విజయవాడ, అక్టోబరు 9,
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ రంగానికి కూటమి ప్రభుత్వంలో కూడా ఒడిదుడుకులు తప్పడం లేదు. రాజధాని నిర్మాణంపై జరిగిన రాద్ధాంతం ఏపీ రియల్ ఎస్టేట్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచినా ఇంకా మార్కెట్‌పై నమ్మకం రావట్లేదు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందోననే ఆందోళన నిర్మాణ రంగాన్ని వేధిస్తోంది.ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ రంగం 2020 నుంచి తీవ్ర సంక్షోభాన్ని చవి చూస్తోంది. 2019లో ఇసుక తవ్వకాలపై నిషేధంతో మొదలైన ప్రతిష్టంభన మూడు రాజధానుల ప్రకటన తర్వాత నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.క్రమబద్దమైన అభివృద్ధి, స్థలాల కొరత కారణంగా చిన్న పట్టణాలు మొదలుకుని, పది లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాలు, పదిలక్షల జనాభాకు పైబడిన పట్టణాల్లో సహజమైన పురోగతి ఉంది. విశాఖపట్నం వంటి నగరాల్లో పట్టణీకరణ నేపథ్యంలో రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఓ మాదిరిగానే ఉంది.అమరావతి నిర్మాణ పనులతో దాదాపు రూ.10వేల కోట్ల రుపాయల విలువైన నిర్మాణాలు ఐదేళ్లుగా వృధాగా మారాయి. ఈ నష్టం అమరావతితో పాటు విజయవాడ-గుంటూరు నగరాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. పెద్ద సంస్థలు పనులు ఆపేసి కూర్చుంటే చిన్నాచితక బిల్డర్లు వడ్డీల భారాన్ని మోయలేక పనులు పూర్తి చేసినా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని నగరాన్ని విశాఖపట్నానికి మారుస్తాననే జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం విజయవాడ-గుంటూరు నగరాల మధ్య పట్టణీకరణను తీవ్రంగా ప్రభావితం చేసింది. జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే తాడేపల్లి మండలం పరిధిలోనే పెద్ద ప్రాజెక్టులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. 2019కు ముందు ఆ ప్రాంతానికి భవిష్యత్తు భారీగా ఉంటుందనే అంచనాతో నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కోట్ల రుపాయలు అడ్వాన్సులు చెల్లించి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు.2019లో వైసీపీ అధికారంలోకి రాగానే తన పంట పండినట్టే అనుకున్నాడు. అనూహ్యంగా అమరావతి పనులు నిలిపేసి చలో వైజాగ్ అనడంతో ఆ ఎమ్మెల్యే నష్టపోవాల్సి వచ్చింది. ప్రాజెక్టు ముందుకు కదలకపోవడంతో రైతులకు చెల్లించిన అడ్వాన్సులు వదిలేసుకున్నారు. విజయవాడకు దక్షిణం వైపు గుంటూరు వరకు నగరం భారీగా విస్తరిస్తుందని అంచనాలతో నిర్మాణాలు ప్రారంభించిన వారంతా కుదేలైపోయారు.ఇక విజయవాడ నగరంలో చిన్నాచితకా బిల్డర్లు మూడునాలుగు కోట్లలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు అవి తిరిగి రాక మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుందో తెలీక దిక్కులు చూస్తున్నారు.ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వీడటం లేదు. ప్రభుత్వం ఉచిత ఇసుక అంటూ హడావుడి చేసినా అసలు మార్కెట్‌లో ఇసుక దొరక్క పోవడంతో లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ఇసుక విధానంలో లోపాలను సరి చేయకుండా, మార్కెట్ దోపిడీని కట్టడి చేయకుండా, రాజకీయ జోక్యాన్ని నిరోధించకపోవడంతో ఇసుక కొరత ఏర్పడింది. దీనికి తోడు ఇటీవల వరదలు రావడంతో ఇసుక తవ్వకాలకు అవకాశం లేకుండా పోయింది. మరికొన్ని రోజుల పాటు నదుల్లో ఇసుకను తవ్వేందుకు వీలు లేకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి.
ఏపీలో భవన నిర్మాణాన్ని మించి ఉపాధిని కల్పించే రంగం మరొకటి లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 14లక్షల మంది ఇసుక-నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ఆరోపించింది. ఆ లెక్కలే ప్రాతిపదికగా తీసుకున్నా ఇప్పటికీ అదే సమస్యలు నిర్మాణ రంగాన్ని వెంటాడుతున్నాయి. ట్రాక్టర్ ఇసుక పదివేలకు కూడా దొరకడం లేదు. ఫుల్ లోడ్ లారీ అయితే దళారులకు తప్ప, సామాన్యులకు దక్కే పరిస్థితులు లేవు. ఫలితంగా గత ప్రభుత్వంలో ఉన్న ఇసుక కొరతే కూటమి ప్రభుత్వంలో కూడా నెలకొంది.రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో నెలకొన్న అపనమ్మకం, రాజధాని విషయంలో ఖచ్చితమైన భరోసా, అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు, రాజధాని భౌగోళిక హద్దుల నిర్దారణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భరోసా లేకపోవడమే మార్కెట్ అనిశ్చితికి కారణంగా కనిపిస్తోంది. ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన నేపథ్యంలో అమరావతి నిర్మాణాన్ని అధికారికంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వాలు మారినపుడల్లా ప్రాధాన్యతలు మారిపోతాయనే ఆందోళన ఇప్పటికీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను పట్టి పీడిస్తోంది. ఈ కారణంగానే మార్కెట్‌లో స్తభ్దత వీడటం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైతేనే రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశాలున్నాయి.
రింగ్ రోడ్డు ప్రాజెక్టుతో భూములకు రెక్కలు
అమరావతి అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు.. ఫైనల్ ఎలైన్‌మెంట్, డీపీఆర్, భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఇదే సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 2018 లోనే ఈ ప్రాజెక్టు కోసం అడుగులు పడినా.. 2019లో ప్రభుత్వం మారడంతో.. ఆగిపోయింది.2024లో చంద్రబాబు సీఎం అయ్యాక.. మళ్లీ ఈ ప్రాజెక్టుకు ఊపిరి పోశారు. కేంద్రం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రంగంలోకి దిగారు. భూసేకరణ కోసం అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ.. ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు లేఖలు రాశారు.ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు భాగం 78 కి.మీ వరకు ఉంటుంది. పశ్చిమ భాగం 111 కి.మీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ మొత్తం పొడవు 189 కి.మీ ఉండనుంది. ఆరు లేన్లుగా ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో 150 మీటర్ల ఆర్‌వోడబ్ల్యూ, మూడు సొరంగాలు, తొమ్మిది ఇంటర్‌ఛేంజీలు, కృష్ణా నదిపై 2 వంతెనలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇది అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మచిలీపట్నం ఓడరేవుకు లింక్ కానుంది.2018 అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ. 17,761 కోట్లు, భూసేకరణకు రూ. 4,198 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వ్యయం పెరిగే అవకాశం ఉంది. మొత్తం దాదాపు రూ.25వేల కోట్లు ఖర్చు అవుతుందని ఎన్‌హెచ్ఏఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ సహా.. మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. దీంతో ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంది.
అమరావతి ప్రాంతంలోని 22 మండలాలు, 87 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం కానుందని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో భూములకు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న మైలవరం, గన్నవరం, నూజివీడు, గుడివాడ, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెడన, మచిలీపట్నం, దెందూలూరు నియోజకవర్గాల్లోని భూముల ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది