ఏలూరు, అక్టోబరు 9,
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా లిక్కర్ గురించే డిస్కషన్ నడుస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఎక్కడ నలుగురు కలిసినా వైన్ షాపుల గురించే మాట్లాడుకుంటున్నారు. లిక్కర్ బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో మద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు టెండర్లు వేస్తున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో.. యువత వాటిని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. మరోవైపు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఆడిటర్లు స్వయంగా ఎక్సైజ్ ఆఫీసులకు వచ్చి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. గతంలో మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నడిపిన వారే దరఖాస్తులు చేసుకుంటారని అధికారులు భావించారు. కానీ.. తాజాగా వస్తున్న దరఖాస్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు. వైన్ షాపుల కోసం ఇంత పోటీ ఉంటుందని ఊహించలేదని చెబుతున్నారు. విజయవాడ నగరం, గుంటూరు నగరం, తాడేపల్లి, మంగళగిరి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖ నగరంలోని వైన్ షాపుల కోసం పోటీ నెలకొందని అధికారులు చెబుతున్నారు. తిరుపతిలో పోటీ తక్కువగా ఉందని తెలుస్తోంది. షాపుల కేటాయింపు ప్రక్రియలో రాజకీయ జోక్యం గురించి కూడా చర్చ జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు వేయకుండా స్వయంగా ఎమ్మెల్యేలే ఆదేశాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. దరఖాస్తు దాఖలుకు ఇంకా 3 రోజుల సమయం ఉందని అధికారులు చెబుతున్నారు