైసీపీ నేతల చూపు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌పై పడింది. జగన్ కంటే షర్మిల బెటరన్న అంచనాకు వచ్చారు. దీనికితోడు దేశంలో క్రమంగా కాంగ్రెస్ వైపు పవనాలు వీస్తున్నాయి. మోదీ పాలనను గమనించిన ప్రజలు, ఆ పార్టీకి లైఫ్ లేదన్నది కొందరి నేతల ఆలోచన.త్వరలో ఢిల్లీ, మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు ఉంటాయని అంటున్నారు. చాలామంది వైసీపీ నేతలు షర్మిలతో మంతనాలు సాగిస్తున్నారు. తెలంగాణ మాదిరిగానే ఏపీలో హస్తం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా త్వరలోనే కాంగ్రెస్‌లోని వలసలు ఉంటాయని కొందరు నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.వాస్తవానికి.. అధికారంలో ఉన్న పార్టీలోకి వేరే పార్టీల నేతలు జంప్ కావడం సర్వసాధారణం. అయితే, మొన్నటి వరకు దాదాపు యుద్దమే చేసిన నేతలు, కార్యకర్తలకు అధికార పార్టీలోకి వెళ్లడానికి ముఖం చెల్లడం లేదని టాక్. వైసీపీపై ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరగడం. పార్టీలో తగిన క్రమశిక్షణ లోపించడం.. పార్టీకి నష్టం కలిగించిన నేతలనే మళ్లీ రంగంలోకి దింపడం వంటివి వైసీపీలో కొందరికి ఇబ్బందిగా మారిందట. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో ఉండటం కంటే.. దేశంలో మళ్లీ పుంజుకుంటున్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌లోకి వెళ్తే.. తగిన ప్రాధాన్యం దక్కుతుందనే ఆలోచనలో నేతలు ఉన్నారట. ఈ మేరకు షర్మిలాను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరి ఆ నేతలు ఎప్పుడు ఎలా ఝలక్ ఇస్తారో చూడాలి.